చిన్నారులు నిమోనియా బారిన పడకుండా తల్లులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
సోమవారం భీమవరం కలెక్టరేట్ పి.జి.ఆర్.ఎస్ సమావేశ మందిరం నందు నిమోనియా నిర్వహణపై గోడపత్రికను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో నిమోనియా నిర్వహణ అవగాహన ప్రచారాన్ని నవంబర్ 12 నుండి ప్రారంభించడం జరిగిందని, ఫిబ్రవరి 28, 2026 వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. చిన్నారులు పాలు లేదా ఆహారం తీసుకోకపోవడం, ఫిట్స్ రావడం, నిమిషానికి 60 లేక అంతకంటే ఎక్కువ వేగంగా శ్వాస తీసుకోవడం, శ్వాస తీసుకునేటప్పుడు తీవ్రంగా ఛాతి లోపలికి పోవడం వంటివి ప్రధానంగా నిమోనియా లక్షణాలుగా గుర్తించాలన్నారు. నిమోనియా లక్షణాలు గుర్తించిన వెంటనే ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలోని ఏఎన్ఎం లేదా సిహెచ్ఓలు అనుమానిత నిమోనియా వున్న పిల్లలకు ముందస్తు డోసు ఇవ్వాలని, దీని కారణంగా వచ్చే జ్వరం, నొప్పులు తగ్గించడానికి వైద్యులు సలహా మేరకు వ్యాధి నిరోధక మందులు అయిన పెయిన్ రీలీవర్స్, యాంటీ ఫీవర్ మందులు వాడడం, దగ్గును పూర్తిగా అణచేయడం కాకుండా, ద్రవాలను తొలగించేందుకు సహాయపడే మందులు వినియోగించాల్సి ఉంటుందన్నారు. బాక్టీరియల్ నిమోనియాకు యాంటీబయాటిక్స్ తీసుకోవాల్సి ఉంటుందని, వైరల్ నిమోనియాకు వైద్యుడు సూచించిన విధంగా వైరల్ చికిత్స పూర్తిస్థాయి యాంటీబయాటిక్ కోర్స్ గడచిన తర్వాత మాత్రమే ఆపాల్సి ఉంటుందన్నారు.
గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, డి ఎం హెచ్ ఓ డాక్టర్ బి. గీతా బాయి, డిఐఓ డాక్టర్ దేవ సుధాలక్ష్మి ఉన్నారు.