Close

జిల్లాలో మాదకద్రవ్యాల అణచివేతకు పోలీస్, ఈగల్, రవాణా, ఆర్టీసీ, రైల్వే, ఎక్సైజ్ శాఖలు దగ్గరగా పర్యవేక్షించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 18/11/2025

జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం అనే మాటే వినిపించకూడదు..

జిల్లాలో ఎక్కడైనా మాదకద్రవ్యాల వినియోగం ఉంటే ఉక్కు పాదంతో అణచివేయాలి..

మండల పరిధిలోని పోలీస్ అధికారులు జడ్పీ హెడ్మాస్టర్ లతో తరచూ మమేకం కావాలి..

జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు తీసుకున్న చర్యలపై నిర్వహించిన ఐవిఆర్ఎస్ సర్వేలో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది..

మాదకద్రవ్యాల వినియోగం దుష్పరిణామాలపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి..

మత్తుకు బానిసలైన వారు ఉంటే డి-ఎడిక్షన్ సెంటర్ నందు చికిత్స అందించాలి…

జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణను కట్టుదిట్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు.

మంగళవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాదకద్రవ్యాల నియంత్రణకు తీసుకున్న చర్యలపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశాన్ని జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తో కలిపి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడ గంజా వినియోగం అనే మాట వినిపించకూడదని, ఏదైనా కేసులు గుర్తిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని గట్టిగా హెచ్చరించారు. బాలలు, యువత జీవితాలపై గంజా ప్రభావం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదని, వారి బంగారు భవిష్యత్తును కాపాడవలసిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. మండలాల పరిధిలోని సబ్ ఇన్స్పెక్టర్లు జిల్లా పరిషత్ పాఠశాలల హెడ్మాస్టర్లతో తరచూ మమేకమై గంజా, తదితర మత్తు పదార్థాల వినియోగంపై సమాచారాన్ని రాబట్టాలన్నారు. కళాశాలలు, పాఠశాలల నందు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. జిల్లాలో 300 కళాశాలలు, 597 బహిరంగ ప్రదేశాలు, 58 గ్రామాలలో మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన ప్రచారాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఎవరికైనా మాదకద్రవ్యాల వినియోగంపై సమాచారం తెలిస్తే, 1972 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి ఈగల్ బృందానికి సమాచారాన్ని అందించాలన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు కళాశాలలో, పాఠశాలల్లో 826 ఈగల్ క్లబ్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు చేపట్టిన చర్యలను వివరించారు. జిల్లాలో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్, 1985 క్రింద 2025 జనవరి నుండి నేటి వరకు 12 కేసులు నమోదు కాగా 57 మందిని నిందితులుగా గుర్తించి, 55 మందిని అరెస్టు చేయడం జరిగిందని, 40.399 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. దీని విలువ సుమారు రూ.3,72,680/- లు ఉంటుందన్నారు. అలాగే 2 వాహనాలను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. అలాగే 20 కేజీల లోపుగా రవాణా చేసే వారిపై 12 కేసులను నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఎన్ డి పి ఎస్ చట్టం కింద గంజాయిని రవాణా చేస్తున్న 53 మంది పాదచారులు, వినియోగిస్తున్న నలుగురిపైన కేసులను నమోదు చేయడం జరిగిందని తెలిపారు. నిర్మానుష్య ప్రదేశంలో అసాంఘిక కార్యక్రమాలను నివారించేందుకు డ్రోన్ ల ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. గంజాయి అక్రమ రవాణా విక్రయం వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు డ్రోన్ ద్వారా ఈగల్ బృందాలు గస్తీని నిర్వహిస్తున్నాయి అన్నారు. నవంబర్ 14న ఈగిల్ టీం, సివిల్ పోలీస్, జి ఆర్ పి, ఆర్ పి ఎఫ్, డాగ్ స్క్వాడ్ లతో కూడిన బృందం పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ ట్రైన్-చెకింగ్ టీం గంజాయి అక్రమ రవాణాను అరికట్టడానికి రైలు నంబర్ 17479 పూరి నుండి తిరుపతిలో సోదాలు నిర్వహించి, ఒడిశాకు చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి, తణుకు మరియు భీమవరం రైల్వే స్టేషన్ల మధ్య వారి వద్ద నుండి నాలుగు ప్యాకెట్లలో ప్యాక్ చేసిన సుమారు 10 కిలోల గంజాయిని, 2,100/- నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో 64 కేసుల్లో సీజ్ చేసిన మొత్తం 641.544 కిలోల గంజాయిని జూలై 9న పల్నాడు జిల్లాలోని జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌ నందు దహనం చేయడం జరిగిందన్నారు. అలాగే 21 కేసుల్లో సీజ్ చేసిన 594.844 కిలోల గంజాయి దహనం చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.

జూమ్ కాన్ఫరెన్స్లో డీఎస్పీలు ఆర్. జై సూర్య, డాక్టర్ శ్రీ వేద, విశ్వనాథ్, జిల్లా ఎక్సైజ్ అధికారి ఆర్.వి ప్రసాద్ రెడ్డి , డీఈవో ఇ.నారాయణ, జిల్లా రవాణా శాఖ అధికారి కే ఎస్ ఎన్ వి కృష్ణారావు, రెవిన్యూ, పోలీస్, ఫారెస్ట్ అధికారులు, ఈగల్ బృందాలు, తదితరులు పాల్గొన్నారు.