జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి, అవాస్తవాలను నమ్మవద్దని రైతులకు సూచించిన–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
పెనుగొండ మండలం వడలి గ్రామంలో ప్రాథమిక సహకార పరపతి సంఘం వద్ద బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, యూరియా లభ్యత, అమ్మకాలపై రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి, అవాస్తవాలు నమ్మవద్దని తెలిపారు. రైతులు విజ్ఞప్తుల మేరకు జిల్లాలో ఎప్పటికప్పుడు యూరియాను అందుబాటులో ఉంచటం జరుగుతుందని భరోసా ఇచ్చారు. రైతులు అవసరం మేరకే యూరియాను పట్టుకు వెళ్లాలని సూచించారు. రైతు వారీగా అందవలసిన ఎరువులుకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేయాలని గ్రామ మండల స్థాయి అధికారులను ఆదేశించారు. ఎరువులు, పురుగు మందులు వాడకాన్ని తగ్గించి సేంద్రియ సాగుపై దృష్టి సారించాలని రైతులకు సూచించారు. ఎరువులు వినియోగం తగ్గిస్తే ఖర్చు కూడా తగ్గుతుందని అన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు సలహాలను, సూచనలను పాటించాలని అన్నారు. దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులు ఆదేశించారు.
అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పెనుగొండ తాహాసిల్దార్ కార్యాలయం ఆకస్మికంగా సందర్శించారు. రైతులకు పంపిణీ చేయడానికి వచ్చిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకములను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త సంవత్సరం 2026 జనవరి 2 వ తేదీ నుండి 9 వ తేదీ వరకు ఊరు ఊర గ్రామ సభలు నిర్వహించి పట్టాదారు పాస్ పుస్తకములను రైతులకు అందజేయుటకు ఏర్పాట్లు సిద్ధం చేయాలన్నారు. రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకం పంపిణీ చేయాలన్నారు. ప్రతి పట్టాదారు పాస్ పుస్తకమును క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. , పట్టా దారుని నెంబరు, ఫోటో, ఏమైనా తప్పులు ఉన్నాయా క్షుణ్ణంగా పరిశీలించాలని సంబంధిత అధికారులు ఆదేశించారు.
ఈ సందర్భంలో ఆర్డీవో దాసిరాజు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, మార్టేరు సబ్ డివిజన్ ఏడిఏ ఎం.వి రమేష్, తహసిల్దార్ జి.అనిత కుమారి, మండల వ్యవసాయ శాఖ అధికారి పి.స్పందన, వడలి సొసైటీ అధ్యక్షులు కట్ట రామకృష్ణ, డిటి రాజేష్ ,రైతులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.