పీఎం స్వనిది పథకం కింద బ్యాంకర్లు వీధి వ్యాపారులకు మానవతా దృక్పథంతో రుణాలు అందించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు బ్యాంకర్లు లబ్ధిదారులకు రుణాలు అందజేసి వారి ఆర్థిక పురోగతికి సహాయపడాలి
గృహ, వ్యవసాయ, విద్య రుణాలు మంజూరులో బ్యాంకర్లు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి.
సి.సి.ఆర్సి కార్డులు కలిగిన కౌలు రైతులకు, పశు కిసాన్ కార్డుదారులకు రుణాలు అందించడంలో బ్యాంకర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలి
దీర్ఘకాలంగా లావాదేవీలు నిర్వహించని బ్యాంకు ఖాతాదారులు తమ బ్యాంకు అకౌంట్ లో ఉన్న సొమ్మును తిరిగి తీసుకునేందుకు రిజర్వ్ బ్యాంకు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
గురువారం జిల్లా కలెక్టరేట్ పి.జి.ఆర్.ఎస్ సమావేశ మందిరంలో జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశం & జిల్లా స్థాయి సమీక్ష కమిటీ సమావేశం (బ్యాంకర్ల సమావేశం) జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సి సి ఆర్ సి కార్డుల మంజూరు, పశు కిసాన్, ఎస్ హెచ్ జి, ఎం సి పి, పి ఎం స్వనిధి, పి ఎం ఈ జి పి, వీవర్స్ ముద్ర యోజన, పీఎం విశ్వకర్మ, సూర్యాఘర్, విద్యా రుణాలు, తదితర అంశాల ప్రగతిపై జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బ్యాంకర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల అమలులో అర్హులైన లబ్ధిదారులకు రుణాలు అందించడంలో చిన్న బ్యాంకుల కన్నా పెద్ద బ్యాంకులు వెనుకబడి ఉన్నాయన్నారు. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు నిర్దేశించిన లక్ష్యాలను నూరు శాతం సాధించడం పై రీజినల్ మేనేజర్ శ్రీదేవిని ఈ సందర్భంగా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. బ్యాంకులు లబ్ధిదారులకు అందించిన రుణాల ప్రగతిపై ప్రతివారం నివేదికలు అందజేయాలని బ్యాంక్ అధికారులకు సూచించారు. జిల్లాలో వ్యవసాయ, గృహ, విద్యా రుణాలపై బ్యాంకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఉన్నత విద్యకు విద్యా రుణాలు అందజేయడంలో బ్యాంకులు దృష్టి పెట్టాలని, విద్య రుణాలు పై విద్యాసంస్థల్లో తల్లిదండ్రులకు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని బ్యాంకర్లకు సూచించారు. పీఎం స్వనిది పథకం కింద వీధి వ్యాపారులకు రుణాలు అందించడంలో బ్యాంకర్లు ముందుకు రావాలన్నారు. వీవర్స్ ముద్రా రుణాలు మంజూరులో బ్యాంకర్లు శ్రద్ధ చూపాలన్నారు. డ్వాక్రా రుణాలు జాప్యం లేకుండా మంజూరు చేయాలన్నారు. పి ఎం ఈ జిపి, పిఎం ఎఫ్ఎంఈ రుణాల మంజూరులో దరఖాస్తులు వచ్చిన వెంటనే మంజూరు చేసి యూనిట్ల స్థాపనకు సహకరించాలని కోరారు. విశ్వకర్మ పథకం కింద రుణాలు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే మంజూరు చేయాలన్నారు. పి యం సూర్యఘర్ రుణాలు మంజూరులో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బ్యాంకర్లను ఆదేశించారు.
భీమవరం శాసనసభ్యులు రాష్ట్ర పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు రుణాలు మంజూరులో బ్యాంకులు శ్రద్ధ చూపడంలేదన్నారు. విద్యార్థుల ఉన్నత విద్యకు విద్య రుణాలు అందజేస్తే వారు గొప్ప వ్యక్తులుగా తయారవుతారన్నారు. చిన్న వ్యాపారులకు సరళతరంగా రుణాలు అందజేస్తే ఎన్నో కుటుంబాలు బాగుపడతాయన్నారు. కోట్లాది రూపాయలు రుణాలు మంజూరుపై కన్నా చిరు వ్యాపారాలుకు రుణాలు అందజేయడంపై మానవతా దృక్పథంతో పరిశీలన చేయాలన్నారు. వచ్చే సమావేశం నాటికి ప్రభుత్వ పథకాలకు రుణాల మంజూరులో మంచి ప్రగతి నివేదికలతో హాజరు కావాలన్నారు. ఈ సందర్భంగా 2024 – 25 మెప్మా “అవని” వార్షిక సంచిక ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, పులపర్తి రామాంజనేయులు ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఎ.నాగేంద్ర ప్రసాద్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ వి.సత్యనారాయణ, నాబార్డ్ డిడి నిష్యంత్ చంద్ర, ఆర్బిఐ ప్రతినిధి రామకృష్ణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, జిల్లా చేనేత, జౌళి శాఖ అధికారి ఎ.అప్పారావు, పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ జవ్వార్ హుస్సేన్, మెప్మా అధికారి హెప్సిబా, వివిధ శాఖల జిల్లా అధికారులు, వివిధ బ్యాంకుల కంట్రోలర్, జూనియర్ ఆఫీసర్స్, కోఆర్డినేటర్స్, తదితరులు పాల్గొన్నారు.