బాల్య వివాహాల నిరోధానికి ప్రతి ఒక్కరు తమ వంతు సామాజిక బాధ్యతగా గుర్తించాలి ….జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
గురువారం కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలో చైల్డ్ రైట్స్ అడ్వకేసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాల్య వివాహ ముక్తిభారత్ కార్యక్రమంలో భాగంగా 100 రోజుల ప్రచార కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాల నిరోధానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సామాజిక బాధ్యతగా సేవలందించాలన్నారు. నవంబర్ 27 నుండి మార్చి 8వ తేదీ వరకు ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. దేవాలయాలు, చర్చిలు, కళ్యాణ మండపాలలలో సంబంధిత వారిలో కూడా ఈ అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రతి గ్రామపంచాయతీ మున్సిపాలిటీ పరిధిలో కూడా పెద్ద ఎత్తున బాల్య వివాహాల నిరోధానికి ప్రచారం చేపట్టాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తల్లిదండ్రులు 18 ఏళ్ల లోపు బాలికలకు వివాహం చేయకూడదన్నారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వివిధ శాఖల జిల్లా అధికారులతో బాల్య వివాహాల నిరోధంపై ప్రతిజ్ఞ చేయించి 100 రోజుల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. వంద రోజుల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని ఐసిడిఎస్ పిడిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఐసిడిఎస్ పిడి డి.లక్ష్మి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎన్.వి అరుణ కుమారి, వివిధ శాఖల జిల్లా అధికారులు, చైల్డ్ రైట్స్ అడ్వకేసి ఫౌండేషన్ జిల్లా కోఆర్డినేటర్ ఆర్.శ్రీనివాస్, డిసిపిఓ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.