Close

… చిన్నారికి మంచి భవిష్యత్తు అందించినందుకు కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులు…

Publish Date : 16/11/2025

చిన్నారి దివ్య రాణికి నడక నేర్పిన పి.జి.ఆర్.ఎస్

కలెక్టర్ అమ్మ చొరవతో చిన్నారి నేడు నడవగలుగుతుంది…

చిన్నారికి దివ్యాంగుల పెన్షన్ కోసం పీజిఆర్ఎస్ కి వస్తే.. కలెక్టర్ ఫిజియోథెరపీకి సిఫార్సు..

జీవితాంతం దివ్యాంగురాలు కాకుండా కాపాడిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆలోచన..

కలెక్టర్ ఆలోచన ఒక చిన్నారికి నడక నేర్పింది అంటే ఒకింత ఆశ్చర్యం .. విన్నవారికి సంతోషం కలగక మానదు. జీవితాంతం వికలాంగురాలుగా ఉండిపోవాల్సిన చిన్నారిని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆలోచనతో నేడు నడవగలుగుతుంది. సాధారణంగా దివ్యాంగులు పి జి ఆర్ ఎస్ కి వస్తే పింఛను ఇప్పించడానికి ఆలోచన చేస్తారు, ఆ పరిధిని దాటి ఆ పాప ఎందుకు నడవడం లేదు అని ఆలోచన చేసిన కలెక్టర్ ఒక చిన్నారికి ఉజ్వల భవిష్యత్తు అందించారు అనడంలో సందేహం లేదు. ప్రతి సోమవారం నిర్వహించే పిజిఆర్ఎస్ కార్యక్రమానికి సెప్టెంబర్ 8న పాలకోడేరు మండలం పెన్నాడకు చెందిన అంజలి ఆమె ఏడు సంవత్సరాల కుమార్తెను భుజాల మీద మోసుకువచ్చి మా పాప నడవడం లేదు కనీసం దివ్యాంగుల పెన్షన్ మంజూరు చేస్తే మాకు ఆధారంగా ఉంటుంది అని కలెక్టర్ దగ్గర విన్నవించుకోవడం జరిగింది. ఒక క్షణం ఆలోచించిన కలెక్టర్ వెంటనే ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ కీర్తి శ్రవణ్ ను పిలిచి ఈ పాపను చిన్న పిల్లల వైద్యులకు చూపించి వైద్యం చేయిస్తే ప్రయోజనం ఉంటుందేమో అని సిఫార్సు చేయడం, అదే రోజు వెంటనే ఆర్.కె గాయత్రి హాస్పిటల్ చిన్నపిల్లల వైద్యుల వద్ద పరీక్షలు చేయించడంతో “మైల్ స్టోన్ డిలే”గా గుర్తించడం జరిగింది. ఫిజియోథెరపీ, స్విచ్ థెరఫీ ద్వారా పాపకి నడవడం, మాట్లాడడం 90 శాతం అవకాశం ఉందని చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా పిల్లల వైద్యులతో చికిత్స ఇప్పిస్తూనే, అన్నపూర్ణ ఫిజియోథెరపీ అండ్ రిహాబిటేషన్ సెంటర్ నందు ఫిజియోథెరపీని ఇప్పించడం జరిగింది. ఫిజియోథెరపీ వైద్యులు డాక్టర్ వేగ్నేసిన ప్రవీణ ఈ పాప కుటుంబ పరిస్థితిని చూసి ఉచితంగా ఫిజియోథెరపీని అందించడానికి ముందుకు వచ్చి ఇప్పటివరకు 22 సెషన్స్ ను అందించడం జరిగింది. పాపను పి జి ఆర్ ఎస్ కి తీసుకొచ్చినప్పుడు కనీసం కూర్చోలేని, కూర్చోబెడితే పడిపోతున్న స్థితిలో ఉంది, నేడు లేచి నిలబడడం, ఒక వస్తువుని పట్టుకుని నడవడం జరుగుచున్నది. నిరుపేదలైన తల్లిదండ్రులకు పాపకు వైద్యం చేపిస్తే ప్రయోజనం ఉంటుందన్న ఆలోచన పరిజ్ఞానం లేకపోవడం, పింఛన్ వస్తే చాలు అనే ఆలోచన ఉండటం వలన నేడు జీవితాంతం దివ్యాంగురాలుగా మారాల్సిన చిన్నారిని కలెక్టర్ ఆలోచనతో సాధారణ పిల్లల్లాగా నడిచే స్థితికి తీసుకురావడం జరిగింది. ఫిజియోథెరపీ అనంతరం స్విచ్ థెరపిని కూడా ఎన్టీఆర్ వైద్య సేవలో ఇప్పించి చిన్నారికి మంచి భవిష్యత్తును అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.