Close

పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరం పట్టణంలో నానాటికి పెరుగుచున్న వాహనాల రాకపోకలు సజావుగా సాగేందుకు “ట్రాఫిక్ ఫ్రీ” గా కృషి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.

Publish Date : 02/12/2025

ట్రాఫిక్ అడ్డంకుల నియంత్రణలో జిల్లా ప్రజలు, విద్యార్థులు క్రమశిక్షణతో వ్యవహరించాలి…

పట్టణాన్ని ట్రాఫిక్ ఫ్రీగా చేసుకోవడం మన అందరి బాధ్యత..

దండించి, భయపెట్టి ఆలోచన జిల్లా యంత్రాంగానికి, పోలీస్ శాఖకు లేదు.. ప్రజల స్వచ్ఛందంగా అవగాహన కలిగి మెలగాలి

ట్రాఫిక్ అవరోధాలను నిరోధించేందుకు రెవిన్యూ, పోలీస్, మున్సిపాలిటీ, తదితర శాఖలతో ఎన్ఫోర్స్మెంట్ టీంలు ఏర్పాటు..

ఎన్ఫోర్స్మెంట్ టీములు ట్రాఫిక్ అవరోధాల నియంత్రణకు గట్టిగా కృషి చేయాలి

మంగళవారం జిల్లా కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి సంయుక్తంగా సమావేశమై భీమవరం పట్టణంలో ట్రాఫిక్ అవరోధాలు, రోడ్లు అక్రమణ, సక్రమ పార్కింగ్, భద్రత లేని డ్రైవింగ్, తదితర అంశాలపై రెవిన్యూ, పోలీస్, మున్సిపల్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, రవాణా శాఖల అధికారులు, ఆటో డ్రైవర్స్ యూనియన్, బులియన్ మార్కెట్, కళాశాలల యజమాన్యాలు, కిరాణా మర్చంట్స్, లైన్స్ క్లబ్, తదితర స్వచ్చంద సంస్థలతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు వారి బాధ్యతలను విధిగా నిర్వహించాలని ఆదేశించారు. అలాగే ప్రజలు, విద్యార్థులు ట్రాఫిక్ పట్ల క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. ఆటో డ్రైవర్లు, ఆర్టీసీ డ్రైవర్ల తో సమావేశాలను ఏర్పాటు చేయాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను కచ్చితంగా తొలగించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. పాఠశాలల, కళాశాలల బస్సులన్నీ ఒకేసారి రోడ్డుపైకి రావడంతో ట్రాఫిక్ అవరోధం ఎక్కువగా ఉంటుందని యాజమాన్యాలతో సమావేశమై స్కూల్ బస్సులు రూట్ ప్లాన్ తయారుచేసి అమలు చేయాలని డిటిఓకు సూచించారు. రోడ్డు మార్జిన్ వైట్ లైన్ దాటి టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ ఎట్టి పరిస్థితుల్లో పార్కింగ్ చేయరాదని ఆదేశించారు. గీత దాటితే అపరాధ రుసుము విధించడం జరుగుతుందన్నారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. దుకాణదారులు వారి సామాగ్రిని రోడ్డుకి ఆనుకుని ఎట్టి పరిస్థితుల్లో ప్రదర్శించి ట్రాఫిక్ కు అవరోధం కలిగించవద్దని మరొకసారి తెలిపారు.

జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ గట్టిగా పాటించాలని, ఎవర్ని దండించే ఉద్దేశం మాకు లేదని, అటువంటి పరిస్థితి వస్తే దండన తప్పదని హెచ్చరించారు.

ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, అదనపు ఎస్పి వి.భీమారావు, భీమవరం ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, డి.ఎస్.పి డాక్టర్ శ్రీ వేద, మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, జిల్లా రవాణా అధికారి కృష్ణారావు, ఆర్టీసీ ఆర్ఎం ఎన్.వి.ఆర్ వరప్రసాద్, టౌన్ సిఐలు ఎం.నాగరాజు, జి.కాళీ చరణ్, తహసిల్దార్ రావి రాంబాబు, మున్సిపల్ సహాయ కమిషనర్ ఏ.రాంబాబు, టౌన్ సర్వేయర్ ఎస్.రమాబాయి, టిపిఓ సిహెచ్ పార్థసారథి, ఏసిపి ఏం.శ్రీలక్ష్మి, ఎస్సైలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, బులియన్ మార్కెట్, ఆటో డ్రైవర్స్ యూనియన్, రోటరీ క్లబ్, లైన్స్ క్లబ్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.