Close

రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధరకు ధాన్యాన్ని అమ్మడం ద్వారా లాభం పొందాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Publish Date : 30/10/2025

గురువారం పెంటపాడు మండలం రావిపాడు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం లో ఏర్పాటు చేసిన ఖరీఫ్ తొలి ధాన్యం కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించగా, ధాన్యములోడు లారీని రైస్ మిల్లుకు తరలించేందుకు స్థానిక శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ జండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ రైతులు ఆరుగాలం పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని లక్ష్యంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోళ్లను ప్రారంభించడం జరిగిందన్నారు. రైతులు ఎవరి వద్ద నష్టపోకుండా ప్రభుత్వం కల్పించిన గిట్టుబాటు ధరకే వారి ధాన్యాన్ని అమ్ముకోవాలని సూచించారు. ఏ రైతు కూడా నాణ్యతా ప్రమాణాల ప్రకారము ఉన్న తన పంటని కనీస మద్దతు ధర కన్నా తక్కువకు అమ్ముకోవాల్సిన అవసరం లేదన్నారు. దళారులు లేక మధ్యవర్తులు మరియు మిల్లర్ల చేతిలో రైతులు నష్టపోకూడదన్నారు. ఈ-పంట నమోదు చేసుకొని, ఈకేవైసీ పూర్తి చేసుకున్న రైతుల వద్ద మాత్రమే ధాన్యము కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. ధాన్యం విక్రయములో రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా ఫిర్యాదు చేయుటకు ప్రతి జిల్లా కేంద్రంలో, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, టోల్ ఫ్రీ నెంబర్ 1967 ను సంప్రదించవచ్చు అన్నారు. అలాగే జిల్లా స్థాయిలో జిల్లా కంట్రోల్ రూమ్ నెంబర్లు.. 8121676653, 18004251291 నందు సంప్రదించాలని తెలిపారు.

తాడేపల్లిగూడెం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రైతులకు ధాన్యం అమ్ముకోవడానికి పడే కష్టాలు తీరాయి అన్నారు. గతంలో ప్రభుత్వం సూచించిన, సుదూర ప్రాంతంలో ఉన్న మిల్లులకే ధాన్యాన్ని తోలవలసి వచ్చేదని నేడు ఆ పరిస్థితి లేదన్నారు. రైతులకే పూర్తి స్వేచ్ఛను మా ప్రభుత్వం మా కల్పించిందన్నారు. దాన్ని కొనుగోలు చాలా పారదర్శకంగా కూటమి ప్రభుత్వం చేపట్టిందని, రైతులు ఆర్ఎస్కేల ద్వారా ధాన్యాన్ని అమ్మి లాభ పడాలని కోరారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో తొలి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని, త్వరలో పంట కోతకు వచ్చిన అన్ని ప్రదేశాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరుగుతుందన్నారు. రైతు, తాము అమ్మ దలచిన ధాన్యమును వాట్స్ యాప్ ద్వారా కూడ షెడ్యూల్ చేసుకోవచ్చన్నారు. ఎందుకు రైతు తమ వాట్స్ యాప్ ద్వారా నెం: 7337359375 కు హాయ్ అని పంపి ఏ తేదీన అమ్ముతారు షెడ్యూల్ చేసుకోవచ్చన్నారు. అంతే కాకుండా దీనిలో తమ అభిప్రాయమును కూడా తెలియజేయవచ్చు అన్నారు. ఆర్ ఎస్ కే నందు గల టెక్నికల్ సిబ్బంది ధాన్యం నాణ్యతను పరిశీలించుటకు రైతు కల్లం వద్దకే వచ్చి నాణ్యతను పరిశీలించి, వారు ఏ రోజు వస్తారో కూపన్ ద్వారా తెలియజేయడం జరుగుతుందని, రైతులు ఆర్ఎస్ కే కి వచ్చిన సందర్భంలో కచ్చితంగా కూపన్ ను తీసుకురావాలని తెలిపారు. భారత ప్రభుత్వము నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలను అనుసరించి రైతు సేవా కేంద్రం వద్ద గల ధాన్యం కొనుగోలు సిబ్బంది ఐదు నాణ్యతా ప్రమాణ పరీక్షలను అంటే వ్యర్థ పదార్థాలు, రంగు మారిన, కుచించుకుపోయిన, తక్కువశ్రేణి గింజలు లేదా కేళిలు, తేమ పరీక్ష నిర్వహించి నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. అలా లేని పక్షంలో రైతులు తమ ధాన్యాన్ని నాణ్యతా ప్రమాణాలకు లోబడే విధంగా మెరుగుపరచి సిద్ధం చేసుకొని తీసుకురావాలన్నారు.

చివరిగా ఆర్ఎస్కేలు వద్ద ధాన్యం కొనుగోలులో రైతులకు అవసరమైన సమాచారం ఉన్న కరపత్రాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఆర్డీవో ఖతీబ్ కౌసర్ భానో, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, జిల్లా సహకార శాఖ అధికారి మురళీకృష్ణ, తాడేపల్లిగూడెం స్పెషల్ ఆఫీసర్ జీవీకే మల్లికార్జునరావు, సివిల్ సప్లైస్ ఎం.డి ఎండి ఇబ్రహీం, తహసిల్దార్లు రాజరాజేశ్వరి, వ్యవసాయ శాఖ అధికారులు, సొసైటీ చైర్ పర్సన్ ములగల శివ కేశవ, స్థానిక నాయకులు వలవల బాబ్జి, ఆకాశపు స్వామి, డాక్టర్ పద్మనాభుని మురళీమోహన్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

3.11 3.22