Close

తల్లి ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుందని, మహిళల ఆరోగ్య పరిరక్షణకు “స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్” కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయం మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ అన్నారు.

Publish Date : 17/09/2025

బుధవారం ఆకివీడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు “స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్” కార్యక్రమాన్ని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి లాంచనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ భారత ప్రధాని జన్మదినాన్ని పురస్కరించుకుని నేడు “స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్” కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లడం జరుగుతుందని, మధ్యప్రదేశ్ ఇండోర్ లో నేడు భారత ప్రధాని చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించడం జరిగిందన్నారు. కేంద్రం, రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాలు మహిళలకు సంబంధించి అనేక పథకాలను అమలు చేస్తున్నాయన్నారు. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబ ఆరోగ్యంగా ఉంటుందన్నారు. తల్లి అనారోగ్యంగా ఉంటే ఆ కుటుంబం ముందుకు పోయే పరిస్థితి ఉండదన్నారు. ఆరోగ్యవంతమైన స్త్రీ దేశానికి అవసరమని, వైద్య పరీక్షలు, సూచనల ద్వారా ఆరోగ్యవంతమైన మహిళలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం సంకల్పించిందన్నారు. తల్లి గర్భిణీగా ఉన్నప్పుడు మంచి పౌష్టికాహారం అందించడం ద్వారా ఆరోగ్యకరమైన సంతానం కలుగుతుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని పౌష్టికాహారం అందించే ఆలోచనతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల కోట్లను ఖర్చు చేస్తున్నది అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. అవగాహన కోసమే నేడు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మహిళలు అన్ని రంగాలలో సాధికారత సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ కుటుంబంలో మహిళ బాగుంటే ఆ కుటుంబం అంతా బాగుంటుందనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ముఖ్యంగా మహిళ ఆరోగ్యం మీద కుటుంబ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అటువంటి మహిళలకు బాల్యం, కౌమారం, యవ్వనం, నడివయస్సు, వృద్ధాప్య దశలలో ఆరోగ్య సంరక్షణ కోసం స్వస్ట్ నారీ నశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు.

జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ సెప్టెంబరు 17వ తేదీ నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళలకు, ఆడపిల్లలకు 14 అంశాలలో వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మహిళ ఆరోగ్యం బలపడితే కుటుంబం మొత్తం సంతోషంగా ఆరోగ్యం ఉండగలనేదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో బాగంగా వైద్య శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి అక్టోబరు రెండో తేదీ వరకు అనగా 15 రోజుల పాటు వైద్య శిబిరాలను నిర్వహించడం జరుగుచున్నదని తెలిపారు. మహిళలు, కిశోర బాలికలకు స్క్రీనింగ్, రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులను ముందుగానే గుర్తించడం, నోటి క్యాన్సర్, రొమ్ముక్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ పరీక్షల నిర్వహణ, రిఫరల్ సేవలు అందించడం, కిశోర బాలికలకు, మహిళలకు రక్తహీనత పరీక్షల నిర్వహణ, చికిత్సలు చేయడం, క్షయపరీక్ష, పిల్లల్లో సికిల్సెల్ అనీమియాను గర్తించి వైద్య సేవలు అందించడం, గర్భిణీ ప్రసూతి పరీక్షలు, పిల్లలకు టీకా సౌకర్యం, గర్భవతుల పరీక్షల నిర్వహణ పోషకాహరం ఆవశ్యకత గురించి వివరణ, రక్తదాన శిబిరాల నిర్వహణ, ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డులు అందించడం ప్రత్యేక వైద్య శిబిరాల ద్వారా సేవలను అందించడం జరుగుతుందన్నారు. గ్రామస్థాయిలో వైద్య శాఖ, మహిళా శిశుసంక్షేమశాఖ, పంచాయతీరాజ్ శాఖ, మునిసిపల్ శాఖ, డీఆర్డీఏ, మొదలగు శాఖలు భాగస్వాములవుతాయని తెలిపారు. జిల్లాలో మొత్తం 471 ప్రాంతాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటుకు ప్రణాళికను సిద్ధం చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 31 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు. 18 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 368 హెల్త్ అండ్ వెల్త్ సెంటర్లు, ఒక జిల్లా ఆసుపత్రి, నాలుగు ఏరియా ఆసుపత్రు లు, మూడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు మొత్తం కలిపి 471 ప్రదేశాలలో, నేటి నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు ప్రతీ రోజూ ప్రత్యేక వైద్యశిబిరాలను వైద్యనిపుణులు, పారా మెడికల్ సిబ్బంది ద్వారా నిర్వహిస్తామని తెలిపారు.

సభ ప్రారంభానికి ముందు తొలుత సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 16 వరకు నిర్వహించే 8వ రాష్ట్రీయ పోషణ మాసం 2025 గోడ పత్రికను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి రాష్ట్రీయ పోషణ మాసం ప్రతిజ్ఞను అందరితో చేయించారు.

సమావేశం అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ కేకును కట్ చేశారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు సీమంతం కార్యక్రమం, పౌష్టికి ఆహారం కిట్స్ అందజేయడం, రక్తదాన శిబిరం పరిశీలన, ఆస్పటల్ ఆసుపత్రి ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జి. గీతా బాయి, ఐ సి డి ఎస్ పిడి డి.శ్రీలక్ష్మి, డిసిహెచ్ఎస్ పి.సూర్యనారాయణ, ఎన్టీఆర్ ట్రస్ట్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ కీర్తి శ్రవణ్, హాస్పటల్ సూపరింటెండెంట్ గీత భవాని, డాక్టర్ బిలాల్, బిజెపి జిల్లా అధ్యక్షురాలు ఐయినంపూడి శ్రీదేవి జేఎస్పీ ప్రతినిధి జుత్తిగ నాగరాజు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

2.11 2.22 2.33