అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇ-ఆఫీస్ ఫైల్స్ విధానం తప్పనిసరి, జిల్లా ప్రగతికి అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేయాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
గురువారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్ని శాఖల జిల్లా అధికారులతో ఆయా శాఖలకు సంబంధించిన అంశాలపై జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల నుంచి కలెక్టర్ కు వచ్చే ప్రతి దస్త్రం తప్పనిసరిగా ఇ-ఆఫీస్ ఫైల్ విధానంలోనే రావాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలలో కాగితం దస్త్రాలను క్రమేపి తగ్గించాలన్నారు. పారదర్శకత కొరకు ప్రతి దస్త్రాన్ని ఆన్ లైన్ లో ఉంచాలన్నారు. అన్ని శాఖలు ఉత్తమ పనితీరును కనబరిస్తేనే జిల్లా అన్ని రంగాలలో ముందుంటుందని, తద్వారా స్థిరమైన జిడిపి ని సాధించగలమన్నారు. ఆర్థికంగా బలమైన జిల్లాగా పేరుగాంచినా, కొన్ని శాఖల పనితీరును మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అక్షరాస్యతలో మెరుగైన ప్రగతిని సాధించాలని, చదివే ప్రగతికి మూలం అన్నారు. జిల్లాలో నిరక్షరాస్యత అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదన్నారు. ఇందుకు తగిన విధంగా విద్యాశాఖ నిరంతర కృషి చేయాలని సూచించారు. పారిశ్రామికంగా, పర్యాటకంగా అభివృద్ధికి ప్రణాళికలను రూపొందించాలన్నారు.
జూమ్ కాన్ఫరెన్స్ లో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.