• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

రోడ్డు భద్రతకు అధికారులు ఎప్పటికప్పుడు పటిష్టమైన చర్యలు చేపట్టి, ప్రమాదాలు నివారణకు గట్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Publish Date : 29/08/2025

శుక్రవారం జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన రోడ్డు భద్రత కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ, పోలీస్, రవాణా, ఆర్ అండ్ బి, వైద్యశాఖ శాఖల అధికారులతో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన భద్రత చర్యలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం జనవరి నుండి జూలై వరకు 124 ఘోర ప్రమాదాలు (స్పాట్ డెడ్), 106 తీవ్ర క్షతగాత్రుల ప్రమాదాలు జరగగా మెత్తం 129 మరణాలు సంభవించాయని, అలాగే గత సంవత్సరం జనవరి టు జూలై వరకు 130 ఘోర ప్రమాదాలు (స్పాట్ డెడ్), 140 తీవ్ర క్షతగాత్రుల ప్రమాదాలు జరగగా మెత్తం 150 మరణాలు సంభవించినట్లు తెలిపారు. వాహనదారులు హెల్మెట్ వాడకపోవడం, సెల్ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవ్ చేయడం, త్రిబుల్ రైడింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, రోడ్ల మలుపు ప్రాంతాలలో ఎక్కువగా ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. జిల్లాలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయడం, హెల్మెట్ ధరించకపోవడం, మొబైల్ ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేయడం, త్రిబుల్ రైడింగ్ వంటి వాటిపై కేసులు నమోదు చేసి అపరాధ రుసుము వసూలు చేయడం జరిగిందన్నారు. రోడ్డు నిబంధనలు పాటించని వాహన యజమానులపై కేసు నమోదు చేసి వాహనాలు సీజ్ చేయాలన్నారు. వాహనదారులు ఇష్టానుసారం రోడ్ల పక్కన వాహనాలు పార్కింగ్ చేయకుండా మార్కింగ్ చేసి ఆ ప్రదేశాల్లోనే వాహనాలు పార్కింగ్ చేసుకునే విధంగా ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు. రోడ్ల జంక్షన్ ల వద్ద, ముఖ్యమైన ప్రదేశాల్లో తప్పనిసరిగా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. రోడ్లపై విచ్చలవిడిగా పశువులు సంచరించడం వల్ల కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఒక షెడ్ ని ఏర్పాటు చేసి అందులో పశువులను ఉంచేందుకు, వాటి పోషణకు స్వచ్ఛంద సంస్థల సహకారానికి చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులందరూ సమన్వయతో పనిచేసి జిల్లాలో ఎటువంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప టిష్టమైన భద్రత చర్యలు చేపట్టాలన్నారు. కృషి విజ్ఞాన కేంద్రం రోడ్డు మార్జిన్ లు ఎగుడు, దిగుడులు కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని సమావేశం దృష్టికి తీసుకురాగా, పోలీస్, రవాణా, ఎన్ హెచ్ అధికారులు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి సమస్యను పరిష్కరించాలన్నారు. శ్రీరాంపురం ప్రాంతంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుచున్నాయని, శ్రీరాంపురం నుండి లోసరీ వరకు ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయడంతో పాటు, హైవే పెట్రోలింగ్ వాహనం ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని నరసాపురం ఆర్టీవో సమావేశం దృష్టికి తీసుకురాగా, జిల్లా కలెక్టర్ స్పందిస్తూ సైన్ బోర్డులు ఏర్పటుతోపాటు, హైవే పెట్రోలింగ్ వాహనం కొరకు ప్రతిపాదనలను పెట్టాలని ఆదేశించారు.

జిల్లా పోలీస్ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ సీటు బెల్టు, హెల్మెట్ విధిగా ధరించాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. యాక్సిడెంట్ కేసులు సంబంధించిన సమాచారాన్ని ఎస్ హెచ్ ఓ లు ఐరాడ్ సైట్లో తప్పక నమోదు చేయాలన్నారు.

ఈ సందర్భంగా గత సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యల నివేదికను జిల్లా రహదారులు భవనాల శాఖ అధికారి ఎ.శ్రీనివాస్ సమావేశంలో వివరించారు.

ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా అడిషనల్ ఎస్పీ వి.భీమారావు, జిల్లా రహదారులు భవనాల శాఖ అధికారి ఎ.శ్రీనివాస్, ఇంచార్జ్ జిల్లా రవాణా అధికారి డి ఎస్ ఎస్ నాయక్, ఆర్డీవోలు దాసిరాజు, కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఖతీబ్ కౌసర్ భానో, డీఎస్పీ లు జై సూర్య, శ్రీ వేద, డి.విశ్వనాథ్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆర్.వి ప్రసాద్ రెడ్డి, డిఎంహెచ్వో డాక్టర్ జి.గీతాబాయి, డిసిహెచ్ఎస్ పి.సూర్యనారాయణ, భీమవరం మున్సిపాలిటీ సహాయ కమిషనర్ రాంబాబు, డీఈఓ కార్యాలయం ఏడి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.