జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు ఉన్నాయి, రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దు–జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి.
యూరియా కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బంది పెడితే కేసులు తప్పవ్
డీలర్లు యూరియాతో పాటు జింక్, గుళికలు కొనాలని రైతులకు ఇబ్బందిపెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
రైతులు యూరియా కొనుగోలులో ఏమైనా ఇబ్బందులు ఉంటే కంట్రోల్ రూమ్ నెంబర్ 83310 56742 కు తెలియజేయాలి.
కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నుండి మంగళవారం జిల్లా, మండల వ్యవసాయ శాఖ అధికారులు, ఎరువుల తయారీ కంపెనీల ప్రతినిధులు, హోల్ సేల్, రిటైల్ డీలర్లతో యూరియా లభ్యత, అమ్మకం ధరలు, యూరియాతోపాటు అదనపు ఉత్పత్తులను కొనమని ఇబ్బంది పెట్టడం తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్ మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు ఉన్నాయని రైతులు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదన్నారు. జిల్లాలో కొన్నిచోట్ల హోల్ సేల్, రిటైల్ డీలర్లు యూరియాతోపాటు జింక్, గుళికలు ముడిపెట్టి కొనుగోలు చేయాలని రైతులను ఇబ్బంది పెడుతున్నారన్న విషయం రైతుల ద్వారా తన దృష్టికి వచ్చిందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి చర్యలను ఉపేక్షించబోమని ఎవరైనా డీలర్లు రైతులను యూరియాతోపాటు అదనపు ఉత్పత్తులు కొనాలని వారి బలవంతం చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ జి ఎస్ ఎఫ్ సి, ఇఫ్కో, సిఐఎల్, ఎన్ఎఫ్ఎల్, ఆర్ సి ఎఫ్ ఎంసిఎఫ్ఎల్, ఐపిఎల్ కంపెనీల ప్రతినిధులతో యూరియాతో పాటు అదనపు ఉత్పత్తుల లింకుపై మాట్లాడారు. ఆయా కంపెనీ ప్రతినిధులు యూరియాతోపాటు ఎటువంటి అదన ఉత్పత్తులు తీసుకోవాలని చెప్పడం లేదని, రైతులకు అవసరమైన మేరకు యూరియాను సరఫరా చేయవలసిందిగా డీలర్లకు తెలియజేశామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ యూరియాతో అదనపు ఉత్పత్తులు కొనుగోలు ముడి పెట్టబోమన్నారు.
రాబోయే రెండు నెలలు రైతులకు యూరియా సరఫరా పై నిరంతరం పర్యవేక్షణ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ప్రతి ఆర్ ఎస్ కె స్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు 30 మంది రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకోవాలన్నారు. ప్రతి మండలంలో 100 మంది రైతులతో ఐవీఆర్ఎస్ ద్వారా మాట్లాడి యూరియా సరఫరా, ఎమ్మార్పీ ధరలు, లింకు ఉత్పత్తులు తదితర అంశాలపై అభిప్రాయాలు సేకరించాలన్నారు. జిల్లాలో యూరియా సరఫరా, అమ్మకం ధరలు, లింకు ఉత్పత్తులకు సంబంధించి రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు, మండల వ్యవసాయ శాఖ అధికారులు, వివిధ ఎరువుల కంపెనీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.