Close

భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా తయారుచేసిన చేనేత, హస్తకళల ఉత్పత్తులను ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉంది–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 20/12/2025

శనివారం నర్సాపురం మండలం రస్తుంబాద ఇంటర్నేషనల్ లేస్ సెంటర్ నందు ఏర్పాటుచేసిన రెండవ హ్యాండీక్రాఫ్ట్ ఎక్స్పో -2025 ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన చేనేత, హస్త కళ ఉత్పత్తులతో ఇంత పెద్ద ఎత్తున నరసాపురాన్ని ఎంచుకొని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రదర్శనలోని ఉత్పత్తులు హ్యాండీక్రాఫ్ట్స్, ఫ్యాషన్ జ్యువెలరీ, గృహ ఉపకరణాలు, ఫర్నిచర్, లేసు ఉత్పత్తులు, కలంకారి వస్త్రాలు, హ్యాండ్ బ్యాగ్స్, రెడీమేడ్ వస్త్రాలు భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా ఉన్నాయి అన్నారు. వందల సంవత్సరాల నాటి కళా సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. హస్త కళా ఉత్పత్తులు అలంకరణకే కాకుండా రోజువారి వినియోగంలో ఉండే విధంగా రూపొందించి తీసుకురావడం గొప్ప విషయం అన్నారు. భారత దేశంలోని విభిన్న సంస్కృతులకు చెందిన హస్తకళ ఉత్పత్తులను తీసుకురావడం పట్ల కలెక్టర్ ఆనందం వ్యక్తం చేశారు. మన జిల్లా వాసులే కాకుండా సమీప జిల్లాల ప్రజలు కూడా ఈ హస్తకళల ఎక్స్‌పో నర్సాపూర్ – 2025 తిలకించి, కళాత్మక ఉత్పత్తులను కొనుగోలు చేసి చేనేత, హస్త కళలను ప్రోత్సహించాలన్నారు. 2వ హస్తకళల ఎక్స్‌పో నర్సాపూర్-2025 డిసెంబర్ 20 నుండి 24 వరకు జరుగుతుందన్నారు.

నర్సాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ గొప్ప వారసత్వం, సాంస్కృతిక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందిన నర్సాపురం లేస్ కుట్టుపని ఉత్పత్తులకు ప్రముఖ కేంద్రంగా అవతరించిందన్నారు. 2వ ఎడిషన్ హస్తకళల ఎక్స్‌పో – నర్సాపూర్ 2025 ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణమన్నారు. ఇది మన చేతివృత్తులవారి అసాధారణ నైపుణ్యం, సృజనాత్మకత మరియు అంకితభావాన్ని తెలియజేస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో నర్సాపురం ఆర్డీవో దాసిరాజు, డెవలప్‌మెంట్ కమిషనర్ హస్తకళలు కార్యాలయం ప్రాంతీయ సంచాలకులు లక్ష్మణ రావు, కోఆ-ఈపీసీహెచ్ సభ్యులు కె.ఎన్ తులసి రావు, ఈపీసీహెచ్ కార్యనిర్వాహక సంచాలకులు ఆర్. కె వర్మ, డిఆర్డిఏ పిడి ఎంఎస్ఎస్ వేణుగోపాల్ సీనియర్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.