Close

ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాజీ పడవద్దు అని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు.

Publish Date : 22/11/2025

భీమవరం కొత్త బస్టాండ్ ఆర్టీసీ కాంప్లెక్స్ లో మరమ్మత్తుల్లో ఉన్న టాయిలెట్స్ ను రూ.14.5 లక్షల వ్యయంతో తిరిగి మరమ్మత్తులు చేసిన అనంతరం శనివారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు మౌలిక వసతులు కల్పించే విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడవద్దు అని సూచించారు. ప్రాంగణంలో ఉన్న అన్ని టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచేందుకు తగినంత సిబ్బందిని నియమించాలన్నారు. పరిశుభ్రమైన మరుగుదొడ్లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రయాణికులకు ఆరోగ్య భద్రత కల్పించిన వారమవుతామన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆక్వెన్స్ పెరిగిందని అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రాంగణమంతా పరిశుభ్రంగా ఉంచడంతోపాటు మొక్కలను కూడా నాటించాలని సూచించారు. మరుగుదొడ్లు మెయింటినెన్స్ లేకపోతే ఓపెన్ యూరినల్స్ కు ఎక్కువ అవకాశం ఉందని, ఇది బస్సు ప్రాంగణంలోనికి వచ్చే వారికి చాలా ఇబ్బందికరంగా ఉంటుందని తెలిపారు. బస్సు ప్రాంగణంలో ఎట్టి పరిస్థితుల్లో బహిరంగ యూరినర్స్ లేకుండా చూడాలని ఆదేశించారు. మరుగుదొడ్లు నిరంతరాయంగా శుభ్రపరుస్తూ ఉంటే బహిరంగ యూరినల్స్ కు ఆస్కారం ఉండదన్నారు. ఆర్టీసీ ప్రాంగణంలో ఉన్న క్యాంటీన్ ను డిపో మేనేజర్ ఆకస్మికంగా సందర్శించి స్వయంగా ఆహార పదార్థాలను రుచి చూడాలని ఆదేశించారు. క్యాంటీన్ పరిశుభ్రత, ఆహార పదార్థాలలో నాణ్యత లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని ఆదేశించారు. పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. బస్సు ప్రాంగణంలో బస్సు కోసం వేచి ఉన్న మహిళ ప్రయాణికులతో, మహిళా కండక్టర్ లతో కొద్ది సమయం మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు.

ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి ఎన్.వి.బి వరప్రసాద్ మాట్లాడుతూ గతంలో సుమారు 25 వేల మంది మహిళలు ప్రతిరోజు బస్సులలో ప్రయాణించే వారని, ఉచిత బస్సు ఏర్పాటు చేసిన తర్వాత సుమారు 38వేల మంది మహిళలు ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు అనుగుణంగా బస్ డిపోలో మరమ్మత్తులకు గురైన టాయిలెట్స్ ను తిరిగి మరమ్మత్తులు చేసి సిద్ధం చేయడం జరిగిందన్నారు. ఒకటవ బ్లాక్ లో పురుషులకు 4, మహిళలకు 4 టాయిలెట్స్ ను, ప్రత్యేకంగా పురుషులకు యూరినల్స్ కు 6 బ్లాక్ లను, అలాగే రెండవ బ్లాక్ అమలాపురం బస్సు పాయింట్ నందు పురుషులకు 4, మహిళలకు 4 మరుగుదొడ్లు, యూరినల్స్ కు 6 బ్లాక్స్, పురుషులకు స్నానం చేసే సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఉచిత బస్సు ఏర్పాటుచేసిన తరువాత మహిళలు ఎక్కువగా పాలకొల్లు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి సర్వీసులో ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. సిబ్బంది రెస్ట్ రూమ్స్ ని కూడా రూ.3 లక్షల వ్యయంతో రెన్నోవేషన్ చేస్తున్నట్లు తెలిపారు.

చివరిగా బస్సు ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మొక్కను నాటారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా ప్రజా రవాణా అధికారి ఎన్.వి.ఆర్ వరప్రసాద్, డిపో మేనేజర్ వై.వేణు, మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, తహసిల్దార్ రావి రాంబాబు, ఆర్టీసీ పిఓ ఎల్.గీత వాణి, ఓ.పి.డి ఆర్.బాలసుబ్రమణ్యం, ఏవో ఎస్.వి రావు, అసిస్టెంట్ మేనేజర్ వై.సురేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.