సామాజిక పెన్షన్ల సొమ్మును భవిష్యత్తు అవసరాల కోసం లబ్ధిదారులు ఖర్చులు పోను ఎంతోకొంత దాచుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
పాలకోడేరు మండలం కుముదువల్లి పంచాయతీ చినపేట నందు డి.ఆర్.డి.ఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంలో జిల్లా కలెక్టర్ గారి కుమారుడు చదలవాడ భరత్ వృద్ధులకు పళ్ళను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా సామాజిక భదత్రా పింఛన్లను ఒకరోజు ముందుగానే ఈ రోజు డిసెంబర్ 31 వేకువజామునే ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసేలా సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. పింఛన్ల పంపిణీ సందర్భంలో జిల్లా కలెక్టర్ లబ్ధిదారుల క్షేమ సమాచారాన్ని, ఆరోగ్య విషయాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే దోమలను అరికట్టవచ్చు అని, తద్వారా అనారోగ్యం బారిన పడకుండా ఉంటారని హితవు పలికారు. జిల్లావ్యాప్తంగా నేడు 20 రకాల పెన్షన్లకు సంబంధించి రూ.97.19 కోట్లు 2,25,521 మంది లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. లబ్ధిదారులు పింఛన్ మొత్తాన్ని సద్వినియోగం చేసుకోవాలని, కొంత మొత్తాన్ని దాచుకుంటే భవిష్యత్ అవసరాలకు ఆసరాగా ఉంటుందని సూచించారు. ప్రతి ఒక్కరు పరిసరాల పరిశుభ్రత పాటించాలని, చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదని అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పి.డి ఎంఎస్ఎస్ వేణుగోపాల్, ఏపీవో ఎం.శ్రీనివాస ప్రసాద్, ఎంపీడీవో రెడ్డయ్య, తహసిల్దార్ ఎన్.విజయలక్ష్మి, సర్పంచ్ భూపతి రాజు వంశీకృష్ణ, ఈవోపీఆర్డి ఎంవీఎస్ రాంప్రసాద్, ఎంఈఓ పివీఎస్ నాగార్జున, స్థానిక కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
