ప్రభుత్వ సర్వీసులో కష్టపడి పనిచేస్తుంటే గుర్తింపు తానంతట అదే వస్తుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ కె.వి.ఎస్ నాగలింగాచార్యులు పదవి వివరణ సందర్భంగా భీమవరం మార్కెట్ యార్డ్ ఎదురుగా ఉన్న ప్రైవేటు కల్యాణ మండపం నందు ఏర్పాటుచేసిన వీడ్కోలు సభలో బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంలో జెడి నాగలింగాచార్యులను కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు పుష్పగుచ్చాన్ని అందజేసి, దుశ్యాలువాతో సన్మానించి, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాకు ఆక్వారంగం ఎంతో ముఖ్యమైనదని, గత సంవత్సరంగా మత్స్య శాఖ కార్యక్రమాల్లో ఏ విధమైన లోటుపాట్లు రాకుండా సమర్థవంతంగా నాగలింగాచార్యులు సర్వీసును అందజేశారని కొనియాడారు. మత్స్యకారులకు కొత్త కొత్త శిక్షణలు, సీవీడ్ శిక్షణను అందించడంలో కృషి చేశారన్నారు. 33 ఏళ్ల సర్వీసులో మత్స్య శాఖకు ఎంతో ఉత్తమమైన సేవలను అందించిన సమయంలో తోడ్పాటునందించిన వారి తల్లి రాజరాజేశ్వరి, వారి భార్య సహకారం ఎంతో గొప్పది అన్నారు. ఎంతో సౌమ్యంగానే ఉంటూనే బాగా పని చేసిన నాగలింగాచార్యులు పదవి వివరణ అనంతరం సుఖ సంతోషాలతో ఉండాలని, వారి సేవలను ఇకముందు కూడా కొనసాగించాలని జిల్లా కలెక్టర్ అన్నారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈమధ్య జిల్లాలో కష్టపడి పని చేసే కొంత మంది అధికారులు పదోన్నతి లేదా వయోపరిమితమై పదవి వివరణ కారణంగా సర్వీసులను పొందలేకపోవడం బాధాకరంగా ఉందన్నారు. నాగలింగాచార్యులు సౌమ్యంగా ఉంటూనే జిల్లా మత్స్య శాఖలో వారికి ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారన్నారు. మంచి సర్వీసులు అందించడం ద్వారా జిల్లాకు, వ్యక్తిగతంగా మంచి గుర్తింపు తెచ్చుకోవచ్చని, దీనికి నాగలింగాచార్యులు ఒక ఉదాహరణ అన్నారు.
ఈ కార్యక్రమంలో మత్స్య శాఖ అడిషనల్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా మత్స్య శాఖ అధికారి అయ్య నాగరాజు, జాయింట్ డైరెక్టర్లు లాల్ మహమూద్, సురేష్, రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ యాకూబ్ భాషా, జిల్లా మత్స్య కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు మైల వసంతరావు, ప్రాన్ అసోసియేషన్ సెక్రటరీ సుబ్బరాజు, మత్స్య శాఖ అధికారులు, సిబ్బంది, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.