రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా జరగాలి
రైతు సేవా కేంద్రాల ద్వారానే ధాన్యం కొనుగోలు చేయాలి
ఆచంట నియోజకవర్గంలో ఖరీఫ్ 2025-26 సీజన్ వరి కోతలు ప్రారంభం అయినందున ధాన్యము కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పగడ్బందీగా ఉండాలని సంబంధిత శాఖల అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆచంట మండల పరిషత్ కార్యాలయంలో నియోజకవర్గస్థాయిలో ఆచంట, పోడూరు, పెనుగొండ, పెనుమంట్ర మండలాలకు సంబంధించిన ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జిల్లా, మండల స్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఖరీఫ్ 2025-26 సీజన్ సంబంధించి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై రెవిన్యూ, వ్యవసాయ, సహకార శాఖ అధికారులుతో మాట్లాడారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎంతమేర వరి కోతలు ప్రారంభమయ్యాయి, ఎన్ని మెట్రిక్ టన్నులు వచ్చింది, ఆర్ ఎస్ కే ల ద్వారా ఎంత ధాన్యము సేకరణ జరిగిందని ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ పక్కాగా నిర్వహించాలన్నారు. ధాన్యం కొనుగోలు సీజన్లో ధాన్యం కొనుగోలుకు సంబంధించి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారానే ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు. 48 గంటలలో రైతు ఖాతాల్లో నగదు జమ అయ్యేటట్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రొక్యూర్మెంట్ సేకరణ ఏ విధంగా జరుగుతుంది ఇప్పటివరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారు అడిగారు. నిర్దేశించిన తేమశాతం కన్నా ఎక్కువ ఉంటే ట్రక్ షీట్ వెనకాల వ్రాయాలి అన్నారు. గోనె సంచి 600 గ్రాములు మాత్రమే ఉండాలి, అలా కాకుండా కేజీ గా చూపడం వలన రైతు నష్ట పోతాడని అన్నారు. సంచికి వచ్చి 41 కేజీలు ధాన్యం తూకం కాకుండా 45 కేజీలు ధాన్యం తూకo వేయాలని అన్నారు. మిల్లర్స్ నుండి తీసుకువచ్చిన గోనె సంచులు క్వాలిటీగా ఉండాలని, చిల్లులు పడిన సంచులు ఉంటే ఏ మిల్లు నుండి తెచ్చేరో ఆ మిల్లుకు తిరిగి అప్పగించి, వాటి స్థానంలో మంచి సంచులను తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. ఏ రైతు సేవా కేంద్రానికి ఎన్ని సంచులు అవసరమో ముందుగానే ఆలోచన చేసి 50 శాతం సంచులను స్టాక్ నిల్వ ఉంచాలని అన్నారు. ధాన్యం రవాణా చేసే వాహనములు సిద్ధము చేయాలని అన్నారు. మిల్లులు వద్ద హమాలీలు సిద్ధంగా ఉండి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ధాన్యము దిగుమతి చేయాలని అన్నారు. ఆర్ ఎస్ కె వద్ద తేమ శాతం నిర్ధారించిన తర్వాత రైస్ మిల్లుల వద్ద తేమశాతం ఎక్కువ చూపిస్తున్నారని, రైతులు వద్ద నుండి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. ప్రతి ఆర్ ఎస్ కే వద్ద సిబ్బంది విధులు నిర్వహణలో ఎటువంటి సమయంలోనైనా రైతులకు అందుబాటులో ఉండాలని అన్నారు. రైతులు అడిగే సలహాలకు సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. ఏ ఒక్క రైతు నుండి ఫిర్యాదులు రాకుండా ప్రతిష్టాత్మకంగా వ్యవహరించాలి అన్నారు. ఖరీఫ్ సాగుకు సంబంధించి ధాన్యం కొనుగోలులో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దిగ్విజయంగా పూర్తిచేయాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులు ఆదేశించారు.
ఈ సందర్భంలో ఆర్డీవో దాసిరాజు, జిల్లా సివిల్ సప్లయ్ మేనేజర్ ఎండి ఇబ్రహీం, జిల్లా సహకార శాఖ అధికారి కె.మురళీకృష్ణ, డి ఎస్ ఓ ఎన్ సరోజ, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు పి.మురళీకృష్ణ, తహసిల్దార్ లు జి.కనకరాజు, జి.అనిత కుమారి, సయ్యద్ మౌలానా పాజిల్, రవికుమార్, మండల వ్యవసాయ శాఖ అధికారులు, సివిల్ సప్లయ్ డీటీలు, రైతు సేవా కేంద్రం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.