Close

జిల్లాలో నిర్మాణం పూర్తిఅయిన మల్టీపర్పస్ గోడౌన్లను తక్షణమే వినియోగంలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు.

Publish Date : 09/09/2025

మంగళవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సహకార శాఖలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాకు నాబార్డ్ మంజూరు చేసిన 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 24 మల్టీ పర్పస్ గోడౌన్స్ లో 14 పూర్తి చేయడం జరిగిందని, ఇంకా 10 గోడౌన్ల నిర్మాణాలను పూర్తి చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతానికి పూర్తయిన 14 గోడౌన్లు వాడ్రా రిజిస్ట్రేషన్లను కూడా పూర్తి చేసి, పిఎసిఎస్ లకు అప్పగించడం జరిగిందన్నారు. ఇప్పటికే పూర్తయిన గోడౌన్లను తక్షణమే వినియోగంలో తీసుకురావాలని ఆదేశించారు. కౌలు రైతులకు డిసిసిబి బ్యాంక్ విస్తృతంగా పంట రుణాలు అందజేయాలని ఆదేశించారు. ప్రాథమిక వ్యవసాయ క్రెడిట్ సొసైటీలను అత్యున్నత సంస్థలకు, గ్రామాలను, నగరాలకు, మండలాలను, ప్రపంచ మార్కెట్లకు, రాష్ట్ర డేటాబేస్‌లను, అంతర్జాతీయ డేటాబేస్‌లకు అనుసంధానించడంలో డేటాబేస్ ప్రధాన పాత్ర పోషిస్తుందని, తద్వారా సహకార సంస్థల విస్తరణను ప్రోత్సాహంగా ఉంటుందన్నారు. జిల్లాలో ఉన్న మొత్తం 688 సొసైటీలను జనవరి 31, 2025 నాటికి నూరు శాతం కంప్యూటర్రైజేషన్ చేయడంతో పాటు, నేషనల్ కోఆపరేషన్ డేటా బేస్ పోర్టల్ లో ఆడిట్ రిపోర్ట్ లను కూడా అప్లోడ్ చేయడం జరిగిందని తెలిపారు. సహకార సంస్థల ద్వారా భారతదేశంలో నాణ్యమైన విత్తనాల ఉత్పత్తిని పెంచడంలో భారతీయ బీజ్ సహకార సమితి లిమిటెడ్ (బిబిఎస్ఎస్ఎల్) సహాయం చేస్తుందన్నారు. దీని వలన దిగుమతి చేసుకున్న విత్తనాలపై ఆధారపడటాన్ని తగ్గించడం, వ్యవసాయ ఉత్పత్తిని మెరుగుపరచడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం అందించడం జరుగుతుందన్నారు. బిబిఎస్ఎస్ఎల్ లో జిల్లాలోని 121 సంఘాలు సభ్యత్వానికి దరఖాస్తు చేసుకున్నాయని, 98 సంఘాలు సభ్యత్వం పొందాయన్నారు. పాడి పరిశ్రమ, మత్స్య సహకార సంఘాలు రాబోయే ఐదు సంవత్సరాలలో ప్రతి పంచాయతీ, గ్రామాన్ని కవర్ చేస్తూ 2 లక్షల కొత్త బహుళార్ధసాధక పిఎసిఎస్ లు గా కానీ, లేదా ప్రాథమిక పాడి పరిశ్రమ, మత్స్య సహకార సంఘాలను ఏర్పాటు చేయడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు.

ఈ సమావేశంలో జిల్లా సహకార శాఖ అధికారి మురళీకృష్ణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, మత్స్య శాఖ ఏడి ప్రసాదరావు, నాబార్డ్ డీడియం నిష్యంత్ లింగారెడ్డి, డిసిసిబి జిఎం కే.శ్రీనివాస్, ఆప్కాబ్ డిపిడిఎం పి.పరమేష్, మార్కిటింగ్ శాఖ డిఈ రామారావు, ZP డిప్యూటీ సీఈవో, డీఎస్ఓ సరోజ, ఎఫ్సీఐ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.