Close

రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానంలో పశ్చిమను స్వచ్ఛ జిల్లాగా నిలిపేందుకు ప్రజలు, యువత భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు తెలిపారు

Publish Date : 20/12/2025

మూడవ శనివారం
స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా “పర్యావరణంలో అవకాశాలు” అనే థీమ్ తో
మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో భీమవరం విష్ణు కాలేజీ ఆడిటోరియం నందు నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీవో అండ్ భీమవరం మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ ప్రతి గ్రామం, ప్రతి పట్టణం మంచి పర్యావరణంతో నివాసయోగ్యంగా ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా స్వచ్ఛతపై ముందుకు కదలాలన్నారు. మితిమీరిన పొల్యూషన్ కారణంగా సుప్రీంకోర్టు ఢిల్లీని నివాసయోగ్యం కాదని ప్రకటించడం జరిగిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల మూడవ శనివారం ఒక థీమ్ తో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, దీనిలో భాగంగా ఇప్పటివరకు 12 స్వచ్ఛత కార్యక్రమాలను మన జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లా యంత్రాంగం ఎంత చేసినా, ప్రజల్లో మార్పు వస్తే గాని ఫలితం ఉండదు అన్నారు. ఒక్క భీమవరంలోనే ఉన్నన్ని హాస్పిటల్స్ నాకు తెలిసి ఈ ఐదు స్క్వేర్ కిలోమీటర్లు ఏరియాలో ప్రపంచంలో ఎక్కడా ఉండవని వ్యాఖ్యానించారు. ఇన్ని హాస్పిటల్స్ బిజీగా ఉన్నాయంటే అన్ని జబ్బులు నీటి కలుషితం వలన కావచ్చు, రకరకాలుగా కారణాలుగా ఉండొచ్చు అన్నారు. నీటి కలుషితం కాకుండా వాటర్ కన్జర్వేషన్ ఉండాలని, నీరు కలుషితం కాకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. చెత్తను మన ఇంటిని దాటించేస్తూ, మన ఇంటి వరకు బాగుంటే చాలు పక్క వాళ్ళు ఏమైతే ఏమిటి అనే దృక్పథం మంచిది కాదని హితవు పలికారు. ఒక చక్కటి వాతావరణంలో ప్రజలందరూ ఆనందంగా ఉండేవిధంగా మీ ఇల్లుని శుభ్రం చేసుకుంటూ, నీ చుట్టూ ఉన్న పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మన ఇంటిలోని వ్యర్ధాలను మంచినీళ్ల వనరులలో కలపడం, ఆ నీటినే మనం తాగడం జబ్బులు బారిన పడడంటం మళ్ళీ హాస్పిటల్స్ కి వెళుతున్నామనేది గ్రహించాలన్నారు. ఎక్కడ ఖాళీ ప్రదేశం ఉన్న అక్కడ పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. తడి చెత్త, పొడి చెత్త సేకరించి వేరే దగ్గరికి తీసుకెళ్లి ప్రాసెస్ చేసి వర్మీ కంపోస్ట్ తయారు చేయడానికి ప్రజలు చెత్తను వేరువేరుగా అందజేయాలని సూచించారు. కళాశాల విద్యార్థులు చాలా వినూత్నంగా ఎనర్జీ కన్జర్వేషన్, ఆల్టర్నేటివ్ మెటీరియల్స్ తో రూపొందించిన వస్తువులను ప్రదర్శించడం మంచి పరిణామం అని, వాటిని నిత్య వినియోగంలోకి తీసుకురావడం ద్వారా మంచి పర్యావరణాన్ని ఏర్పరచుకోగలుగుతామన్నారు. జిల్లా యంత్రాంగం నాయకత్వంలో మన జిల్లాను స్వచ్ఛ ఆంధ్రలో రాష్ట్రంలోనే ముందు ఉంచడానికి మనమందరం కృషి చేద్దాం అన్నారు. మనం చూస్తూ ఉండగా చెత్త వేసే వారికి అవగాహన కల్పించాలన్నారు. ఏ తప్పు జరిగిన జిల్లా యంత్రాంగం దృష్టి తీసుకురావాలని వెంటనే తగు చర్యలు తీసుకుంటారని ఈ సందర్భంగా తెలిపారు. నరసయ్య అగ్రహారంలో పార్కు అస్తవ్యస్తంగా ఉందని వార్త చదివిన వెంటనే జిల్లా యంత్రాంగానికి తెలియజేయడం, వారు వెంటనే క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి తగు చర్యలు తీసుకోవడం జరిగిందని ఒక ఉదాహరణగా తెలిపారు.

జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ చెత్త నిర్వహణ సక్రమంగా చేపట్టకపోతే మన జిల్లానే కాదు, ప్రపంచం మొత్తం పెద్ద ప్రమాదంలో పడుతుందన్నారు. విద్యార్థులు సమస్యలకు పరిష్కారాలను ఆవిష్కరించి అమలుకు ముందుకు రావాలన్నారు. విద్యార్థులు, ప్రభుత్వం భాగస్వామ్యంతో ప్రాజెక్టులను అమలు చేస్తే మంచి ఫలితాలను రాబట్ట వచ్చున్నారు. భీమవరం పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా రూపుదిద్దేందుకు ఎంతో కృషి చేస్తే గాని నేటికీ కొంత ఫలితాన్ని సాధించగలిగామని, ప్రజల భాగస్వామ్యం కూడా చాలా ముఖ్యమన్నారు. ప్రతి గంటకి ఒక కొత్త టెక్నాలజీ ఆవిష్కృతం అవుతుందన్నారు. పర్యావరణంలో, సమాజంలో ఏమైతే సమస్యలు ఉన్నాయో వాటి సమస్యలు పరిష్కారాల అభివృద్ధికి మీ యొక్క భాగస్వామ్యం ఏ విధంగా ఉండాలని కూడా విద్యార్థులు ఆలోచన చేయాలన్నారు.

తొలుత ఉప సభాపతి, జిల్లా కలెక్టర్ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా జిల్లాకు కేటాయించిన ఎనిమిది చెత్త సేకరణ ట్రక్ ఆటోలను జెండా ఊపి ప్రారంభించారు. రూ.3.30 లక్షల విలువ కలిగిన ఒక్కొక్క ఆటోను ఏడు నియోజకవర్గాలలోని నరసాపురం వేములవీదేవి వెస్ట్, పేరుపాలెం సౌత్, భీమవరం లోసరి, ఉండి దొండనపూడి, తాడేపల్లిగూడెం మాధవరం, ఆచంట వల్లూరు, పాలకొల్లు పాలకొల్లు రూరల్, తణుకు తేతలి
పంచాయతీలకు కేటాయించడం జరిగింది.

అనంతరం పలువురు విద్యార్థులు ప్రదర్శించిన పర్యావరణహిత ఆవిష్కరణలను స్వయంగా పరిశీలించి, వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను ఈ సందర్భంగా అభినందించారు. మేలైన ప్రాజెక్టులను వినియోగంలోనికి తీసుకురావడానికి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, భీమవరం ఆర్డీవో అండ్ మున్సిపాలిటీ స్పెషలాఫీసర్ కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కె. రామచంద్రారెడ్డి, డిపిఓ ఎం. రామ్నాథ్ రెడ్డి, విష్ణు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి. శ్రీనివాసరావు, స్వచ్ఛ ఆంధ్ర మిషన్ జిల్లా కోఆర్డినేటర్ పి.రోహిత్, మున్సిపాలిటీ సహాయ కమిషనర్ ఎ.రాంబాబు, ఎంహెచ్ఓ ఆర్.సోమశేఖర్, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.