Close

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు రెట్టింపు ప్రయోజనాలను అందిస్తూ అండగా నిలుస్తున్నాయి–కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ

Publish Date : 30/09/2025

జిఎస్టి తగ్గింపు ద్వారా వ్యవసాయ రంగానికి మరింత ఊతం

జిఎస్టి తగ్గింపుతో వ్యవసాయ రంగంలో చేకూరిన ప్రయోజనాన్ని అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ట్రాక్టర్లు ర్యాలీలో స్వయంగా ట్రాక్టర్ ను నడిపిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి..

రైతాంగాన్ని ప్రోత్సహించే దిశగా వ్యవసాయ, అనుబంధ రంగాలకు ఉపయోగించే వస్తువులు, పనిముట్లుపై భారీ మొత్తంలో జీఎస్టీ తగ్గింపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు మరింత అండగా నిలిచాయని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ అన్నారు.

మంగళవారం భీమవరం మున్సిపల్ కార్యాలయం వద్ద లూధరన్ పాఠశాల గ్రౌండ్స్ లో ఏర్పాటుచేసిన సూపర్ జిఎస్టి – సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ రంగంలో చేకూరిన ప్రయోజనాలపై అవగాహన కలిగించేందుకు పెద్ద ఎత్తున నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీని శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు ప్రారంభించారు. తొలుత వ్యవసాయ యంత్ర పరికరాలు, పనిమట్లు ప్రదర్శనను కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి ప్రారంభించి జీఎస్టీ తగ్గింపుకు ముందు, తర్వాత రైతులకు కలుగుతున్న ప్రయోజనాలను స్వయంగా పరిశీలించి, వాణిజ్య పన్నుల శాఖ అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రారంభించిన ట్రాక్టర్ల ర్యాలీలో పాల్గొన్న కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ట్రాక్టర్ పై ఎక్కించుకొని స్వయంగా నడపడం అందర్నీ ఆశ్చర్యపరచడంతో పాటు, జీఎస్టీ ప్రచార కార్యక్రమానికి వన్నె తెచ్చినట్లయింది. శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు కూడా స్వయంగా ట్రాక్టర్ నడిపి ఉత్సాహపరిచారు.

ఈ సందర్భంలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ సెప్టెంబర్ 22 నుండి కొత్త జీఎస్టీ స్లాబులు అమల్లోకి వచ్చాయని, భారత ప్రధాని ఆగస్టు 15న ఎర్రకోట నుండి జీఎస్టీ ఫలాలను ప్రకటించడం జరిగిందన్నారు. జీఎస్టీ తగ్గింపు ద్వారా వినియోగదారులకు చేకూరుతున్న ప్రయోజనాలను తెలియచెప్పేందుకు దసరా నుండి దీపావళి వరకు జీఎస్టీ ప్రచారాన్ని దేశవ్యాప్తంగా చేపట్టడం జరిగిందన్నారు. దేశ రైతాంగానికి భారీ ప్రయోగాన్ని చేకూర్చేందుకు ఆలోచన చేసిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అమలు చేసేందుకు వ్యవసాయ అనుబంధ రంగాలకు ఉపయోగించే వస్తువులు, పనిముట్లపై 13 శాతం, 7 శాతం స్లాబులను సవరిస్తూ ఒకే ఒక్క స్లాబ్ గా ఐదు శాతం జీఎస్టీ కి తగ్గించడం జరిగింది అన్నారు. వ్యవసాయ రంగం, వైద్య పరికరాలు, విద్యా సామాగ్రి, ఆరోగ్య భీమా అంశాలపై పెద్ద ఎత్తున రాయితీలను అందించడంతోపాటు, కొన్నింటికి జీరో శాతం జీఎస్టీ కి పరిమితం చేయడం అభినందించదగిన విషయం అన్నారు. రాష్ట్రం, దేశం ప్రయోజనాల కోసం నిరంతరం ఆలోచన చేస్తున్న ఇటువంటి ప్రభుత్వాలను మనం వెన్నంటే నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ వ్యవసాయ రంగం అతికీలకమైనదని, కరోనా సమయంలో అన్ని రంగాలు వృద్ధి పడిపోయిన, వ్యవసాయ రంగం మాత్రం రెండు శాతం వృద్ధిని సాధించడం ఎంతో గర్వించదగిన విషయం అన్నారు. జీఎస్టీ తగ్గింపు కారణంగా ప్రతి ఒక్క కుటుంబానికి నెలకు మూడు నుండి ఐదు వేల రూపాయల వరకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.

జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జి.ఎస్.టి తగ్గింపుతో సామాన్యులకు ఊరట లభించిందని అన్నారు. నిత్యావసర వస్తువులు, ఆహారం, మందులు, విద్యా, స్టేషనరీ, బట్టలు, క్రీడా వస్తువులు, మహిళలు, పిల్లలు, రవాణా అంశాలకు సంబంధించి జిఎస్టి తగ్గింపు వల్ల ప్రయోజనం కలుగుతుందన్నారు. వ్యవసాయ, ఉద్యానవన, ఉపాధిహామీ కూలీలు, మత్స్యకారులు, ఆక్వా రైతులు, ట్రేడింగ్ ఎంస్ఎంఇలు, నేత, హస్త కళాకారులు, పేపరు – ఫ్యాకేజింగ్, సెలూన్లు, స్పా, యోగా కేంద్రాలు, జిమ్, టైక్స్ టైల్స్ రంగాల్లో పనిచేసే వారికి,  మానవ వనరుల అభివృద్ధి, డిజిటల్ సాంకేతికకు సంబంధించిన విద్య, జీవితబీమా, ఆరోగ్య బీమా, ఎలక్ట్రానిక్స్, ఎంట్రప్రెన్యూర్ షిప్పు, ఇ-కామర్స్ అండ్ గిగ్ ఎకానమీ, కనస్ట్రక్షన్ మెటీరియల్, టూరిజం – హాస్పిటాలిటీ, టాన్సుపోర్టు, లాజిస్టిక్స్, బొమ్మలు, స్పోర్ట్సు గూడ్స్, రెన్యువల్ ఎనర్జీ, ఆటోమొబైల్, మాన్యూఫ్యాక్చరింగ్ రంగాల్లో  జి.ఎస్.టి తగ్గుదల ఉందన్నారు. జి.ఎస్.టి తగ్గింపుతో సామాన్య కుటుంబాలకు అత్యంత ప్రయోజనం కలుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం 4 స్లాబ్ లుగా ఉన్న జి.ఎస్.టిని రెండు స్లాబ్ లుగా తగ్గించిందని చెప్పారు. జి.ఎస్.టి తగ్గింపు వలన రాష్ట్ర ప్రభుత్వానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రతి ఏటా నష్టం వాటిల్లుతున్నప్పటికీ ప్రజల సంక్షేమం, అభివృద్ధి దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని బలపరుస్తుందన్నారు. చేనేత కళా రంగంలో ఉన్నవారికి ఇది అత్యంత ప్రయోజనకరంగా ఉందని వారికి కేవలం జీరో శాతంతో జి.ఎస్.టి ఉంటుందన్నారు.  పుస్తకాలు, స్టేషనరీ, ఇన్సూరెన్స్, వ్యవసాయ పరికరాలు, ఆరోగ్య సంబంధిత సామాగ్రి, తదితర అనేక అశాలపై అతి తక్కువ జి.ఎస్.టి ఉందన్నారు. వాహనాలు ఎలక్ట్రానిక్ గూడ్స్ పైన ధరలు తగ్గడం జరిగిందని అన్నారు. ప్రతి కుటుంబానికి నెలకు 3 వేల నుండి 10 వేల రూపాయల వరకు ఆదా అవుతుందన్నారు.

జిఎస్టి ప్రచారంలో భాగంగా ట్రాక్టర్ ను నడిపిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

జిఎస్టి తగ్గింపుతో వ్యవసాయ రంగంలో చేకూరిన ప్రయోజనాన్ని అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ట్రాక్టర్లు ర్యాలీలో ఎవరు ఊహించని విధంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వయంగా ట్రాక్టర్ ను నడిపి అందర్నీ ఆశ్చర్యపరిచారు. జిల్లా కలెక్టర్ ట్రాక్టర్ ను నడపడం ద్వారా నేటి జీఎస్టీ ప్రచారం రైతులలో చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. ట్రాక్టర్ ను తోలడం కష్టసాధ్యమైనదిగా ఉన్నను కలెక్టర్ అవలీలగా ట్రాక్టర్ ను నడపటం అందర్నీ ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సందర్భంలో కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ జిల్లా కలెక్టర్ ను ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు, భీమవరం శాసనసభ్యులు మరియు పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఏలూరు డివిజన్ వాణిజ్య పన్నుల డిప్యూటీ కమిషనర్ కెపి శైలజ శ్రీ, భీమవరం ఆర్డీవో కే ప్రవీణ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ జెడ్ వెంకటేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ కలిదిండి సుజాత, మాజీ ఏఎంసీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, వీరవాసరం ఎంపీపీ దుర్గా భవాని, జిల్లా రవాణా శాఖ అధికారి కె ఎస్ ఎన్ వి కృష్ణారావు, భీమవరం మున్సిపల్ కమిషనర్ కే రామచంద్రారెడ్డి, సహాయ కమిషనర్ ఎ.రాంబాబు, వాణిజ్య పన్నుల శాఖ భీమవరం, తణుకు, సర్కిల్స్ జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్లు వి.కేదారేశ్వర రావు, కె.వి.శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, పలువురు ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.