జిల్లాలో హోమ్ కంపోస్ట్ తయారీ, మిద్దె తోటల పెంపకానికి ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
గురువారం భీమవరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లతో స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా తడి చెత్త, పొడి చెత్త నిర్వహణ, వర్మీ కంపోస్ట్ తయారీ, మిద్దె తోటల పెంపకం, ఎస్ టి పి ల ఏర్పాటుకు చర్యలు, శానిటేషన్ డ్రైవ్ తదితర అంశాలపై జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రతి ఇంట్లో వర్మీ కంపోస్ట్ తయారు చేసుకోవడం, మిద్దె తోటలు పెంపకానికి ప్రోత్సాహం అందించాలన్నారు. ఇప్పటికే వివిధ గృహాలలో ఏర్పాటు చేసుకున్న మిద్దె తోటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పత్రికలకు కూడా సమాచారం అందించడం ద్వారా వారిని ప్రోత్సహించాలన్నారు. జిల్లాకు మంజూరైన మూడు ఎస్టీపీల ఏర్పాటుకు వెంటనే చర్యలు ప్రారంభించాలన్నారు. శానిటేషన్ డ్రైవ్ పెట్టి స్వచ్ఛంద సంస్థలను కూడా భాగస్వామ్యులను చేయాలని సూచించారు. పెద్దపెద్ద హోటల్స్, షాపింగ్ మాల్స్, కళ్యాణ మండపాలు వద్ద వారి చెత్తను వారి ప్రదేశంలోనే డీకంపోస్ట్ చేసే విధానానికి ప్రోత్సహించాలన్నారు. ప్రధానంగా పొడి చెత్త, తడి చెత్త వేరు చేసి చెత్త సేకరణ కు అప్పచెపితేనే టన్నుల్లోకొద్ది వచ్చే చెత్త నిర్వహణకు సాధ్యమవుతుందని దీనిని తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. లెగసీ వేస్ట్ క్లియరెన్స్ను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలన్నారు. ప్రయోగాత్మకంగా తడి చెత్తను గుంట తవ్వి దానిలో వేయడం ద్వారా డికంపోస్ట్ చేయడానికి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. పట్టణ ప్రాంతాలలో పరిశుభ్రత కొంత మెరుగ్గా ఉన్న, గ్రామీణ ప్రాంతాలలో పరిశుభ్రతను మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మున్సిపల్ పరిధిలో ఆక్రమణలను, బిల్డింగ్ ప్లాన్స్ లో వ్యత్యాసాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జూమ్ కాన్ఫరెన్స్ లో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.