దేశంలోనే ఒకే ఒక్క జిల్లాగా బ్రాకిష్ (ఉప్పునీరు) ఆక్వా సాగుకు గుర్తించి పశ్చిమగోదావరి జిల్లాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది..
ఉప్పునీటి (బ్రాకిష్) ఆక్వా సాగుదారులు తప్పనిసరిగా కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ (సిఎఎ) కింద రిజిస్టర్ కావాలి
బ్రాకిష్ ఆక్వా సాగులో సిఎఎ నిబంధనలు తూచా తప్పక పాటించాలి
బ్రాకిష్ ఆక్వా సాగుదారులు కేంద్ర ప్రభుత్వం ప్రయోజనాలు పొందడానికి సిఎఎ రిజిస్ట్రేషన్ తప్పనిసరి
రైతులు ఎగుమతులకు ఆటంకం లేని యాంటీబయటిక్ ఫ్రీ ఆక్వా ఉత్పత్తుల సాగుకు కృషి చేయాలి
ఉప్పునీటి ఆక్వా సాగు చెరువులు తప్పనిసరిగా సిఎఎ కింద రిజిస్టర్ కావాలి, రిజిస్టర్ కాని చెరువులకు చట్టబద్ధత ఉండని కారణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
శనివారం భీమవరం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ (సిఎఎ) రిజిస్ట్రేషన్ కు చేపట్టవలసిన చర్యలపై జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ సిఎఎ మార్గదర్శకాలను అనుసరించి మాత్రమే బ్రాకిష్ ఆక్వాసాగు నిర్వహించాలని, నిబంధనలను పాటించిన వారి సాగుకు గుర్తింపు నమోదు చేయకపోవడంతో పాటు చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సిఎఎ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం 2005లో అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. జిల్లాలోని నరసాపురం, మొగల్తూరు, యలమంచిలి, భీమవరం రూరల్ మండలాల్లో 17 వేల 100 ఎకరాలలో బ్రాకిష్ ఆక్వా సాగు జరుగుచున్నదని, 2005 నుండి 1,880 మంది మాత్రమే సిఎఎ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగిందన్నారు. రిజిస్ట్రేషన్ కాల పరిమితి ఐదు సంవత్సరాలు ఉంటుందని, ఆ తర్వాత ఎవరూ రెన్యువల్ చేయించుకోకపోవడంతో ప్రస్తుతం సుమారు 100 మంది మాత్రమే యాక్టివ్ గా ఉన్నారని తెలిపారు. సిఎఎ రిజిస్ట్రేషన్ లను ఆన్లైన్లో పరిశీలించిన అమెరికా చాలా తక్కువ రిజిస్ట్రేషన్ లు ఉండటంతో అనాథరైజ్డ్ సాగుగా గుర్తించి ఎగుమతులకు అంగీకరించడం లేదని తెలిపారు. బ్రాకిష్ ఆక్వా సాగు సముద్రం హై టైడ్ నుండి 200 మీటర్లు పరిధిలో నిషేధమన్నారు. వ్యవసాయ భూములకు 50 నుండి 100 మీటర్ల పరిధిలో, తాగునీటి ఓనర్లకు 100 మీటర్ల పరిధిలో, 500 జనాభా కలిగిన ప్రాంతానికి వంద మీటర్ల పరిధిలో, 500 పైబడి జనాభా కలిగిన ప్రాంతాల్లో 300 మీటర్లు పరిధిలో బ్రాకిష్ ఆక్వా సాగు నిషేధం అన్నారు. అమెరికా నిబంధనలకు అనుగుణంగా 2026 జూన్ నాటికి అన్ని ఫార్మ్స్ సిఎఎ పరిధిలో నమోదు కావాలని, అప్పటికీ నమోదు కాని వాటిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సిఎఎ రిజిస్ట్రేషన్ లు చేయించుకోవడానికి రైతులకు సౌలభ్యంగా ఉండేందుకు మొగల్తూరు, నరసాపురం మండలాల్లోని 40 మంది నిరుద్యోగ యువతను ఎంపిక చేసే శిక్షణ కూడా ఇప్పించడం జరిగిందని, మీరు రైతుల వద్ద సంబంధిత పత్రాలను సేకరించి సిఎఎ రిజిస్ట్రేషన్ లను పూర్తి చేయడం జరుగుతుందన్నారు. సిఎఎ రిజిస్ట్రేషన్ ల ప్రక్రియను మత్స్య శాఖ అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కావలసిన దరఖాస్తులు, డాక్యుమెంట్లు గురించి వివరించారు. మెంబర్స్ చెక్ లిస్ట్ తప్పనిసరి ఇవ్వాలన్నారు. రిజిస్ట్రేషన్లు చేసుకోవడంలో రైతులకు అవగాహన ఉండదు కాబట్టి సంబంధిత శాఖ అధికారులు వారికి సహకరించాలని సూచించారు. వీఆర్వోలు ఎన్ ఓ సి ను జతచేయాలని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా మత్స్య శాఖ అధికారి పి.సురేష్, భీమవరం ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, నరసాపురం ఆర్ డి ఓ దాసిరాజు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, గ్రామ వార్డు సచివాలయం అధికారి వై.దోసి రెడ్డి, ఫిషరీస్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎల్ ఎన్ రాజు, ఎం ప్రసాద్, అగ్రికల్చర్ ఏ డి ఏ లు శ్రీనివాస్, ప్రసాద్, ఇరిగేషన్ సబ్ డివిజన్ డీఈ లు సి హెచ్. వెంకటనారాయణ, పి ఎన్ వి వి ఎస్ మూర్తి, భీమవరం, నరసాపురం, మొగల్తూరు, యలమంచిలి మండలాల తహాసిల్దారులు, ఎంపి డి వో లు, ఎఫ్ డి వో లు, తదితరులు పాల్గొన్నారు.
