Close

అన్నదాత సుఖీభవ – పిఎం కిసాన్ పథకం కింద రెండవ విడత రైతుల ఖాతాలలో నగదు జమ కార్యక్రమం పండుగ వాతావరణంలో నిర్వహించాలి–జాయింట్ కలెక్టర్ టీ.రాహుల్ కుమార్ రెడ్డి.

Publish Date : 18/11/2025

మంగళవారం జాయింట్ కలెక్టర్ అన్నదాత సుఖీభవ – పిఎం కిసాన్ పథకం కింద రెండవ విడత రైతుల ఖాతాలలో నగదు జమ కార్యక్రమం, ఖరీఫ్ ధాన్యం సేకరణపై రెవిన్యూ డివిజనల్ అధికారులు, తహసిల్దార్లు, వ్యవసాయ, రవాణా, పౌర సరఫరాల శాఖ అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ – పిఎం కిసాన్ పథకం కింద రెండవ విడత రైతుల బ్యాంకు ఖాతాలో నగదు జమ కార్యక్రమం జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, రైతు సేవా కేంద్రాలలో పండుగ వాతావరణంలో నిర్వహించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండల సభ్యులు, జడ్పిటిసిలు, ఎంపీటీసీలు ఇతర ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలన్నారు. వారి సలహా సూచనల మేరకు కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 7 వేల రూపాయలు రైతాంగానికి పెట్టుబడి సాయంగా రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరుగుతుంది అన్నారు. నవంబర్ 19వ తేదీన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కార్యక్రమ ప్రసంగాన్ని జిల్లాలో అన్ని నియోజకవర్గాలు, రైతు సేవా కేంద్రాల వద్ద డిజిటల్ స్క్రీన్స్ ఏర్పాటు చేసి రైతులు వీక్షించేలా ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా సమావేశాలు నిర్వహించి రైతులకు ఉద్యాన పంటలు, ప్రకృతి సాగు, ఎరువులు, పురుగుమందుల వినియోగం పై సలహాలు, సూచనలు అందించాలన్నారు. మండల వారీగా లబ్ధిదారులకు అందజేసే సొమ్ము నమూనా చెక్కులను సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.

ఖరీఫ్ ధాన్యం సేకరణపై సమీక్షిస్తూ ధాన్యం సేకరణ సందర్భంగా రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షించుకోవాలన్నారు. వరి పంట కోత దశలో ఉన్నందున ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలన్నారు. ఇప్పటికే 27 లక్షల గోనె సంచులు రైతు సేవా కేంద్రాల వద్ద సిద్దం చేయడం జరిగిందన్నారు. మరో 33 లక్షల గోనెసంచులు సిద్ధం చేయాలన్నారు. ధాన్యం రవాణా చేసేందుకు 3,600 వాహనాలు రిజిస్టర్ కావలసి ఉండగా 2,700 మాత్రమే రిజిస్టర్ అయ్యాయని, మరో 900 వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. అవసరమైన సమయంలో రైతులకు అందించేందుకు టార్పాలిన్లు రైతు సేవా కేంద్రాల వద్ద సిద్ధంగా ఉంచాలన్నారు. ట్రక్ షీట్ జనరేట్ అయిన వెంటనే వాహనం సంబంధిత మిల్లుకు చేరుకోవాలన్నారు. దీనిపై అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలన్నారు. ధాన్యం అమ్మిన రైతులకు 48 గంటలలోగా వారి బ్యాంకు ఖాతాలలో నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో జిల్లాలోని ఆర్డీవోలు, వ్యవసాయ, రవాణా, పౌరసరఫరాల శాఖ అధికారులు, ఎంఏవోలు, ఎం ఎల్ వోలు, తహసిల్దారులు, తదితర శాఖ అధికారులు పాల్గొన్నారు.