విద్య, వైజ్ఞానిక ఆవిష్కరణలు విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించడంతోపాటు, దేశ పురోభివృద్ధికి దోహదపడతాయి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
వీరవాసరం ఎం ఆర్ కే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ ప్రదర్శనలను ప్రారంభించారు. తొలుత మ్యాజికల్ సైన్స్ పోస్టర్ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, శాసనమండలి సభ్యులు బొర్రా గోపి మూర్తి సంయుక్తంగా ఆవిష్కరించారు. అనంతరం శ్రీనివాస్ రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకుంటున్న జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలను అలంకరించి నివాళులర్పించారు. అలాగే భారతీయ భౌతిక శాస్త్రవేత్త సివి రామన్ చిత్ర పటానికి కూడా పూలమాలను అలంకరించి నివాళులర్పించారు. విద్యార్థులలో శాంతి, సౌబ్రాతృత్వం పెంపొందించేలా శాంతికపోతాలను ఎగరవేశారు. అనంతరం ఫ్లెగ్ వ్యాధి వ్యాక్సిన్ కనిపెట్టిన పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నివాసి ఎల్లాప్రగడ సుబ్బారావు రంగవల్లులతో చిత్రీకరించిన ప్రదర్శనను తిలకించారు. సైన్స్ ఫెయిర్ సందర్భంగా ఏర్పాటుచేసిన సెల్ఫీ పాయింట్ వద్ద ఫోటోలు దిగి విద్యార్థులను ఉత్సాహపరిచారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన సుమారు 146 సైన్స్ ఫెయిర్ ప్రదర్శనను జిల్లా కలెక్టర్ ఆద్యంతం పరిశీలించి విద్యార్థులను ప్రాజెక్టు వివరాలను అడిగి తెలుసుకుని అభినందించారు. చదువుతోపాటు విజ్ఞానాన్ని, సమాజంలో నూతన విషయాలను తెలుసుకోవడానికి వార్తాపత్రికలను కూడా రోజు చదవడం అలవాటు చేసుకోవాలని ఈ సందర్భంగా విద్యార్థులకు సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ చదువుతోపాటు అన్ని యాక్టివిటీస్ లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనాలని, విజ్ఞానంతో పాటు భవిష్యత్తు మార్గదర్శకంగా అవి నిలుస్తాయన్నారు. ఈరోజు మీరందరూ ఎంతో టెక్నాలజీని వినియోగించి సైన్స్ ఫెయిర్ నందు ప్రదర్శించడం, చిన్న వయస్సు ఉండే సైంటిఫిక్ పవర్ ను అలవర్చుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అప్పుడే జీవితంలో ఎంతో ముందుకు వెళ్ళడానికి దోహదపడుతుందన్నారు. ఇవన్నీ సాధారణంగా కొంచెం పెద్ద తరగతుల్లో వాళ్ళకి అవగాహనతో ఇంకా మరింత నేర్చుకోవడానికి పెద్ద పెద్ద ప్రాజెక్ట్ చేయడానికి ఇంకా ఉపయోగంగా ఉంటుందన్నారు. సైన్స్ ఫెయిర్ లో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, వారి వెనుక ఉండి ప్రోత్సహిస్తూ విద్యార్థులను ముందుకు నడిపిస్తున్న ఉపాధ్యాయులకు హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు తెలిపారు. 40 ఏళ్ల కిందట ఆకలితో వస్తువులు ఉండే చదువుకునే రోజులు ఉండేవని, నేడు విద్యార్థులకు అటువంటి పరిస్థితి లేదన్నారు. మీరు మంచి స్ట్రాంగ్ బేసిక్స్ తో మంచి అవగాహన కలిగి చదువుకుంటే మన దేశంలో, మన రాష్ట్రంలో ఉద్యోగాలకు కొదవలేదని, మంచిగా చదువుకోని, మంచి మార్కులతో పాస్ అయ్యి బయటకు వస్తే మీరు మంచి భవిష్యత్తుతో అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయని హితవు పలికారు. ఉపాధ్యాయులు ఎఫ్ ఎల్ ఎన్ ను, 10వ తరగతి విద్యార్థుల కొరకు వంద రోజులు యాక్షన్ ప్లాన్ సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ప్రభుత్వం విద్యార్థులలో చదువుతోపాటు వ్యక్తిగత పరిశుభ్రత, అలంకరణను పెంపొందించేలా “ముస్తాబు” పేరిట కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని, ఇంత చక్కటి కార్యక్రమాన్ని కొంతమంది వ్యంగ్యంగా చిత్రీకరిస్తూ లఘు చిత్రాలను ప్రచారం చేయడం తగదని సున్నితంగా హెచ్చరించారు. మనం ఆర్థికంగా ఉన్నతంగా ఉండటంతో మన పిల్లలు పరిశుభ్రత, అలంకరణ విషయంలో ప్రత్యేకంగా ఉంటున్నారని, వివిధ వర్గాలకు చెందిన దిగువ తరగతి పిల్లలు కూడా అలానే ఉన్నారని భావించకూడదన్నారు. వారిలో కూడా వ్యక్తిగత శుభ్రత, అలంకరణ ఎలా ఉండాలి అనేది నేర్పించడానికే ముస్తాబు కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. దీనివలన మంచే గాని ఎవరికి నష్టం లేదని, వ్యంగ్యంగా పరిహాసం చేయడం విజ్ఞానవంతులమైన మనకు సబబు కాదని హితవు పలికారు.
జిల్లా విద్యాశాఖ అధికారి ఇ.నారాయణ మాట్లాడుతూ నేడు జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్ ను నిర్వహించుకుంటున్నామన్నారు. జాతీయ స్థాయి పోటీలకి ఎంట్రీ కోసం మనకి రాష్ట్రస్థాయి పోటీలు జరుగుతాయన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ముందుగా జిల్లాలోని 233 పాఠశాలలో మండల స్థాయి పోటీలను నిర్వహించడం జరిగిందని, అక్కడ ఎంపిక చేసిన 146 ప్రాజెక్టులను నేడు జిల్లాస్థాయిలో ప్రదర్శనకు ఉంచడం జరిగిందన్నారు. విద్యార్థులు కూడా చాలా చక్కని ప్రాజెక్టులు తీసుకొచ్చారని అభినందించారు.
ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు బర్రా గోపి మూర్తి, సమగ్ర శిక్ష ఏపీసి పి.శ్యాంసుందర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జె.శ్రీనివాసరావు, డిప్యూటీ డీఈవో రమేష్, తణుకు డిప్యూటీ డిఇఓ సత్యనారాయణ, జిల్లా సైన్స్ ఆఫీసర్ వి పూర్ణచంద్రరావు, ఎంపీపీ వీరవల్లి దుర్గ భవాని, తహసిల్దార్ ఏవి రామాంజనేయులు, వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
