అన్ని రంగాలలో మహిళా సంఘాలను ప్రోత్సహిస్తున్నాం–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
2025 -26 సంవత్సరంలో ప్రభుత్వ పథకాల అమలులో మన జిల్లా మంచి ప్రగతి నమోదు.
ఐ వి ఆర్ ఎస్ కాల్స్ ద్వారా రెవిన్యూ, ధాన్యం సేకరణ, యూరియా అంశాలపై అభిప్రాయ సేకరణలో ప్రజల సంతృప్తి జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది.
జిల్లాలో ఎరువులకు ఇబ్బంది లేదు, ముందస్తు అన్ని చర్యలు తీసుకున్నాం
జిల్లాకు కోకోనట్ క్లస్టర్ మంజూరు అయ్యింది…
జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాత్రికేయుల సమావేశంలో పాల్గొని జిల్లా పురోభివృద్ధి, ఆర్థిక ప్రగతిని వివరించారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాత్రికేయులతో మాట్లాడుతూ 2025 – 26 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని అన్ని శాఖలు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు సాధించడం ద్వారా మంచి ప్రగతి నమోదు అయిందన్నారు. జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేసి లక్ష్య సాధనకు కష్టపడి పని చేశారన్నారు. మన జిల్లా వ్యవసాయ ఆధారితమైనదని, ఖరీఫ్ సీజన్లో రైతుల నుండి 4.33 లక్షల టన్నుల ధాన్యాన్ని 67 వేల మంది రైతుల నుండి సేకరించి 987 కోట్ల రూపాయలు 24 గంటల లోపుగా రైతుల ఖాతాలలోకి నేరుగా జమ చేయడం జరిగిందన్నారు. రబి సీజన్లో 2.25 లక్షల ఎకరాల పంట సాగుకు అవసరమైన 38 వేల మెట్రిక్ టన్నుల యూరియాను సిద్ధం చేయడం చేయడానికి అధికారులు అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది అన్నారు. యూరియా కొరత లేదని, ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. 100 నిరుపేద మత్స్యకారులకు నూరు శాతం సబ్సిడీతో రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో పీఎం లంకలో బోట్ల నిర్మాణం జరుగుతోందని ఎంపిక చేసిన మత్స్యకారులకు అందించడం జరుగుతుంది అన్నారు. వినూత్నమైన ఆలోచనతో గుర్రపు డెక్క నుండి కంపోస్టు తయారు చేసేందుకు మహిళా సంఘాలను ప్రోత్సహిస్తున్నామన్నారు.
జిల్లాలోని సిద్ధాపురం, కొలమూరు, గొల్లలకోడేరు, పాలకోడేరు, పెనుమదం, పోడూరు గ్రామాల్లో స్వయం సహాయక సంఘాల మహిళల ద్వారా 60 మెట్రిక్ టన్నుల ఎరువును ఉత్పత్తి చేసేలా ఆరు గుర్రపుడెక్క ఎరువుల తయారీ యూనిట్లను ఏర్పాటు చేయడమైనది. తాడేపల్లిగూడెంలో కోకో ఫామ్స్ ఉన్నాయని అక్కడ కోకో ఉత్పత్తుల ద్వారా మహిళా సంఘాల వారు చాక్లెట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం ద్వారా అభివృద్ధి పథంలో ముందుకు నడుస్తున్నారన్నారు. ఉండి మండలం మహాదేవపట్నం, తాడేపల్లిగూడెంలో చాక్లెట్ ఫ్యాక్టరీలు పెట్టడం జరిగింది అన్నారు. జిల్లాలో 60 మంది మహిళా సంఘాలకు సముద్రపు నాచు తయారీలో శిక్షణ ఇవ్వడం జరిగింది అన్నారు. జిల్లాలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణల తొలగింపు పై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందన్నారు. భీమవరం పట్టణంలో రోడ్డు అంచుల ఆక్రమణలు తొలగించి ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్న మన్నారు. ప్రభుత్వ పథకాలు అమలుపై వివిధ అంశాలకు సంబంధించి ఐవీఆర్ఎస్ ద్వారా సేకరించిన ప్రజాస్పందనలో రెవెన్యూ, ధాన్యం సేకరణ, యూరియా అంశాలలో ప్రజల సంతృప్తి స్థాయిలో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్నామన్నారు. మిగిలిన అంశాలలో 2,3,4 స్థానాలలో ఉన్నామన్నారు. తణుకు ఏరియా ఆసుపత్రికి 2024- 25 సంవత్సరానికి రాష్ట్రస్థాయి కాయకల్ప అవార్డు లభించింది అన్నారు. పాలకొల్లు ఏరియా ఆసుపత్రిలో 5 పడకల డయాలసిస్ యూనిట్లు ప్రారంభించు కున్నామన్నారు. జల జీవన్ మిషన్ కింద 335.75 కోట్ల వ్యయంతో 1,488 పనులు మంజూరు కాగా అందులో 914 పనులు పూర్తయ్యాయి అన్నారు. రూ.1,400 కోట్ల వ్యయంతో చేపట్టిన తీర ప్రాంత మంచినీటి ప్రాజెక్టు ద్వారా 2027 నాటికి 930 నివాసిత ప్రాంతాలకు తాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. పాఠశాల మౌలిక సదుపాయాలకల్పనలో జిల్లా రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకును అకాడమిక్ పెర్ఫార్మన్స్లో 5 వ ర్యాంకును సాధించిందని జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు.