అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం ద్వారా చేకూరుతున్న లబ్ధి రైతు కష్టానికి చేదోడు వాదోడుగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
బుధవారం వీరవాసరం మండలం రాయకుదురు గ్రామం కోపరేటివ్ బ్యాంకు ఆవరణలో వ్యవసాయ శాఖ ద్వారా ఏర్పాటుచేసిన “అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్” పథకం రెండవ విడత నిధుల విడుదల కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భీమవరం శాసనసభ్యులు మరియు పిఎసి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామ లక్ష్మి, ఏఎంసీ చైర్మన్ కలిదిండి సుజాత, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఈరోజు రైతులందరికీ చాలా శుభదినం అన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,03,761 మందికి రైతులకి రూ.68.97 కోట్ల రూపాయలు వారి ఖాతాలలో జమచేయడం జరుగుతుందన్నారు. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇస్తున్న సొమ్ము అని, దీనిలో అత్యధికంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి రైతుకు రూ.5 వేలు చొప్పున, కేంద్ర ప్రభుత్వం రూ.2 వేలు ఇస్తున్నదని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నాయన్నారు. రైతులకు మన ముఖ్యమంత్రివర్యులు తరచూ ప్రొడక్టివిటీ పెరగాలి, క్వాలిటీ ప్రొడక్షన్ పెరగాలి అని చెప్తూ ఉంటారన్నారు. మన జిల్లాలో ప్రోడక్టివిటీ చాలా బాగున్నప్పటికీ పంట మార్పిడి లేదని, కేవలం వ్యవసాయం వరి మాత్రమే పండిస్తున్నాము అన్నారు. ఖరీఫ్ సీజన్లో మనవద్ద ప్రభుత్వం ఐదు లక్షల మెట్రిక్ టన్లు తీసుకుంటున్నారని, గత రబీ సీజన్లో ఏడు లక్షలు మెట్రిక్ టన్నులు, బహుశా రాష్ట్రంలో అత్యధికంగా మన జిల్లా నుంచే కొనుగోలు చేసి, రైతులకి 24 గంటల్లోపే వారి ఖాతాలలో డబ్బులు జమచేయడం జరిగిందన్నారు. మన వ్యవసాయ అధికారులు సూచనల మేరకు నేచురల్ ఫార్మింగ్ ను రైతులు ఫాలో అవ్వాలన్నారు. ప్రతి మంగళవారం, బుధవారం పొలం పొలంబడి కార్యక్రమానికి రైతులు తప్పకుండా హాజరుకావాలని, ఆర్గానిక్ ఫార్మింగ్ ఎరువులు వాడకం తగ్గించే విధంగా మీరు పంటలు పండించడానికి ముందుకు రావాలని నేను మిమ్మల్ని అందరిని కోరుచున్నానన్నారు. ఇది మన ఆరోగ్యం అంటే రైతు ఆరోగ్యము, పొలంలో పనిచేసే కూలీల ఆరోగ్యంతో పాటు ఆహారాన్ని దేశవ్యాప్తంగా భుజించే వాళ్ళు ఆరోగ్యం కూడా బాగుండాలి అంటే ఇది కచ్చితంగా పాటించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అలాగే జిఎస్టి తగ్గింపు కారణంగా రైతులు ఎంతో లాభం పొందారని, మన దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుల సంక్షేమమే ధ్యేయంగా 18% వరకు ఉన్న జిఎస్టిని ఐదు శాతం తగ్గించడం జరిగిందన్నారు. దీని కారణంగా వ్యవసాయానికి వినియోగించే యంత్రాలు చాలా ధరలు తగ్గాయని, ట్రాక్టర్ మీద అయితే ఇంచుమించు లక్ష రూపాయలు వరకు కూడా రేట్లు తగ్గడం జరిగిందన్నారు. దీనితోపాటు ప్రజలందరకు మేలు జరగడం మనమందరం చూస్తూనే ఉన్నామన్నారు. అర్హులైన రైతులకు నగదు జమ కాకపోతే వారి దగ్గరలో ఉన్న వ్యవసాయ అధికారిని సంప్రదించాలన్నారు. మనకు సుమారు 1,30,000 మంది అకౌంట్స్ ఉంటే ఒక వెయ్యి కూడా ఇష్యూస్ లేవు అని, ఎవరైనా ఒకరిద్దరికి ఇష్యూ ఉంటే మీ అమౌంట్ లో నగదు పడకపోతే మీ దగ్గరలో ఉన్న వ్యవసాయ అధికారిని కలిసి సమస్యను పరిష్కరించుకోవాలన్నారు.
