భవ్య భీమవరంలో ప్రజలకు ఆహ్లాదాన్ని ఇచ్చే మరిన్ని ప్రాజెక్టులను తీసుకురానున్నాం–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
భీమవరం ఎడ్వర్డ్ ట్యాంక్ నందు బోటు షికార్ ప్రారంభం…
పెద్దలను, పిల్లలను ఆహ్లాదపరచనున్న బోటు షికారు..
భీమవరం పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు బుధవారం రెండవ బోటు షికారును నేడు అడ్వర్డు ట్యాంక్ నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, స్థానిక శాసనసభ్యులు మరియు పి ఏ సి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి తో కలిసి వాటర్ పెడల్ బోట్ షికారు ను ప్రారంభించి, కొద్ది సమయం బోటులో షికారు చేసి కార్యక్రమానికి హాజరైన వారిని ఉత్సాహపరిచారు.
జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ భీమవరం పట్టణంలోని బీవీ రాజు వీరమ్మ పార్క్ నందు బివి రాజు ఫౌండేషన్ సహకారంతో మొదటి బోటు షికారును నవంబర్ 1న ప్రారంభించుకోవడం జరిగిందని, రెండవ బోటు షికారును నేడు అడ్వర్డు ట్యాంక్ నందు ప్రారంభించడం జరిగిందన్నారు. సంక్రాంతి పండుగకు ముందు భీమవరం పట్టణం పరిసర ప్రాంతాలకు రాష్ట్రం, దేశంలోని అనేక ప్రాంతాల నుండి ప్రజలు తరలి వస్తారని, పిల్లలకు పెద్దలకు ఆహ్లాదకరంగా ఉండేందుకు బోట్ షికార్ ఉపయోగకరంగా ఉంటుందన్నారు. భీమవరం పట్టణం జిల్లా ప్రధాన కేంద్రమైన తరువాత భవ్య భీమవరం పేరుతో దాతల సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేయడం జరుగుచున్నదన్నారు. ఎడ్వర్డ్ ట్యాంక్ వైపుకు ఒకప్పుడు రావడానికి ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల నుండి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రూ.52 లక్షలతో జూపూడి శేఖర్, జూపూడి సంధ్య, రోటరీ క్లబ్ అధ్యక్షులు ప్రవీణ్, సభ్యులు, సహకారంతో పార్క్ అభివృద్ధి చేసి నేడు బోట్ షికారును ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. బీవీ రాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.1.6 కోట్లతో చిల్డ్రన్ పార్క్, డిజిటల్ లైబ్రరీ ఏర్పాటుకు ముందుకు రావడం, శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం బీవీ రామకృష్ణంరాజు రోడ్డులో ఎనిమిది లక్షలతో లైటింగ్ ఏర్పాటు చేయడం, బాంబే స్వీట్ యాజమాన్యం జెపి రోడ్డు మహాత్మా గాంధీ విగ్రహం వద్ద సుందరీకరణ పనులు చేయడం జరిగిందన్నారు. తదితర ఎన్నో కార్యక్రమాలను పలువురు దాతల సహకారంతో చేపట్టి భీమవరం సుందరీకరణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. భీమవరం పట్టణంలో పిల్లలు, పెద్దలు సెలవు రోజుల్లో ఆనందంగా గడపడానికి ఆహ్లాదకరమైన ప్రదేశాలు ఏమీ లేవని, దీని దృష్టిలో పెట్టుకొని దశలవారీగా పట్టణంలోని అన్ని పార్కులను అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగిందని, బోటు షికారులో ఏ విధమైన భయోందోళనలు లేకుండా పటిష్ట రక్షణ చర్యలను ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు. బోటింగ్ టైమింగ్స్, ఎంత సమయానికి ఎంత రుసుము చెల్లించాలి, తదితర వివరాలను సూచిస్తూ బోర్డును ఏర్పాటు చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణమును అభివృద్ధి చేయడంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చొరవ చూపటం అభినందనీయమన్నారు. భవ్య భీమవరం పేరుతో ఇప్పటికే చాలా అభివృద్ధి కార్యక్రమాలను చేయడం జరిగిందని, కలెక్టర్ సౌజన్యంతో ఇంకా మరింత అభివృద్ధి చేయడానికి పూర్తి సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నారు. భీమవరం పట్టణ నడిబొడ్డున ఎడ్వర్డ్ ట్యాంక్ ఆధునీకరణ చేసి బోట్ షికార్ ప్రారంభించుకోవడం సంతోషకరమని అన్నారు. బోట్ షికారు పట్టణ ప్రజలు పిల్లలు ఆహ్లాదకరంగా ఉంటుందని, పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీత రామలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, సహాయ కమిషనర్ ఏ.రాంబాబు, ఎంహెచ్ఓ సోమశేఖర్, మాజీ ఏఎంసి చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ మెరగాని నారాయణమ్మ, స్థానిక నాయకులు మెంటే పార్థసారథి, కోళ్ల అబ్బులు, మున్సిపల్ సిబ్బంది, ఎడ్వర్డ్ ట్యాంక్ నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.