Close

భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ఆద్యులు మన అమరజీవి పొట్టి శ్రీరాములు.. ఆదర్శనీయులు, చిరస్మరణీయులు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 15/12/2025

అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ, నేటి రోజును ఆత్మార్పణ దినంగా మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలలో నిర్వహించాలని ఆదేశించిన నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్ వశిష్ట కాన్ఫరెన్స్ సమావేశ మందిరం అమర జీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఆంధ్రులకు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైన వారు పొట్టి శ్రీరాములు అని అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు తమిళనాడు రాష్ట్రం మద్రాసులో జన్మించారని, స్వాతంత్ర ఉద్యమాలలో చురుగ్గా పాల్గొన్నారని, 1952 సం.లో ఆయన సుమారు 58 రోజులు అకుంఠిత దీక్షతో ఆమరణ నిరాహార దీక్ష చేసి అమరులైన తర్వాత అప్పటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రకటించారని తెలిపారు. 1953 అక్టోబర్ 1 న తెలుగు మాట్లాడే ప్రజల కోసం కర్నూలు రాజధానితో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందన్నారు. వారి సేవలు ఆదర్శనీయం చిరస్మరణీయం అని, అంతటి గొప్ప వ్యక్తి గురించి తెలుసుకోవడం భావితరాలకు కూడా తెలియజేయడం ఎంతో అవసరమన్నారు. ఆయన మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనాధ్ధారణ అనే ఆశయాలు కొరకు జీవితాంతం కృషిచేసిన మహాననీయుడని పేర్కొన్నారు.

ముందుగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, పలువురు జిల్లా అధికారులు, జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంలో డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, డ్వామా పిడి డా.కె.సి హెచ్ అప్పారావు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎన్.వి అరుణ కుమారి, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఏ.వి సూరిబాబు, కలెక్టరేట్ ఏఓ ఎన్.వెంకటేశ్వరరావు, డిటీలు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.