Close

సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ కొంత సమయాన్ని వ్యాయామానికి, క్రీడలకు కేటాయించాలి–రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ.

Publish Date : 21/12/2025

శారీరక, మానసిక ఆరోగ్యానికి క్రీడలు ఎంతో దోహదపడతాయి

భీమవరం డిఎన్ఆర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో ఆదివారం రాష్ట్రస్థాయి పురోహిత్ క్రికెట్ టోర్నమెంట్ సీజన్-3 క్రికెట్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, భీమవరం శాసనసభ్యులు మరియు రాష్ట్ర పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ మాట్లాడుతూ శారీరక, మానసిక ఆరోగ్యానికి క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. ప్రతి ఒక్కరూ కొంత సమయాన్ని వ్యాయామానికి, క్రీడలకు కేటాయిస్తే సంపూర్ణ ఆరోగ్యంగా జీవించగలుగుతామన్నారు. అన్ని రంగాలలో మాదిరిగానే క్రీడారంగంలో కూడా మేము ఉన్నాము అని పురోహితులు రాష్ట్రస్థాయిలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. నిరంతరం ఇటువంటి క్రీడ పోటీలలో పాల్గొని ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు.

జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పురోహితులు రాష్ట్రస్థాయిలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎప్పుడు దైవ సన్నిధిలో ఉండే పురోహితులు ఈ విధమైన క్రీడలు నిర్వహణకు ముందుగా రావడం గొప్ప విషయం అన్నారు. ఇటువంటి క్రీడా పోటీల ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం కలుగుతుంది అన్నారు. మంచి ఆరోగ్యానికి ఇటువంటి క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు.

భీమవరం శాసనసభ్యులు మరియు రాష్ట్ర పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్స్ పోటీలు భీమవరంలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. డిసెంబర్ 21 నుండి 28వ తేదీ వరకు జరిగే ఈ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు స్నేహపూరక వాతావరణంలో నిర్వహించుకుని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో డిఎన్ఆర్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సత్యనారాయణ రాజు, ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, నిర్వాహక సభ్యులు బ్రహ్మజ్యోసుల సుబ్రహ్మణ్య శర్మ, బ్రహ్మజ్యోసుల ప్రసాద్ శర్మ, చందూరి కామేశ్వరరావు శర్మ, చెరుకుపల్లి సంతోష్ కుమార్ శర్మ, పురోహితులు వేలూరి బుజ్జి, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.