Close

“మొంథా తుపాను” ఎదుర్కొనేందుకు అధికారులందరూ సర్వసన్నద్ధంగా ఉండాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 28/10/2025

జిల్లాలో ఎక్కడ ఎటువంటి సమస్యలు తలెత్తిన తక్షణ పరిష్కార చర్యలు చేపట్టాలి

200 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.

పునరావాస కేంద్రాల వద్ద ఇంచార్జ్ అధికారులు 24 గంటలు అప్రమత్తతతో ఉండాలి.

జిల్లాలో ఎక్కడ కూడా ఏ ఒక్క ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి.

మండలాలకు పంపే డ్రోన్స్ తక్షణం వినియోగంలోనికి తీసుకురావాలి.

మంగళవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, తుపాను పర్యవేక్షణ జిల్లా ప్రత్యేక అధికారి వి.ప్రసన్న వెంకటేష్, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి “మొంథా తుఫాన్” ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ముందస్తు, తదుపరి చర్యలపై రెవిన్యూ డివిజనల్ అధికారులు, తహసిల్దారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ “మొంథా తుఫాన్ ” ఈరోజు రాత్రికి తీరం దాటే అవకాశం ఉన్నందున అధికారులందరూ మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. 200 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉన్నందున పల్లపు ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉందన్నారు. దీని దృష్ట్యా వర్షపు నీరు సాఫీగా బయటకు పోయేందుకు కాలువలు, డ్రైన్స్లలో అడ్డంకిగా ఉన్న చెత్తను, తూడును ముందుగా జెసిబిలు ద్వారా తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 29 పునరావాస కేంద్రాలను సిద్ధం చేయడం జరిగిందని ప్రస్తుతం 19 పునరావస్య కేంద్రాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. భారీ వర్షాల కారణంగా ఇంకనూ ఎక్కడైనా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయవలసి వస్తే అధికారులు అందుకు తగిన విధంగా ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. శిబిరాల వద్ద తాగునీరు, భోజన సౌకర్యం, పాలు, మెడికల్ క్యాంపు, శానిటేషన్ నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. తుపాను కారణంగా రోడ్లపై చెట్లు పడిపోతే వాటిని తొలగించి రోడ్డు క్లియర్ చేయడానికి టీమ్స్ అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల వద్ద విద్యుత్తు అంతరాయం లేకుండా జనరేటర్లను సిద్ధం చేసుకోవాలన్నారు. మండలాలకు డ్రోన్స్ పంపడం జరుగుతుందని, వాటిని ఫ్లై చేసి సమాచారాన్ని రాష్ట్ర కమాండ్ కంట్రోల్ కు పంపించే విధంగా తక్షణమే వినియోగంలోనికి తీసుకురావాలన్నారు. కంట్రోల్ రూమ్ లో సిబ్బంది షిఫ్టుల వారీగా 24 గంటలు అప్రమత్తంతో విధులు నిర్వహించాలన్నారు. రెవెన్యూ, ఆర్ అండ్ బి, ఇరిగేషన్, అగ్నిమాపక శాఖ అధికారులు సిబ్బంది సమన్వయంతో పని చేయాలన్నారు.

ఈ గూగుల్ మీట్లో జాయింట్ కలెక్టర్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, జిల్లాలోని రెవెన్యూ డివిజన్ అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, తహసిల్దారులు, తదితరులు పాల్గొన్నారు.