ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్త దానానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
రక్తం కొరత కారణంగా ప్రాణాపాయ స్థితి, అనారోగ్యంతో ఏ ఒక్కరి ప్రాణం కోల్పోకూడదు.
శుక్రవారం కలెక్టరేట్ పీజీ ఆర్ఎస్ సమావేశ మందిరంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, పశ్చిమ గోదావరి జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కలెక్టరేట్ అధికారులు, ఉద్యోగుల రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అందరిలో స్ఫూర్తిని నడపడానికి స్వయంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి అభినందించారు. జెసి ని స్ఫూర్తిగా తీసుకొని మరింతమంది ముందుకు రావాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ రక్తం కొరతను నివారించేందుకు ప్రతి నెల 1వ, 3వ శుక్రవారాలు వివిధ ప్రభుత్వ శాఖలు రక్తదాన శిబిరాలలో పాల్గొని రక్తాన్ని అందజేయడం జరుగుతుందన్నారు. దీనిలో భాగంగా నేడు కలెక్టరేట్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు, ఇతర ఆరోగ్య అవసరాల దృష్ట్యా రక్తము కొరత కారణంగా ఏ ఒక్కరి ప్రాణము పోకూడదన్నారు. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్త దానానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు సకాలంలో రక్తం అందితే ఒకరి ప్రాణం కాపాడటంతో పాటు, ఒక కుటుంబాన్ని ఆదుకోవడమే అన్నారు. కావున ప్రతి ఒక్కరూ రక్తదానాన్ని సామాజిక బాధ్యతగా తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి స్వచ్ఛందంగా రక్తదానం చేసి అందరికీ స్ఫూర్తి దాయకంగా నిలిచారన్నారు. కలెక్టరేట్, జాయింట్ కలెక్టర్ కార్యాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది స్వచ్ఛందంగా రక్తదానం చేయడం పట్ల కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి రక్తదాతలకు బ్లడ్ డోనర్ సర్టిఫికెట్లను అందజేశారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, భీమవరం ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, డిఎం అండ్ హెచ్ ఓ జి గీతాబాయి, డీఈవో ఇ.నారాయణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షులు డా.ఎం ఎస్ వి శివరామ భద్రి రాజు, రెడ్‌క్రాస్ వైస్ చైర్మన్ వబిలిసెట్టి కనకరాజు, సభ్యులు కృష్ణరావు, తదితరులు పాల్గొన్నారు.