Close

అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల ప్రవేశాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Publish Date : 23/09/2025

మహిళలు, పిల్లలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుంది.

గర్భిణీ స్త్రీలు, బాలింతలకు అంగనవాడి కేంద్రాల ద్వారా సమతుల్య పౌష్టికాహారం అందించాలి.

మంగళవారం కలెక్టరేట్ పీజీ ఆర్ఎస్ సమావేశ మందిరంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రగతిపై జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులతో టేక్ హోమ్ రేషన్, బాలామృతం, ప్రీస్కూల్ హాజరు, బాల్య వివాహాలు, గర్భిణీ స్త్రీల, బాలింతల, పిల్లల ఆరోగ్య అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు, పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీ స్త్రీలకు అందుతున్న పౌష్టికాహారం తింటున్నారా లేదా పరిశీలించి గర్భిణీ స్త్రీల ఆరోగ్యం పై ఎప్పటికప్పుడు అంగన్వాడీ కార్యకర్తలు అవగాహన కల్పించాలన్నారు. బాలామృతం పథకం ద్వారా ఆరు నెలల నుండి మూడు సంవత్సరాల వయస్సు పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం సక్రమంగా తింటున్నారా లేదా పరిశీలించాలన్నారు. పిల్లలను అంగన్వాడీ కేంద్రాలలో చేర్చే విధంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు ఆటపాటల ద్వారా అందిస్తున్న విద్య, పౌష్టికాహారం, ఆరోగ్యంపై తీసుకొని శ్రద్ధ వంటి అంశాలపై తల్లిదండ్రులకు వివరించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు సమయపాలన పాటించి పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పిల్లల ఆరోగ్యంపై నిరంతరం పర్యవేక్షించాలి అన్నారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడే తల్లి, బిడ్డల ఆరోగ్యంపై అంగన్వాడీ కార్యకర్తలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పిల్లలను పోషించలేని స్థితిలో పిల్లలను వదిలివేయడం లేదా అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇటువంటి సంఘటనలు జిల్లాలో ఎక్కడా జరగకూడదన్నారు. తల్లి లేదా తండ్రి, తల్లిదండ్రులు ఇద్దరూ లేనివారు ఉపాధి నిమిత్తం ఇతర దేశాలలో వున్న వారి పిల్లలు ఇతరుల సంరక్షణలో ఉంటారని, ఆయా ప్రాంతాలలో ఆడపిల్లలు లైంగిక వేధింపులకు గురయ్యే ప్రమాదం ఉంటుందని, అటువంటి వారిని గుర్తించి వారికి రక్షణ కల్పించవలసిన బాధ్యత మనపై ఉందన్నారు. జిల్లాలో ఎక్కడా కూడా బాల్యవివాహాలు నమోదు కాకూడదన్నారు. టీనేజ్లో గర్భం దాల్చడం వల్ల కలిగే దుష్పరిణామాలపై దంపతులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో 18 సంవత్సరాల లోపు పోస్టర్ కేర్ పిల్లలు ఎంతమంది ఉన్నారో గుర్తించి డేటా సిద్ధం చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పెర్ఫార్మన్స్ ఇండికేటర్స్ నూరు శాతం లక్ష్యాన్ని సాధించి రాష్ట్రంలో జిల్లాను మొదటి స్థానంలో ఉండే విధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడా నాగరాణి అధికారులను కోరారు.

ఈ సమావేశంలో మహిళాభివృద్ధి,శిశు సంక్షేమ శాఖ అధికారి డి.శ్రీలక్ష్మి, నోడల్ అధికారి పి.విజయలక్ష్మి, ఈవో సుజాత, సిడిపిఓలు వి.వాణి విజయరత్నం, టిఎల్ లక్ష్మీకాంతం, యు.ఊర్మిళ, ఎం.ఉమ, ఏ.కృష్ణకుమారి, టి.ఎల్.సరస్వతి, ఎం శ్రీలక్ష్మి, సూపర్వైజర్ లు, తదితరులు పాల్గొన్నారు.