దివ్యాంగులు అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని సమాజంలో బాగా అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
డిసెంబర్ 3న నిర్వహించనున్న అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో డిఎన్ఆర్ కళాశాల క్రీడా ప్రాంగణం నందు ఏర్పాటుచేసిన పారా క్రీడల పోటీలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం లాంచనంగా ప్రారంభించారు. తొలుత పారా క్రీడల కోసం అవగాహన నడకను జిల్లా కలెక్టర్ పచ్చ జెండా ఊపి ప్రారంభించి, బధిర విద్యార్థులతో కలిసి నడిచారు. అనంతరం దివ్యాంగులను ఉత్సాహపరిచే విధంగా వారితో కలిసి స్వయంగా జిల్లా కలెక్టర్ క్రికెట్ ఆడి బ్యాటింగ్, బౌలింగ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ దివ్యాంగులు ఏరంగంలోను తీసిపోని విధంగా అన్ని రంగాల్లో పోటీ పడాలన్నారు. మీ సామర్థ్యం, మీ బలం మీకు తెలియదని వైకల్యం లేని వారి కంటే మీరు ఎంతో సమర్థులని పేర్కొన్నారు. మీ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయని, ఎన్నో అభివృద్ధి పథకాలతో పాటు ప్రోత్సాహాలను కూడా అందిస్తున్నాయన్నారు. సమాజం అభివృద్ధి యొక్క అన్ని అంశాలలో వికలాంగుల హక్కులు, శ్రేయస్సును ప్రోత్సహించడం, అందరికీ సమ్మిళిత సమాజం యొక్క ప్రయోజనాల గురించి అవగాహన పెంచడం లక్ష్యంగా పారా క్రీడలను నిర్వహించడం జరుగుతుందన్నారు. బ్యాడ్మింటన్ సింగిల్స్, డబుల్స్, క్రికెట్, 100 మీటర్ల పరుగు పందెం, షాట్ పుట్ నాలుగు విభాగాల్లో పారా అథ్లెట్ల కోసం బాల, బాలికలకు క్రీడలను నిర్వహించడం జరుగుతుందన్నారు. వివిధ బధిర పాఠశాలల నుండి సుమారు 80 మంది బాల, బాలికలు పారా క్రీడల నందు పోటీ పడనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి శాఖ అధికారి ఎం.మోహన్ దాస్, డిఎన్ఆర్ కళాశాల విసి గోకరాజు పాండురంగరాజు, సెక్రటరీ గాదిరాజు సత్యనారాయణ, రామకృష్ణంరాజు, పిడి బి.వి నరసింహారాజు, ఫిట్ జోన్ జిమ్ నిర్వాహకులు దాసరి చందు, భీమవరం వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కందుల సురేష్, పశ్చిమగోదావరి జిల్లా విజువల్లి చాలెంజ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కే.బాలాజీ, విజ్ఞాన వేదిక అధ్యక్షులు అల్లు శ్రీనివాస్, బధిర బాల, బాలికలు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.