ఉగాది నాటికి పీఎంఏవై 1.0 క్రింద 11,846 ఇళ్ల నిర్మాణాల లక్ష్యాన్ని నూరు శాతం పూర్తి చేయాలని గృహ నిర్మాణ శాఖ అధికారులకు ఆదేశాలు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
ఆప్షన్ త్రీ ఇళ్ల నిర్మాణాలను నిర్ణీత గడువులోపుగా పూర్తి చేయనందున అజాయ వెంచర్స్ ఎల్.ఎల్.పి గుత్తేదారుపై పోలీస్ కేసు నమోదు
గుత్తేదారులు ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలి
కలెక్టర్ క్యాంప్ కార్యాలయం సమావేశ మందిరము నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆప్షన్ -3 ఇళ్ళ నిర్మాణాలపై సంబంధిత గుత్తేదారులతో, పీఎంఈవై 1.0 ఇళ్ల నిర్మాణాల లక్ష్యాలపై గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్షించారు. పిఎంఏవై 1.0 ఆప్షన్ -3 ఇళ్ళ నిర్మాణాలలో అజాయ వెంచర్స్ ఎల్.ఎల్.పి వారు 2025 డిసెంబర్ నాటికి 1,780 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాల్సి ఉండగా కేవలం 7 ఇళ్లను మాత్రమే పూర్తి చేయడం జరిగిందన్నారు. ఇళ్ల నిర్మాణాలను నిర్ణీత లక్ష్యంలో పూర్తి చేయకుండా పూర్తి అలసత్వం వహించిన అజాయ వెంచర్స్ గుత్తేదారునికి ఇళ్ల నిర్మాణాలకు మ్యాప్ చేసిన డివిజన్ ల నందు పోలీస్ కేసులను నమోదు చేయడం జరిగిందని వెల్లడించారు. సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్క పేదవారి కల అన్నారు. దీనిని నెరవేర్చవలసిన బాధ్యత ప్రతి ఒక్క అధికారి, గుత్తేదారునిపై ఉందన్నారు. ఇంత బాధ్యత రాహిత్యంగా ఉంటూ పేదల ఇళ్ల నిర్మాణాలలో తీవ్ర జాప్యం క్షమించరానిదన్నారు. మిగతా గుత్తేదారులకు కేటాయించిన ఇళ్ల నిర్మాణాలను నిర్ణీత లక్ష్యంలో పూర్తిచేసి అప్పగించాలని ఆదేశించారు. అలసత్వం వహించే వారు ఎవరైనా సరే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆప్షన్ త్రీ కింద 6,271 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 1,191 ఇళ్ళను మాత్రమే పూర్తి చేయడం జరిగిందని, ఇంకా 5,080 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాల్సి ఉందన్నారు. పూర్తి చేయని పక్షంలో చర్యలకు వెనుకాడేదేలేదని గట్టిగా వక్కాణించారు. మిగతా గుత్తేదారులు కూడా ఇళ్ల నిర్మాణాలను వెంటనే పూర్తి చేసి అప్పగించాలన్నారు. పీఎంఏవై 1.0 లో వివిధ కేటగిరీల కింద జిల్లా మొత్తం 56,210 గృహ నిర్మాణాలు మంజూరు కాగా ఇప్పటివరకు 36,052 గృహ నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించడం జరిగిందన్నారు. ఉగాది నాటికి 11,846 ఇళ్ల నిర్మాణాలు లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని వీటిలో ఆప్షన్ త్రీ కింద 5,080, సొంత స్థలము కలిగిన వారు 677, లేఔట్లలో 6,089 ఇళ్ళు మొత్తం 11,846 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఉగాది నాటికి ఎట్టి పరిస్థితుల్లో 11,846 ఇళ్ల నిర్మాణాల లక్ష్యాన్ని నూరు శాతం పూర్తి చేయాలని గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి జి.పిచ్చయ్య, ఇళ్ల నిర్మాణాల గుత్తేదారులు, వారి ప్రతినిధులు, గృహ నిర్మాణ శాఖ డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.