జీఎస్టీ తగ్గింపు వలన పలు వర్గాల ప్రజలకు చేకూరుతున్న లబ్దిపై విస్తృత అవగాహన కల్పించండి–వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
సూపర్ జిఎస్టీ – సూపర్ సేవింగ్స్ పై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి
సూపర్ జిఎస్టీ – సూపర్ సేవింగ్స్ పై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు.
శనివారం భీమవరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూపర్ జిఎస్టీ – సూపర్ సేవింగ్స్ పై జిల్లా జాయింట్ కలెక్టర్, కమర్షియల్ టాక్స్ డిప్యూటీ కమిషనర్, డిపిఓ, జి ఎస్ డబ్ల్యూ ఎస్ అధికారి, డిఎంహెచ్ఓ, ఆయా శాఖల జిల్లా అధికారులు, జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఇతర అధికారులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అమలు చేస్తున్న జిఎస్టీ 2.0 సంస్కరణలు ప్రజలకు ఎంత మేర లాభం చేకూరుస్తున్నాయో తెలియజేయడం కోసం సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 19 వరకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ మేరకు ప్రభుత్వ మార్గదర్శకాలు అనుసరించి అవగాహన కార్యక్రమాలను పటిష్టంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిఎస్టి ముందు తర్వాత చేకూరే ఆర్థిక లబ్ధిపై స్పష్టంగా తెలిసేలా సంబంధిత వస్తువులతో భారీ ప్రదర్శనలను నిర్వహించాలన్నారు. సదరు జీఎస్టీ క్యాంపెయిన్ కు జిల్లా నోడల్ అధికారిగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఉంటారన్నారు. మండల, మున్సిపల్ స్థాయిలో ఇతర శాఖల అధికారులతో కమర్షియల్ టాక్స్ అధికారులు సమన్వయం చేసుకొని అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జీఎస్టీపై మున్సిపల్, ఎంపీడీవోలతో సమన్వయంతో రోజువారిగా ప్రత్యేక టీంలతో అన్ని వర్గాల ప్రజల్లోకి తీసుకెళ్లాలని, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశిత షెడ్యూల్ మేరకు కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జీఎస్టీ అవగాహన కార్యక్రమాలపై జాయింట్ కలెక్టర్ రోజు వారిగా మానిటర్ చేయాలన్నారు. పంచాయతీ స్థాయిలో యాక్టివిటీలు బాగా చేయాలని డిపిఓని ఆదేశించారు.
@ మొదటి వారం సెప్టెంబరు 25 నుండి అక్టోబర్ 1 వరకు జీఎస్టీ ఛాంపియన్స్, సచివాలయ సిబ్బంది, ఎస్ హెచ్ జి లు, మెప్మా, వివోలు ఇంటింటి ప్రచారం అవగాహన కల్పించడంతో పాటు, గ్రామ సభల నిర్వహణలో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలన్నారు. ఈ సందర్భంలో ప్రత్యక్షంగా జీఎస్టీ తగ్గిన వస్తువులను ప్రదర్శనలు నిర్వహించాలని సూచించారు.
@ రెండవ వారం అక్టోబర్ 2 నుండి 8 వరకు వ్యవసాయ అనుబంధ శాఖల ఆధ్వర్యంలో ట్రాక్టర్, ర్యాలీల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. పరిశ్రమలు, చేనేత శాఖలు వర్క్‌షాప్‌లు నిర్వహించాలన్నారు.
@ మూడవ వారం అక్టోబర్ 9 నుండి 15 వరకు మున్సిపల్, పంచాయతీ రాజ్, సాంఘిక సంక్షేమ శాఖల ద్వారా ప్రచారం చేయడంతో పాటు విద్యాశాఖ ఆధ్వర్యంలో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలన్నారు. ఆసుపత్రుల పరిధిలో జిఎస్టీ 2.0 పై అవగాహన మేళాలను డిఎంహెచ్ఓ, డిసిహెచ్ఎస్ ల పర్యవేక్షణలో జరగాలని ఆదేశించారు.
@ నాలుగవ వారం అక్టోబర్ 16 నుండి 19 వరకు టూరిజం, రవాణా, విద్యుత్ శాఖలు ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ప్రజలు జీఎస్టీ పై వివిధ కార్యక్రమాల ద్వారా పూర్తి అవగాహన పొంది సూపర్ జీఎస్టీ ఆర్థిక ఫలాలను పొందాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.
వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఏలూరు డివిజన్ వాణిజ్య పన్నుల డిప్యూటీ కమిషనర్ కెపి శైలజ శ్రీ, జి ఎస్ జి ఎస్ డబ్ల్యూ ఎస్ అధికారి వై.దోసి రెడ్డి, డిపిఓ ఎం. రామ్ నాథ్ రెడ్డి, డిఎంహెచ్వో డాక్టర్ జి.గీతా బాయి, జిల్లా కార్మిక శాఖ అధికారి ఆకన లక్ష్మి, వాణిజ్య పన్నుల శాఖ భీమవరం, తణుకు, పాలకొల్లు, తాడేపల్లిగూడెం సర్కిల్స్ కు చెందిన జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్లు వి.కేదారేశ్వర రావు, కె.వి. శ్రీనివాసరావు, డి.సాంబశివరావు డి.పి కిరణ్ కుమార్, డిటి ఎం.సన్యాసిరావు, తదితరులు పాల్గొన్నారు.