భీమవరం శాసనసభ్యులు మరియు పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రంలో 46 లక్షల 85 వేల 835 మంది లబ్ధిదారులకు మూడు కోట్ల 135 లక్షలు నేడు అకౌంట్లో జమ చేయడం జరుగుతుందన్నారు. భీమవరం నియోజకవర్గంలో 8335 మంది రైతులకు ఐదు కోట్ల 68 లక్షలు ఇవ్వటం జరుగుతుందన్నారు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం 5 వేల రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 2 వేల రూపాయలు కలిపి మొత్తం 7 వేల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేయడం జరుగుతుందన్నారు. కొంతమంది మా అకౌంట్లో పడలేదు, మాకు కొంచెం ఇబ్బంది ఉన్నాయని తెలియజేస్తున్నారు. ఎవరు అర్హులు కాదో తెలిస్తే ఇటువంటి ఇబ్బందులు ఉండన్నారు. రాజ్యాంగ పదవులు ఉన్నవారు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, మేయర్లు, అధికారులు, పంచాయతీ ఉద్యోగులకు, నెలకి 10 వేల రూపాయలు పెన్షన్ తీసుకున్న వారికి అర్హత లేదన్నారు. అలాగే ప్రొఫెషనల్ డాక్టర్స్, న్యాయవాదులు, సిఏలు, ఇంజనీర్ లకి కూడా అర్హత లేదన్నారు. సాగు భూమిని ప్లాట్లు కింద మార్చితే ఆ భూమికి అర్హత లేదని, వ్యవసాయ భూములకు మాత్రమే అర్హత ఉందన్నారు. కనీసం ఆర ఎకరం ఉండి కూరగాయలు, పుష్పాలు సాగు చేసేవారు కూడా అర్హులే అన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలు పెట్టి అన్ని పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు. రూ.3 వేల పెన్షన్ ను రూ.4 వేలుగా పెంచామన్నారు. రైతు భరోసా కింద రూ.20 వేల రూపాయలు మూడు దఫాలుగా వేస్తున్నామన్నారు. మహిళలకు ఫ్రీ ఆర్టీసీ బస్సు, మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, తదితర కార్యక్రమాలు అన్ని అమలు చేస్తున్నామన్నారు. ప్రజలు గమనించవలసింది ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సంక్షేమం అమల్లో వెనుకడుగు వేయలేదు అన్నారు. గుంటలు పడిపోయిన రోడ్లు అన్నిటికి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ పూడ్చాం అన్నారు. మరల ఇప్పుడు పాడైపోయి రోడ్లన్నీ వేయవలసిన బాధ్యత ఉంది, అన్ని చేయాలంటే మీరు కూడా సహకరించాలి, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సహకారంగా ఉండబట్టే ఈ కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నామన్నారు. ఈ రైతు భరోసా నాకు 20 వేల రూపాయలే కదా వస్తుంది అనుకుంటున్నారు, అది ప్రభుత్వానికి ఎంత భారం అంటే 6,310 కోట్లు రూపాయల ఖర్చు అవుతుందని గమనించాలన్నారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మీ అందరికి తెలుసు పశ్చిమ గోదావరి జిల్లా అంటేనే వ్యవసాయం, వ్యవసాయం అంటేనే పశ్చిమగోదావరి జిల్లా. మన జిల్లా వ్యవసాయ రంగం అయితేనేమి, ఆక్వా రంగం రంగం అయితేనేమి మొట్టమొదటి స్థానంలో ఉంటుంది. అలాంటి వ్యవసాయరంగం అభివృద్ధి కోసం మనం మన ప్రభుత్వం తరఫున పథకాలను మన జిల్లాలో అమలు చేసుకుంటున్నాము అన్నారు. దీనిలో భాగంగా అన్నదాత సుఖీభవ తరుపున కొంత కేంద్ర ప్రభుత్వం రూ.2 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు మొత్తం 7 వేలు ఈ రెండో విడతలో జమ చేయడం జరుగుతుందన్నారు. వ్యవసాయ రంగంలో కొత్త టెక్నాలజీస్ ని అందిపుచ్చుకోవడంలో మన జిల్లా ముందస్తుగా ఉందని, ప్రభుత్వ మార్గదర్శకం మేరకు ఒక పెద్ద కార్యక్రమం మన జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని, మన జిల్లా మొత్తం దాదాపు రెండు లక్షల ఎకరాల్లో పండిస్తున్న వరి పంట మొత్తం కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతుల నుండి కార్పొరేషన్ కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. నా విజ్ఞప్తి ఏంటి అంటే రైతులందరికీ కూడా ఈ పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ సంబంధించి వస్తున్న ఈ పెట్టుబడి ఏదైతే ఉందో దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
చివరిగా భీమవరం నియోజవర్గానికి సంబంధించి 8,335 మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.5.68 కోట్ల నమూనా చెక్కును, వడ్డీ రాయితీ చెక్కులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, తదితరుల చేతుల మీదుగా రైతులకు అందజేశారు.
భీమవరం ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, ఏడిఏ సిహెచ్.శ్రీనివాస్, తహసిల్దార్ ఏవి రామాంజనేయులు, ఏఎంసీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, సర్పంచ్ గడ్డం భారతి, ఎంపీపీ వీరవల్లి దుర్గా భవాని, జడ్పిటిసి గుండా జయ ప్రకాష్ నాయుడు, ఎంపీటీసీ కడలి నెహ్రూ, సొసైటీ చైర్మన్ తోట విజయ్, ఎక్స్ ఎంపీపీ వీరవల్లి చంద్రశేఖర్, కూటమి నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.