పల్స్ పోలియో కార్యక్రమం పై గ్రామ, మండల, డివిజనల్, మున్సిపల్, జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీలు నిర్వహించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
జిల్లాలో డిసెంబర్ 21 ఆదివారం నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో చేయాలి.
0-5 సంవత్సరాల వయసు గల ప్రతి చిన్నారికి పల్స్ పోలియో చుక్కలు అందించాలి.
గురువారం కలెక్టరేట్ పీజీ ఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా పల్స్‌పోలియో టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో డిసెంబర్ 21 ఆదివారం నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని అన్ని శాఖలు అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు. జిల్లాలో 2009 నుండి ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదు అన్నారు. భారతదేశంలో 2012 నుండి ఎక్కడ కూడా పోలియో కేసులు నమోదు కాలేదని, కానీ సమీప దేశాలైన బాంగ్లాదేశ్, పాకిస్తాన్లో కొన్ని కేసులు నమోదైన దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలు, బాలల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. జిల్లాలో ఈ నెల 21వ తేదీన ఉదయం 6.00 గంటల నుండి పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించాలని, దీనికి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలో 0-5 సంవత్సరాల వయసు గల 1,87,204 పిల్లలకు పోలియో చుక్కలు వేయవలసి ఉందన్నారు. 1,315 పోలియో బూత్‌లను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కార్యక్రమ నిర్వహణకు 5,520 మంది ఉద్యోగులకు విధులు కేటాయించడం జరిగిందన్నారు. ఆరోజు ఏ కారణం చేత అయినా తల్లిదండ్రులు పిల్లలకు పోలియో చుక్కలు వేయించకపోతే సిబ్బంది 22, 23 తేదీల్లో ఇంటింటికి వెళ్లి పిల్లలను గుర్తించి పోలియో వ్యాక్సిన్ అందించాలన్నారు. మూడు రోజలుపాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో నూరు శాతం శాతం లక్ష్యాలను సాధించేందుకు వీలుగా ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. పల్స్ పోలియో కార్యక్రమం జరిగే మూడు రోజులు జిల్లాలో ఎక్కడా కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. వలస కూలీలు, అసంఘిటిత కార్మికుల పిల్లలపై దృష్టి పెట్టాలన్నారు. ఊరు చివరిన గుడారాలు వేసుకున్న కుటుంబాలు పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బస్సు, రైల్వే స్టేషన్లు, ఆసుపత్రులు, తదితర ప్రాంతాల్లో పల్స్ పోలియో శిబిరాలు ఏర్పాటుచేసి పిల్లలకు పోలియో చుక్కలు వేయాలన్నారు. పల్స్ పోలియో కార్యక్రమం పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గ్రామ, డివిజన్, జిల్లా స్థాయిలో అవగాహన ర్యాలీలు నిర్వహించాలన్నారు. ఈ అవగాహన ర్యాలీలో అన్ని శాఖలు అధికారులు భాగస్వాములు కావాలన్నారు. పల్స్ పోలియో కార్యక్రమం పై రైల్వే స్టేషన్లు,బస్ స్టేషన్లలో అనౌన్స్మెంట్ల ద్వారా ప్రచారం చేయాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, డిఎం అండ్ హెచ్ ఓ గీతా భాయ్, ఐ సి డి ఎస్ పి డి. శ్రీలక్ష్మి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ దేవ సదాలక్ష్మి, సి హెచ్ ఎస్ పి.సూర్యనారాయణ, డి ఆర్ డి ఏ పిడి ఎం ఎస్ ఎస్ వేణుగోపాల్, డిపిఓ ఎం రామనాథరెడ్డి, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి జి.పిచ్చయ్య, గ్రామ వార్డు సచివాలయ అధికారి వై.దోసిరెడ్డి, డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ వి.ప్రసాద్, జిల్లా కార్మిక శాఖ అధికారి ఆకన లక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.