తీవ్రవాయుగుండం దృష్ట్యా సముద్ర తీర ప్రాంతంలో ఎగసిపడుతున్న అలలు పరిశీలన–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మానస పుత్రిక పెద్దమైనవాని లంక
రూ.13.5 కోట్ల వ్యయంతో ఒక కిలోమీటర్ పరిధి సముద్రపు కోత నిరోధ అడ్డుకట్ట నిర్మాణం
సముద్రపు కోత నిరోధక అడ్డుకట్ట నిర్మాణాన్ని డిసెంబర్, 2025 నాటికి వేగవంతంగా పూర్తి చేయాలి.
నిర్మాణానికి ఏదైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలి
అడ్డుకట్ట నిర్మాణంపై ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సాగించాలి
మత్స్యకారులు సముద్రంలోనికి వేటకు వెళ్లరాదని హెచ్చరిక
… జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ దత్తత గ్రామం పెద్దమైనవాని లంక గ్రామం సముద్రపు కోతకు గురి కాకుండా నిర్మిస్తున్న అడ్డుకట్టను డిసెంబర్, 2025 నాటికి యుద్ధ ప్రాతిపదికను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత గుత్తేదారును ఆదేశించారు.
శుక్రవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పెద్దమైన వానిలంక గ్రామం వద్ద కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమకూర్చిన సిఎస్ఆర్ నిధులు రూ.13.5 కోట్ల వ్యయంతో ఒక కిలోమీటర్ పరిధిలో నిర్మాణం చేపట్టిన సముద్రపు కోత నిరోధక కట్ట నిర్మాణం పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని ఏదైనా ఇబ్బందులు ఉంటే జిల్లా యంత్రాంగం దృష్టికి వెంటనే తీసుకురావాలని సూచించారు. తొలి విడతగా ప్రారంభించిన అడ్డుకట్ట నిర్మాణం పనులు 400 మీటర్ల పరిధిలో పురోగతిలో ఉన్నాయని, దీనిలో 60 మీటర్ల పరిధిలో జియో ట్యూబ్ ఏర్పాటు, 200 మీటర్ల పరిధిలో జియో వాల్ నిర్మాణం పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. మొత్తం పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేసే లక్ష్యంతో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
అనంతరం తీవ్ర వాయుగుండం దృష్ట్యా సముద్ర తీర ప్రాంతంలో పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని, ఇప్పటికే వేటకు వెళ్తే తిరిగి ఒడ్డుకు చేరుకోవాలని అక్కడకు చేరుకున్న మత్స్యకారులకు సూచించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల జిల్లా యంత్రాంగం, ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ సందర్భంలో నరసాపురం ఆర్డీవో దాసిరాజు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పిఆర్ఓ పి. మోహన రావు, ఇరిగేషన్ శాఖ. ఈఈ సత్యనారాయణ, ఇంచార్జ్ తహసిల్దార్ ఎన్ఎస్ఎస్వీ ప్రసాద్, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి బి.శ్రీనివాసరావు, గుత్తేదారులు, తదితరులు ఉన్నారు.