మెగా డీఎస్సీ -2025 లో ప్రతిభ కనబరిచి ఉద్యోగ నియామక పత్రాలను పొందిన అభ్యర్థులకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అభినందన జ్ఞాపికలు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
నిరుద్యోగులకు వరం మెగా డీఎస్సీ
విద్యార్థులకు చక్కగా పాఠాలు చెప్పి మంచి ప్రేరణ కలిగించాలి..
మా జీవితాలు మారాయంటూ అభ్యర్థుల ఆనందోత్సవాలు.
మెగా డీఎస్సీ 2025లో ఎంపికైన ఉపాధ్యాయులు విద్యార్థిని, విద్యార్థులకు మంచి విద్యా బోధన చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ద్వారా ఆన్లైన్లో శిక్షణ పొంది, మెగా డీఎస్సీలో ఎంపికైన 9 మంది ఉపాధ్యాయులను సోమవారం పిజిఆర్ఎస్ సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జ్ఞాపికలను అందించి అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఎంపికైన మీరు సుమారు 30 సంవత్సరాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగనున్నారన్నారు. మీ సర్వీసులో అంకిత భావంతో విధులను నిర్వర్తించి విద్యార్థిని, విద్యార్థులకు మంచి విద్యాబోధన చేయడం ద్వారా వారికి బంగారు భవిష్యత్తు అందించాలని కోరుతూ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
బిసి వెల్ఫేర్ శాఖ ద్వారా డీఎస్సీ పరీక్షలకు శిక్షణ పొంది జిల్లా నుండి ఎంపికైన వారిలో స్కూల్ అసిస్టెంట్ గా వెలగల రమ్యశ్రీ, మంగిశెట్టి శ్రీనివాస్, మోకా సిలోరత్నం, ఎస్ జి టి లుగా జి.వెంకట సుబ్బారావు, బి.రమ్య, ఎ.ఎన్.సాయి ప్రసన్న, టి.సాయి లక్ష్మి మృదుల, గుబ్బల రూపేంద్ర, షేక్ మున్నీ ఉన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులుగా ఎంపిక కాబడిన అభ్యర్థులు మాట్లాడుతూ మెగా డీఎస్సీ వలన మాకు మెగా లాభం చేకూరిందన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగం కొరకు ఎదురుచూస్తున్న మాకు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సి నిర్వహించి మా జీవితాల్లో వెలుగులు నింపిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కి, విద్యాశాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి ఎ.సూరిబాబు, డిఇఓ ఈ.నారాయణ, డిపిఓ ఎం.రామనాథరెడ్డి, సిపిఓ కె.శ్రీనివాసరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, పాల్గొన్నారు.
