Close

ఫిర్యాదుల పరిష్కారంలో అర్జీదారులు సంతృప్తి వ్యక్తం చేయాలి–జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Publish Date : 16/12/2025

ప్రజల నుండి అందిన ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి.

ఫిర్యాదుల పరిష్కారం పై అలసత్వం వహించే అధికారులపై చర్యలు ఉంటాయి.

మంగళవారం కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నుండి రెవెన్యూ సర్వీసులు, సర్వే, పీజిఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారంపై ఐ వి ఆర్ ఎస్ కాల్స్ ద్వారా ఫిర్యాదుదారుల నుండి సేకరించిన ప్రజాభిప్రాయంపై ఆర్డీవోలు, తహసిల్దార్లు, మండల సర్వేయర్లు, వీఆర్వోలు, డిజిటల్ అసిస్టెంట్లతో మండలాల వారీగా గూగుల్ మీట్ ద్వారా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సర్వీసులు, సర్వే, పీజిఆర్ఎస్ సమస్యల పరిష్కారంపై ఫిర్యాదుదారులు సంతృప్తి స్థాయి తక్కువగా ఉందన్నారు. సచివాలయానికి వచ్చే ఫిర్యాదుదారులతో సిబ్బంది వినయ పూర్వకంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కార చర్యలు తీసుకోవాలన్నారు. అర్జీదారి నుండి ఫిర్యాదులు తీసుకుని, నోటీసి ఇచ్చి క్షేత్రస్థాయిలో పర్యటించి వారితో మాట్లాడి నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. ఆన్లైన్ ద్వారా వచ్చే ఫిర్యాదులను నమోదు చేసుకొని, విచారించి పరిష్కరించాలన్నారు. మ్యుటేషన్ కు సంబంధించి సర్వే సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వే చేసిన అనంతరం సర్వే రిపోర్టును దరఖాస్తుదారులకు అందించాలన్నారు. సర్వే కి సంబంధించిన సమస్యల పరిష్కారంలో దరఖాస్తుదారుల నుండి సంతృప్తి స్థాయి లేనందున క్షేత్రస్థాయిలో పర్యటించి, సమస్యలను సంతృప్తికరంగా పరిష్కరించేలా చూడాలని జిల్లా సర్వే అధికారిని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది ఎవరైనా సమస్యల పరిష్కారానికి దరఖాస్తుదారుల నుండి సొమ్ము ఆశిస్తే చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమన్నారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఫిర్యాదుదారులు సంతృప్తి పడే విధంగా సమస్యలు పరిష్కారానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు.

ఈ గూగుల్ మీట్లో ఆర్డీవోలు, తహసిల్దార్లు, మండల సర్వేయర్లు, వీఆర్వోలు, తదితరులు పాల్గొన్నారు.