Close

“మొంథా తుపాను” ప్రభావాన్ని జిల్లా యంత్రాంగం ముందస్తు సన్నద్ధతో జిల్లాలో తీవ్ర నష్టాన్ని నివారించగలిగాం..

Publish Date : 30/10/2025

జిల్లాలో భారీ వర్షాల కారణంగా నీట మునిగి పంట నష్టపోయిన రైతాంగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం అందిస్తాయి..

……కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల సహాయమంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ..

భీమవరం పట్టణంలోని దుర్గాపురం మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో గురువారం కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తుఫాన్ బాధితులకు బియ్యం, నిత్యవసర వస్తువుల కిట్లను పంపిణీ చేశారు. బియ్యం 25 కేజీలు, కంది పప్పు 1 కేజీ, పంచదార 1 కేజీ, వంటనూనె 1 లీటరు, బంగాళాదుంపలు 1 కేజీ ఉల్లిపాయలు 1 కేజీ మొత్తం ఆరు రకాలుతో కూడిన కిట్లను 23 మంది బాధితులకు కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతులు మీదుగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలను ఎవరు నిరోధించలేము కానీ వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వాలు ఎలా పనిచేసాయి, ఏ విధంగా రక్షణ కల్పించారో గుర్తుంచుకోవాలన్నారు. జిల్లాలో అధికార యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఒక్క ప్రాణ నష్టం జరగలేదన్నారు. జిల్లాలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయడం వల్ల తుఫాను వైపరీత్యము నుండి బయటపడ్డామన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందుగా పునరావాస కేంద్రాలకు తరలించడం ద్వారా పెనుముప్పు తప్పిందన్నారు. జిల్లాలో మంత్రులు, శాసనసభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమీక్షలు జరిపి సమన్వయంగా పనిచేయడం ద్వారా పెను ప్రమాదం నుండి బయటపడ్డామన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నాయన్నారు. జిల్లాలో 26 వేల ఎకరాలలో వరి పంట నీట మునిగిందని పంట నష్టానికి కేంద్ర ప్రభుత్వం సహాయం అందిస్తుంది అన్నారు. గత నాలుగు రోజుల నుండి వర్షాల కారణంగా ప్రజలు పనులు లేక ఇబ్బంది పడటం వల్ల తుపాను ప్రభావిత ప్రాంతాలలోనే బాధితులకు ఆరు రకాలతో కూడిన నిత్యవసర సరుకుల కిట్లను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.

జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ “మొంథా తుపాను” వల్ల ఎక్కడ కూడా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా గౌ. ముఖ్యమంత్రి, గౌ.ఉప ముఖ్యమంత్రి నిరంతరం సమీక్షల నిర్వహించి జిల్లా యంత్రాంగాలను అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. ఈ దృష్ట్యా జిల్లా అధికారులు ముందస్తు సన్నద్ధత ద్వారా సమర్థవంతంగా సమన్వయంతో పనిచేయడం వల్ల జిల్లాలో ఎక్కడ ప్రాణం నష్టం జరగలేదన్నారు. లోతట్టు ప్రాంతాలలో ప్రజలను ముందుగానే పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది అన్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలలో బాధితులకు నిత్యవసర వస్తువులు, బియ్యాన్ని అందించడం జరుగుతుం దన్నారు. అధికారులందరూ క్షేత్రస్థాయిలో విధులలో నిమగ్నమై ఉన్నారని మరో రెండు రోజుల్లో ప్రభావిత ప్రాంతాలలో యధాస్థితికి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నమన్నారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి,ఆర్డీవో కే ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి,తాసిల్దార్ రాణి రాంబాబు ఏఎస్ఓ రవిశంకర్, తదితరులు పాల్గొన్నారు.

5.11