Close

రీ సర్వే పూర్తి అయిన గ్రామాలలో భూమి రికార్డుల్లో తప్పులను సరిచేసి రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను అర్హులైన వారికి పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు

Publish Date : 03/01/2026

గణపవరం మండలంలోని సిహెచ్ అగ్రహారం చిలకంపాడు స్కూలు వద్ద శనివారం ఏర్పాటుచేసిన మీ భూమి మీ హక్కు పట్టాదారు పాస్ పుస్తకములు పంపిణీ కార్యక్రమంనకు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఉంగుటూరు నియోజకవర్గం శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు ముఖ్య అతిథులుగా పాల్గొని 20 మందికి పట్టాదారు పాస్ పుస్తకములు అందజేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రీ సర్వే పూర్తి చేసిన గ్రామాలలో భూ రికార్డుల తప్పులు సరిచేసి మీ భూమి మీ హక్కు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో భాగంగా రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను అర్హులైన వారికి అందజేయడం జరుగుతుందన్నారు. జనవరి 2వ తేదీన ప్రారంభించిన ఈ కార్యక్రమం 9వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా రీసర్వే పూర్తి చేసుకున్న గ్రామాలలో ముందుగా షెడ్యూల్ లో ప్రకటించిన తేదీల ప్రకారం గ్రామ సభలు నిర్వహించి ప్రజాప్రతినిధుల సమక్షంలో కొత్త పట్టాదారు పాస్ పుస్తకములు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. రెవెన్యూ సేవలను ప్రజల ముంగిటికే వచ్చి అందిస్తున్నట్లు తెలిపారు. పాత పట్టాదారు పాస్ పుస్తకములను సంబంధిత రెవెన్యూ అధికారులకు అందజేసి కొత్త పాస్ పుస్తకములను పొందాలని సూచించారు. మీకు సంబంధించిన వివరాలు సరిగా ఉన్నవా లేవా అని పరిశీలించుకోవాలని, తద్వారా తప్పులు ఏమైనా ఉంటే సరిచేయించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. రీ సర్వేలో రికార్డుల తప్పులను సరిచేసి నాణ్యమైన పట్టాదారు పాస్ పుస్తకములను తయారుచేసి ప్రభుత్వ లక్ష్యంగా నూతన పట్టాదారు పాస్ పుస్తకములను అందజేస్తుందని దీనికి ఎటువంటి రుసుము చెల్లించిన అవసరం లేదని అన్నారు. రెవిన్యూ సేవలన్నీ గ్రామస్థాయిలో అందించడం జరుగుతుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా ఉంగుటూరు శాసనసభ్యులు పత్సపట్ల ధర్మరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రైతులు అన్ని విధాల సంతోషంగా ఉన్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం రైతులు పక్షపాతిగా పనిచేస్తుందని అన్నారు. రైతులను అన్ని విధాల ఆదుకొని పూర్తి సహకారం అందిస్తుందన్నారు. రీ సర్వేలో గత ప్రభుత్వాల్లో జరిగిన తప్పిదాలను సరిచేసి మీ భూమి మీ హక్కు పట్టాదారు పాసు పుస్తకములను ప్రభుత్వం అందిస్తుందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, తహసిల్దార్ వై కె వి అప్పారావు, డిటి విజయరత్నం, వీఆర్వో మాలతి, ప్రజా ప్రతినిధులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.