జిల్లాలో 2,25,639 మంది లబ్ధిదారులకు రూ.97.72 కోట్లు సామాజిక పింఛన్ల పంపిణీ..
సామాజిక పింఛన్లు వృద్ధులకు వితంతువులకు ఆర్థిక భరోసాగా నిలుస్తున్నాయని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు
శనివారం భీమవరం పట్టణం 19వ వార్డు భీమేశ్వర స్వామి ఆలయం పక్క వీధిలో డిఆర్డిఏ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అభయ హస్తం, దివ్యాంగులు, కుష్టు వ్యాధిగ్రస్తులు, వృద్ధులు, పెరాలసిస్ వ్యాధిగ్రస్తులు, ఒంటరి మహిళలు, వితంతువులు, నేత కార్మికులు 19వ వార్డులోని మొత్తం 246 మంది లబ్ధిదారులకు రూ.10.98 లక్షల నగదును పంపిణీ చేయడం జరిగింది. పింఛన్ల పంపిణీ సందర్భంలో జిల్లా కలెక్టర్ లబ్ధిదారుల క్షేమ సమాచారాన్ని, ఆరోగ్య విషయాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్లాస్టిక్ వాడరాదని సూచించారు. డ్రైనేజీల్లో చెత్త వేస్తే వర్షానికి అడ్డుపడి మన ప్రాంతమే నీటిలో ములుగుతుందని ఇటువంటి పరిస్థితి రాకూడదంటే సామాజిక బాధ్యతతో ఎవరు డ్రైయిన్లలో చెత్త వేయకూడదని, ఒకవేళ ఎవరైనా వేస్తున్నప్పుడు చూసినా కూడా చెప్పవలసిన బాధ్యత మీపై ఉందన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే దోమలను అరికట్టవచ్చు అని, తద్వారా అనారోగ్యం బారిన పడకుండా ఉంటారని హితవు పలికారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా నేడు 20 రకాల పెన్షన్లకు సంబంధించి 2,25,639 మంది లబ్ధిదారులకు రూ.97.72 కోట్లు పంపిణీని ప్రారంభించడం జరిగిందన్నారు. లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్ అందజేయాలని, ఏవిధమైన ఫిర్యాదులు లబ్ధిదారుల నుండి అందకూడదని సూచించారు. లబ్ధిదారులు పింఛన్ మొత్తాన్ని సద్వినియోగం చేసుకోవాలని, కొంత మొత్తాన్ని దాచుకుంటే భవిష్యత్ అవసరాలకు ఆసరాగా ఉంటుందని సూచించారు. ప్రతి ఒక్కరు పరిసరాల పరిశుభ్రత పాటించాలని, చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదని అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో భీమవరం ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్, డిఆర్డిఏ పిడి ఎంఎస్ఎస్ వేణుగోపాల్, ఏపీఓ ఎం.శ్రీనివాస ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, సహాయ మున్సిపల్ కమిషనర్ ఎ.రాంబాబు, వీఆర్వో జి.లక్ష్మీ కుమారి, వెల్ఫేర్ సెక్రెటరీ మంతెన ఉమా, శానిటేషన్ సెక్రటరీ యు.రాజేంద్రప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
