పిజిఆర్ఎస్ ఫిర్యాదుదారుల దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం వహించే అధికారులపై చర్యలు తప్పవు–జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి.
పిజిఆర్ఎస్ లో అందిన అర్జీల పరిష్కారం పారదర్శకత, నాణ్యతతో ఉండాలి.
ఫిర్యాదుదారులతో మాట్లాడి నిర్ణీత గడువలోపున పరిష్కారం చూపాలి.
సోమవారం జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి తో పాటు డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, గ్రామ వార్డు సచివాలయ అధికారి వై.దోసి రెడ్డి, డ్వామా పిడి డా.కెసిహెచ్ అప్పారావు, జిల్లా సర్వే అధికారి కె.జాషువా, జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి 219 ఫిర్యాదులను స్వీకరించడం జరిగిందని తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినందున అధికారులు ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించి ఫిర్యాదుల నాణ్యమైన పరిష్కారంపై దృష్టి పెట్టాలన్నారు.
పిజిఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారంపై సీఎంఓ నుండి అందిన ఫీడ్ బ్యాక్ నివేదిక అనుసరించి శాఖల వారీగా సమీక్షించారు. క్షేత్రస్థాయిలో డివిజనల్ స్థాయి అధికారులు పీజిఆర్ఎస్ ఫిర్యాదులు ఏ విధంగా పరిష్కరించారో జిల్లా స్థాయి అధికారులు పరిష్కార నాణ్యతను పర్యవేక్షించాలన్నారు. ఒక్కొక్క సందర్భంలో ఫిర్యాదులు పరిష్కారానికి కొంత సమయం అవసరం ఉన్నప్పుడు సంబంధిత విషయాన్ని ఫిర్యాదుదారులతో అధికారులు మాట్లాడాలన్నారు. ఫిర్యాదులు తమ పరిధిలోనివి కానప్పుడు వెంటనే సంబందిత శాఖకు ఎండార్స్ చేసి పంపాలని ఆదేశించారు. అర్జీలు రీఓపెన్ కాకుండా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఫిర్యాదుదారుల దరఖాస్తులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. పి జి ఆర్ ఎస్ సమావేశం మందిరం వెలుపల ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి అర్జీదారుల దరఖాస్తులను పరిశీలించి, ఆధార్ నెంబర్ ద్వారా ఆన్లైన్ టోకెన్ జారీ చేయాలని ఆయన అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా ఇ పి టి ఎస్ పోర్టల్లో ఫైల్స్ అప్లోడింగ్ పై అధికారులతో సమీక్షిస్తూ, తమ కార్యాలయాలలోని జీవోలు, ప్రొసీడింగ్స్, సర్కులర్లు, ఇతర డాక్యుమెంట్లు ఈపిటి ఎస్ పోర్టల్లో అప్లోడ్ చేసే ప్రక్రియను వేగవంతం చేసి నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని అధికారులను ఆదేశించారు.
ఈరోజు పీజీఆర్ఎస్ కి అందని దరఖాస్తులలో కొన్ని ఈ విధంగా ఉన్నాయి.
ఉండి మండలం, గోరింతోట గ్రామానికి చెందిన ముదిండి సారమ్మ తాను చిన్నతనం నుండి వికలాంగురాలునని, సొంత ఇల్లు కూడా లేదని, ప్రస్తుతం ఎన్టీఆర్ భరోసా వికలాంగ పెన్షన్ రూ.6 వేలు తీసుకుంటున్న అన్నారు. జీవనం కడు దుర్భరంగా ఉందని దయచేసి 15 వేల రూపాయలు పించం మంజూరు చేయాలని అర్జీ సమర్పించారు.
వీరవాసరం మండలం బాలేపల్లి గ్రామానికి చెందిన వీరవల్లి విజయ్ కుమారి తాను 16 సంవత్సరాల నుండి ఇదే గ్రామంలో నివసిస్తున్నానని ఇప్పటివరకు ప్రభుత్వం నుండి ఇంటి స్థలం మంజూరు కాలేదని, ఇంటి స్థలం మంజూరు చేయాలని అర్జీని సమర్పించారు.
భీమవరం మండలం మత్స్యపురి గ్రామానికి చెందిన కురెళ్ళ శేష వేణి అర్జీని సమర్పిస్తూ, తనకు 1.26 సెంట్లు భూమి మాత్రమే ఉందని,ఆన్లైన్లో 12 ఎకరాలుగా చూపుతున్నదని దయతో సరి చేయవలసిందిగా వినతి పత్రం సమర్పించారు.
అత్తిలి మండలం ఉనికిలి గ్రామానికి చెందిన శీలం సత్యనారాయణ తాను గత మూడు సంవత్సరాలుగా పక్షవాతంతో బాధపడుతున్నానని, వికలాంగ ధ్రువీకరణ పత్రం కూడా పొంది యున్నానని దయచేసి వికలాంగ పింఛను మంజూరు కోరుతూ అర్జీ సమర్పించారు.
వీరవాసరం మండలం అండలూరు గ్రామానికి చెందిన మరిడి యజ్ఞ శ్రీనివాస్ అర్జీ సమర్పిస్తూ తనకు 27 సెంట్లు భూమి ఉందని, ఆన్లైన్లో 3 సెంట్లు మాత్రమే చూపిస్తున్నదని, దయచేసి తన పేరును 27 సెంట్లు భూమి నమోదు చేసి పాసుబుక్ ఇప్పించాలని కోరారు.
పాలకోడేరు మండలం వెండ్ర గ్రామానికి చెందిన వీరవల్లి విజయలక్ష్మి అర్జీని సమర్పిస్తూ, నా కుమారుడు నన్ను మోసం చేసి నా ఇంటిని తన పేరు మీద మార్చుకుని తన్ను చూడటం లేదని,దయచేసి తన ఇంటిని తనకు ఇప్పించాలని కోరారు.
వికలాంగుల హక్కుల జాతీయ వేదిక, పశ్చిమగోదావరి
జిల్లా కమిటీ వినతి పత్రం సమర్పిస్తూ, విభిన్న ప్రతిభావంతుల హక్కుల పరిరక్షణ చట్టం 2016 పూర్తి స్థాయిలో అమలు చేయాలని, జీవో నంబర్ 43 ను రద్దుచేసి పాత సదరం సర్టిఫికెట్లు కొనసాగించాలని, విభిన్న ప్రతిభావంతులకు రెగ్యులర్ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని,స్వయం ఉపాధికి 50 శాతం సబ్సిడీతో బ్యాంకుల నుండి రుణాలు ఇప్పించాలని, విభజిత జిల్లాలలో విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడి కార్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
సమావేశంలో డిపిఓ ఎం.రామనాథరెడ్డి, డి ఎం అండ్ హెచ్ ఓ జి.గీతా బాయి, డీఎస్ఓ ఎం.సరోజ మున్సిపల్ కమిషనర్ కె. రామచంద్రారెడ్డి, వయోవృద్ధుల సంక్షేమ ట్రిపునల్ సభ్యులు మేళం దుర్గాప్రసాద్,వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
