సోమవారం కలెక్టరేట్ పి.జి.ఆర్.ఎస్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, గ్రామ వార్డు సచివాలయ అధికారి వై.దోసిరెడ్డి, డిపిఓ ఎం.ర
సోమవారం కలెక్టరేట్ పి.జి.ఆర్.ఎస్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, గ్రామ వార్డు సచివాలయ అధికారి వై.దోసిరెడ్డి, డిపిఓ ఎం.రామనాథరెడ్డి కలెక్టరేట్ ఏవో ఎన్.వెంకటేశ్వరావు అర్జీలు స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి నిర్ణీత గడువు లోపుగా నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. అర్జీదారులు సంతృప్తిచెందేలా సమస్యలను పరిష్కరించినపుడే ప్రభుత్వ అధికారులపై ప్రజలకు నమ్మకం కలుగుతుందన్నారు. అధికారులు లబ్ధిదారులతో స్వయంగా మాట్లాడి సమస్యలను లబ్ధిదారులు సంతృప్తి పడే విధంగా పరిష్కరించాలన్నారు. అర్జీలు పునరావృతం కాకుండా నాణ్యతతో పరిష్కరించాలన్నారు.
జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించడం జరిగింది. వాటిలో కొన్ని అర్జీలు ఈ విధంగా ఉన్నాయి.
@ పెనుమంట్ర మండలం వెలగలేరు గ్రామానికి చెందిన పడాల అన్నపూర్ణ అర్జీని సమర్పిస్తూ, తన భర్త మార్టేరు అగ్రికల్చర్ ఫారంలో ఉద్యోగం చేస్తూ 1997లో పదవి విరమణ చేశారని, అప్పటి నుండి వెలగలేరులో నివాసం ఉంటున్నామన్నారు. తన భర్త 2018లో చనిపోయారని, నా కుమారులు పట్టించుకోకపోవడం వల్ల తన కుమార్తెకు ఉన్న ఇంటి స్థలంలో చిన్న ఇల్లు వేసుకుని ఉంటున్నానన్నారు. నా కుమారులు, నాకున్న 30 సెంట్లు వ్యవసాయ భూమి, డబ్బు ఇవ్వమని, ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నారని కావున నాకు, నా ఆస్తికి రక్షణ కల్పించాలని కోరారు.
@ వీరవాసరం మండలం, జొన్నలపాలెం గ్రామానికి చెందిన మేడిది సువర్ణ కుమారి అర్జీని సమర్పిస్తూ, 2020లో తాను బ్రెస్ట్ క్యాన్సర్ ఆపరేషన్ చేయించుకున్నానని, ప్రస్తుతం చికిత్స పొందుతున్న అన్నారు. తన భర్తకు సరైన ఆదాయం లేక వైద్య ఖర్చులకు చాలా ఇబ్బందులు పడుతున్నానని, పింఛను మంజూరు చెయ్యాలని కోరారు.
@ గణపవరం మండలం, వీరేశ్వరపురం గ్రామస్తులు అర్జీ సమర్పిస్తూ, గ్రామానికి చెందిన ఎస్సీ స్మశాన వాటిక ఆక్రమణకు గురైందని భూ సర్వే చేసి ఆక్రమణలు తొలగించాలని కోరారు.
@ ఆకివీడు మండలం మాదివాడ గ్రామానికి చెందిన మోటుపల్లి నాగరాజు అర్జీ సమర్పిస్తూ, తాను పుట్టుకతో చర్మవ్యాధితో బాధపడుతున్నానని, ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నానని వికలాంగ పెన్షన్ మంజూరు చేయాలని కోరారు.
@ భీమవరం మండలం, తాడేరు గ్రామానికి చెందిన దాయం ఆశీర్వాదం అర్జీ సమర్పిస్తూ, తన చిన్న కుమారుడు దాయం ప్రసన్నకుమార్ తన పేరున వున్న నాలుగు సెంట్లు స్థలాన్ని నా చేత బలవంతంగా రాయించుకున్నాడన్నారు. తాము దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నమని, నెలకు పదివేల రూపాయలు మందులుకు ఖర్చవుతుంది అన్నారు. తన చిన్న కుమారుడు దాయం ప్రసన్నకుమార్ పై చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, వయోవృద్ధుల సంక్షేమం ట్రిబునల్ మెంబర్ మేళం దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.