ఆర్థిక కారణాలతో చదువుని కొనసాగించలేని వారికి *”సరస్వతీ విద్యా నిధి” ద్వారా సహకారం… నేడు సభా వేదిక నుండి ప్రకటన–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం విద్యార్థుల భవిష్యత్ కి ఒక చక్కని దిశా నిర్దేశం ..
ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు మార్గ నిర్దేశంగా పిటిఎం దోహదపడుతుంది
విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలి.
శుక్రవారం భీమవరం మండలం గూట్లపాడు గ్రామంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం 3.O కి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తొలుత మా తెలుగు తల్లికి మల్లెపూదండ ప్రార్థనాగీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి.సత్యవాణి పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు సాధించిన ప్రగతి, ఉత్తీర్ణత శాతం తదితర వివరాలను వివరించారు. అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారి ఇ.నారాయణ జిల్లా విద్యాశాఖ ప్రగతిని సభలో వివరించారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశాలను గత డిసెంబర్, జూలై నెలలో నిర్వహించుకోవడం జరిగిందని, ఇది మూడో విడతని తెలిపారు.
జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లా అంతటా ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు పండుగ వాతావరణంలో పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశాలు నిర్వహించుకుంటున్నామన్నారు. ప్రభుత్వం ఒక నిర్దేశిత లక్ష్యంతో పిటిఎం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కార్యక్రమం విద్యార్థులకు ఒక దిశా నిర్దేశంగా దోహదపడుతుందన్నారు. ఈ ఆత్మీయ సమావేశాల ద్వారా పిల్లలు ఏ విధంగా చదువుకుంటున్నారు, ఉపాధ్యాయులు ఏ విధంగా బోధిస్తున్నారు అనేది తల్లిదండ్రులకు అవగాహన కలుగుతుందన్నారు. తద్వారా విద్యార్థుల యొక్క విద్యా ప్రమాణాల మెరుగుదలకు తోడ్పడుతుందన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలు స్కూలు నుండి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటున్నారు గమనించాలన్నారు. సమాజంలో తల్లి పాత్ర ఎంతో ముఖ్యమని, తల్లి జన్మనిస్తుందని, గురువు జ్ఞానాన్ని బోధిస్తారని, కావున విద్యార్థులు ఎల్లప్పుడు తల్లి, తండ్రి, గురువులకు కృతజ్ఞులుగా ఉండాలన్నారు. పిల్లలు తల్లిదండ్రుల చెప్పిన మాట విని వారు చెప్పిన ప్రకారం నడుచుకోవాలన్నారు. విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి పెట్టాలన్నారు. చెడు తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చినట్లు ఉన్నా, వెలుగులు నింపే జీవితకాలం ఆనందానికి దూరం కావాల్సి వస్తుందని ఇది ఎల్లప్పుడు గుర్తుంచుకోవాలన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని సూచించారు. ప్రభుత్వం విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుందని విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని వారి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలన్నారు. తల్లిదండ్రులు తాహతకు మించి అప్పులు చేసి ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. జిల్లాలో తల్లికి వందనం పేరిట 1.76 లక్షల మంది తల్లుల ఖాతాలలో రూ.220 కోట్లు జమ చేయడం జరిగిందని, ఈ పాఠశాలలో 290 మంది తల్లులకు రూ.43 లక్షల 53 వేల రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఏ యే సౌకర్యాలు కల్పిస్తున్నారో విద్యార్థులతో చెప్పించారు. విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెరిగేలా పుస్తకాల్లో ఉండే పాఠాలు కాకుండా జీవితాన్ని చక్కగా