డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకం ఆహార పదార్థాలను రుచిచూసిన జిల్లా కలెక్టర్..
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసి మధ్యాహ్న భోజనం ఆహార పదార్థాలను రుచి చూసిన మండల ప్రత్యేక అధికారులు…
గురువారం మెనూ ప్రకారం జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలో ఆహార పదార్థాలు వడ్డింపు…
మధ్యాహ్న భోజనాన్ని ఉత్సాహంగా స్వీకరిస్తున్న విద్యార్థులు..
మెనూ మార్చిన తర్వాత ఆహార పదార్థాలు రుచికరంగా ఉన్నాయని పిల్లల మనోభావం…
నాణ్యమైన గుడ్డులను ఇస్తున్నట్లు తెలిపిన విద్యార్థులు..
… పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
విద్యార్థులు సమతుల్యమైన పౌష్టికాహారాన్ని తీసుకోవడం ద్వారా మానసిక, శారీరక ఎదుగుదలకు దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
గురువారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణం గునుపూడి పి.ఎస్.ఎం బాలికల ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మధ్యాహ్న సమయంలో ఆకస్మికంగా తనిఖీ చేసి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాలను స్వయంగా రుచి చూసి సంతృప్తిని వ్యక్తం చేశారు. 936 విద్యార్థులు కలిగిన ఉన్నత పాఠశాలలో విద్యార్థులందరూ వరుస క్రమంలో వచ్చి ఆహార పదార్థాలను వడ్డించుకుని భుజించడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్ నేల మీద కూర్చుని సహపంక్తి భోజనం చేస్తూ పిల్లలని కుశల ప్రశ్నలతో ఉత్సాహపరిచారు. గుడ్డు ప్రతి రోజు ఆహారంలో ఎందుకు తీసుకోవాలి, గుడ్డు తినడం వల్ల ఏయే పౌష్టిక విలువలు మీకు అందుతాయి అని ప్రశ్నించారు. గుడ్డుతో పాటు తృణముల ధాన్యాలలో కూడా సమానమైన పౌష్టిక విలువలు ఉంటాయని గుడ్డుతో పాటు, ఏదో ఒక రూపంలో పప్పును కూడా భుజించాలని సూచించారు. విద్యార్థి దశలోనే మంచి పౌష్టిక ఆహారం తీసుకోవడం ద్వారా శారీరకంగా మానసికంగా ఎదుగుదల ఉంటుందని తద్వారా చదువుల్లో, ఆటల్లో చురుగ్గా రాణించగలరని విద్యార్థులకు హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు మంచి పౌష్టిక విలువలు కలిగిన ఆహారాన్ని అందించేందుకు మెనూను ప్రత్యేక నిపుణుల ద్వారా రూపొందించడం జరిగిందన్నారు. ఒక్కొక్క రోజు కొన్ని ఆహార పదార్థాలను ఎంపిక చేసి మీకు అందించడం ద్వారా మీ శరీర నిర్మాణం దృఢంగా ఉండేందుకు దోహదపడుతుందని, తద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంతో పాటు విద్యలో రాణింపు ఉంటుందనేది ప్రభుత్వ సంకల్పం అన్నారు. ప్రభుత్వ లక్ష్యాన్ని మీ ద్వారా నెరవేచ్చేందుకు మధ్యాహ్న భోజనం ప్రతి ఒక్కరు పాఠశాలల్లోనే భుజించాలని గట్టిగా సూచించారు. మనం ఇంటిలో కూడా రోజు ఇన్ని ఆహార పదార్థాలను తయారు చేసుకోమని, సమతుల్య ఆహారం అనేది విద్యార్థి దశలో చాలా ముఖ్యమని ఈ విషయాన్ని తల్లిదండ్రులు కూడా గ్రహించి విద్యార్థులు పాఠశాలనందే భోజనం చేసేలా ప్రోత్సహించాలన్నారు. మరి ముఖ్యంగా ఆడపిల్లలు మధ్యాహ్న భోజనాన్ని పాఠశాలనందే తీసుకోవాలని తెలిపారు. ఈరోజు గురువారం మెనూ ప్రకారం వెజ్ పలావ్, బంగాళదుంప కుర్మా, ఉడికించిన గ్రుడ్డు, రాగి జావ అందించడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో వంటశాలల నందు అత్యంత పరిశుభ్రత పాటించాలని, వర్షాకాలంలో మరింత జాగ్రత్త వహించాలని సూచించారు. ఆహార పదార్థాలను ఎప్పుడు మూతలతో కప్పి ఉంచాలని, ఈగలు, దోమల కారణంగా అనారోగ్యం దరిచేరవచ్చు అన్నారు. వంటశాలలో బల్లులు, బొద్దింకలు చేరకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు చేతులు బాగా కడుక్కున్న తర్వాత మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలని, అలాగే వడ్డించే వారు కూడా చేతులను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. విద్యార్థి దశలో బాగా చదువుకుంటే భవిష్యత్తులో మంచి రాణింపు ఉంటుందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఆడపిల్లలు వారి కాళ్లపై వారి నిలబడే అంతగా విద్యలో రాణించాలని, తద్వారా మంచి భవిష్యత్తు లభిస్తుందన్నారు. ఆడపిల్లలు ఇతర వ్యాపకాలకు దూరంగా ఉండాలని, చదువుపైనే దృష్టి ఉంచాలని సూచించారు. నేడు అన్ని రంగాలలో మహిళల భాగస్వామ్యం ఉందని, భవిష్యత్తులో కూడా ఇంకా రాణించేలా కృషి చేయాలన్నారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఈరోజు మధ్యాహ్న భోజన పథకాన్ని మండల ప్రత్యేక అధికారులు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు ఆకస్మికంగా పరిశీలించి, అధికారులు కూడా విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని రుచి చూడడం జరిగింది. జిల్లా అంతట మధ్యాహ్నం భోజనం అమలు సక్రమంగా నిర్వహిస్తున్నట్లు వారు జిల్లా కలెక్టర్కు నివేదించారు.
ఈ సందర్భంలో భీమవరం మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, సహాయ కమిషనర్ అరవవల్లి రాంబాబు, ప్రధానోపాధ్యాయులు బి ఎస్ ఎస్ సాయి ప్రసాద్, పాఠశాల ఉపాధ్యాయులు, తదితరులు ఉన్నారు.
