Close

సోమవారం ఉండి మండలం చిలుకూరు గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మరియు ఉండి నియోజకవర్గం శాసనసభ్యులు కనుమూరి రఘురామకృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడా నాగరాణి సంయుక్తంగా ప్రారంభించి, రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.

Publish Date : 24/11/2025

సోమవారం ఉండి మండలం చిలుకూరు గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మరియు ఉండి నియోజకవర్గం శాసనసభ్యులు కనుమూరి రఘురామకృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడా నాగరాణి సంయుక్తంగా ప్రారంభించి, రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ రైతులు దేశ ఆరోగ్య ప్రయోజనాలను కాపాడేందుకు సాంప్రదాయ వ్యవసాయంపై ఆలోచన చేయాలన్నారు. విరివిగా ఎరువులు, పురుగు ముందుల వినియోగంతో మన ఆరోగ్యానికి మనమే వినాశనకారిగా మారామనేది గుర్తించుకోవాలన్నారు. ప్రభుత్వం రైతులకు అవగాహన కల్పించే దిశగా రైతన్న మీకోసం కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 24 నుండి నవంబర్ 29 వరకు చేపట్టడం జరిగిందన్నారు. వ్యవసాయ అధికారులు అభ్యుదయ రైతులను కలుపుకొని ప్రతి రైతు ఇంటికి వెళ్లి సాగులో యాంత్రికరణ వినియోగం వల్ల లాభం, పంట మార్పిడి, ఎరువులు అధికంగా వినియోగించడం వలన కలిగే నష్టాలు, తదితర సూచనలు సలహాలను అందజేయడం ద్వారా అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. రానున్న ఐదు సంవత్సరాలలో రైతును రాజును చేసేందుకు, ప్రభుత్వం ఐదు విధానాలతో కార్యాచరణను అమల్లోకి తీసుకురావడం జరిగిందన్నారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం నుంచి మద్దతు ధర అంశాలను విపులీకరిస్తూ కార్యాచరణను రూపొందించడం జరిగిందని రైతులు అవగాహన చేసుకుని ఆచరణలో ఉంచాలని తెలిపారు. గత వారం రోజుల కిందట ఉండి నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ.. పీఎం కిసాన్ పథకం కింద 9,629 ముందు రైతులకు రూ.6.61 కోట్లను రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగిందని తెలిపారు. రైతు బాగుంటానే రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటుందనేది కూటమి ప్రభుత్వం యొక్క మొదటి అంశం అన్నారు. ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను, సబ్సిడీలను అమలు చేస్తున్నదని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ మీ నియోజకవర్గ శాసనసభ్యులు కాలువలు, డ్రైన్లు ప్రక్షాళనకు పూనుకొనడంతో నేడు రైతులు నీటి ఎద్దడి లేకుండా, నీటి ముంపుకు గురికాకుండా పంటలు పండించుకోగలిగారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులపై అపారమైన దృష్టి పెట్టిందని అన్నదాత సుఖీభవ.. పీఎం కిసాన్ పథకం రెండో విడత కింద జిల్లాలో 1,03,761 మంది రైతులకు రూ.68.97 కోట్లను ఖాతాలలో జమ చేయడం జరిగిందన్నారు. రైతుల సంక్షేమం కోసం ఒక యాప్ ను కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని మీ పంట ఎలా ఉంది, సమయానుకూలంగా ఏ ఏ చర్యలు తీసుకోవాలి, పండిన పంట ధరలు ఏ విధంగా ఉన్నాయి, వేసిన పంట ఎప్పుడు కోతకు వస్తుంది, ప్రతిరోజు వాతావరణ పరిస్థితులు, దీనికి అనుగుణంగా చేపట్టవలసిన చర్యలు, తదితర వివరాలతో పాటు జిల్లా వ్యవసాయ అధికారి మొదలు గ్రామ వ్యవసాయ అధికారి వరకు అందరి సెల్ ఫోన్ నంబర్లతో సహా యాప్ లో పొందుపరచడం జరిగిందన్నారు. ఈరోజు మొదలు నవంబర్ 29వ తేదీ వరకు గ్రామ గ్రామాన అధికారులు పర్యటించి రైతులకు వ్యవసాయ పరిస్థితులపై అవగాహన, ప్రభుత్వం ప్రకటించిన ఐదు సూత్రాలపై అవగాహన, డిమాండ్ ఆధారంగా పంటలు వేయడం, ఎక్కువ నీటి ముంపుకు గురైన తట్టుకునే వరి వంగడాలను సూచించడం, పాడి రైతులకు అవసరమైన చర్యలను వివరించునున్నట్లు తెలిపారు. జిల్లాలో గత రబీ సీజన్లో ధాన్యం కొనుగోలు ఐదు మెట్రిక్ టన్నుల లక్ష్యం కాగా, లక్ష్యానికి మించి 7 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొనుగోలను రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని చేయడం జరిగిందన్నారు. జిల్లాలో రైతులకు సబ్సిడీపై రూ.3.8 కోట్ల విలువైన వ్యవసాయ యంత్ర పరికరాలను అందజేయడం జరిగిందని, మన ముఖ్యమంత్రి ఆకాంక్ష మేరకు అందరూ సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. రైతులను ప్రోత్సహించి వారి ఉత్పత్తులను ఫుడ్ ప్రాసెసింగ్ వైపు మళ్ళిస్తే లాభాలుగా మలుచుకోవచ్చని సూచించారు. ఏదైనా సమస్యలు ఉంటే జిల్లా యంత్రాంగం దృష్టి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని రైతులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, తహసిల్దార్ కె.నాగార్జున, ఎంపీడీవో ఎం వి ఎస్ ఎస్ శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ ముదునూరి వెంకట సోమరాజు, వీఆర్వో సిహెచ్ విజయలక్ష్మి, గ్రామ రైతులు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.