కొనసాగించేందుకు చాగంటి కోటేశ్వరరావు రచించిన “విలువల విద్య”ను కూడా అందిస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. విలువలు విద్య పాఠ్యాంశంలోని పద్యాన్ని సందీప్ చరణ్ చక్కగా చెప్పాడన్నారు. తల్లిదండ్రులు, ఊరి పెద్దలు పాఠశాలల అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని అప్పుడే పాఠశాల అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రైవేటు పాఠశాలలకు భిన్నంగా అసెస్మెంట్ బుక్స్, హోలి స్టిక్ ప్రోగ్రెస్ కార్డులను కూడా విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుందని తద్వారా విద్యార్థి చదువును కచ్చితంగా అంచనా వేయడానికి దోహదపడుతుందన్నారు. ఇదే పాఠశాలలో విద్యను అభ్యసించి ఐఐటి సీటు సాధించిన శ్రవణ్ కుమార్ గురించి, ఈ గ్రామం దగ్గరలోనే దొంగపిండి గ్రామంలో పూజ ఐఏఎస్ కు సెలెక్ట్ కావడం గురించి ఈ సందర్భంగా గుర్తుచేస్తూ, ఇది ఎంతో గర్వించదగిన విషయం అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు ఉంటారని, ఏ విద్యార్థికి ఎలా బోధించాలో బాగా తెలుసునన్నారు. “సరస్వతీ విద్యా నిధి” ఏర్పాటు చేస్తున్నామని సభా వేదిక నుండి ప్రకటించారు. చదువులో రాణిస్తూ ఆర్థిక ఇబ్బందులతో చదువుకోలేని వారికి సరస్వతి విద్యానిధి ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు. బాల్య వివాహానికి వ్యతిరేకంగా అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు, విద్యార్థులు లీప్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
తొలుత జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుతో కలిసి విద్యార్థి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డుపై ముఖాముఖి మాట్లాడి విద్యార్థుల విద్యా ప్రమాణాలను పరిశీలించారు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా తరచూ పాఠశాలలను సందర్శించి విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నారు, ఉపాధ్యాయులు ఏ విధంగా బోధిస్తున్నారు అనే విషయాలను తెలుసుకోవాలన్నారు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకుని తల్లిదండ్రులకు, పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులను కోరారు.
పాఠశాలలోని కెమిస్ట్రీ ల్యాబ్ ను జిల్లా కలెక్టర్ సందర్శించిన సందర్భంలో విద్యార్థుల తల్లిదండ్రులకు ల్యాబ్ ను చూపించి విద్యార్థులు చేసిన ప్రయోగాలను వివరించారు. పాల్ ల్యాబ్, లైబ్రరీ, కిచెన్ గార్డెన్ అన్నింటిని జిల్లా కలెక్టర్ నిశితంగా పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.
చివరిగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి క్రింద కూర్చుని సహపంక్తి భోజనం చేసి అందరికీ స్ఫూర్తినిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఇ.నారాయణ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి సత్య వాణి, ఎస్ఎంసి చైర్మన్ కె.రాంబాబు, వైస్ చైర్మన్ సాంబ, పంచాయితీ అధ్యక్షులు ఓ.మంగాచార్యులు, వైస్ ప్రెసిడెంట్ కొప్పర్తి సత్యనారాయణ, ఎంపీటీసీ కె.పద్మజ, విద్యాశాఖ ఎడి ఎమ్. త్యనారాయణ, ఎంఇఒ-1 ఎం శ్రీనివాసరావు, ఎండిఎం కోఆర్డినేటర్లు జి.చిన్నయ్య, కృష్ణారావు, కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ బొమ్మిడి మధుసూదన్, మానవ హక్కుల కమిటీ మెంబర్ వీరవల్లి వెంకట సుబ్రహ్మణ్యం, దాతలు కొప్పర్తి ప్రభాకర్ రావు, కొప్పర్తి పుల్లారావు, కొప్పర్తి నారాయణరావు, జె.గణేష్, బి.మధుసూదన్ రావు, వివి సుబ్రహ్మణ్యం, గ్రామ పెద్దలు, పాఠశాల పూర్వ విద్యార్థులు, స్కౌట్స్ అండ్ గైడ్స్, పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.