Close

మాదకద్రవ్యాల నియంత్రణకు అధికారులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు

Publish Date : 29/08/2025

శుక్రవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి సంయుక్తంగా ఎన్ కార్డ్ (జిల్లా స్థాయి కమిటీ ఫర్ బెటర్ కోఆర్డినేషన్ ఇన్ కంట్రోలింగ్ గంజాయి & ఇతర మాదకద్రవ్యాల నియంత్రణ) పై సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో గంజాయి సాగు నియంత్రణ, రవాణా, అమ్మకం, వినియోగం, అవగాహన, గంజాయికి బానిసలు అయిన వారికి వైద్య సహాయం, పునరావాసం అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ మాదకద్రవ్యాలు వినియోగంపై అనర్ధాలను ప్రజలకు తెలియచెప్పేందుకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు. వీటిని సేవించడం వలన కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమవుతుందని, తీవ్ర అనారోగ్యానికి గురవుతారని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి వంటి మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు గుర్తిస్తే ఎక్కడ నుండి రవాణా అవుతున్నాయో వాటి మూలాలను గుర్తించేందుకు తగు చర్యలను తీసుకోవాలన్నారు. పాఠశాలలు, కళాశాలు, సంక్షేమ వసతి గృహాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలను చేపట్టాలన్నారు. జిల్లాలో పోలీస్, ఎక్సైజ్ శాఖలు మాదకద్రవ్యాలు వినియోగంపై పక్కాగా తనిఖీలు చేసి నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రైవేటు హాస్పిటల్స్ లో మత్తు పదార్థాలకు అలవాటు పడి చికిత్స పొందుతున్న కేసులు ఏమైనా ఉన్నాయా అనేది పరిశీలించాలని డిఎంహెచ్ఓను ఆదేశించారు.

జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ 2025 జనవరి నుండి నేటి వరకు ఎన్ డి పి ఎస్ యాక్ట్ కింద 8 కేసులు నమోదయాయని, 33 మందిని అరెస్టు చేయడం జరిగిందని, 25.286 కిలోల గంజాయిని సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. దీనికి సంబంధించి ఒక వాహనాన్ని కూడా సీజ్ చేయడం జరిగిందన్నారు. మాదకద్రవ్యాలు వినియోగిస్తే కలిగే అనర్ధాలపై 86 పాఠశాల సమీపంలో, 225 కళాశాలల సమీపంలో గోడ పత్రికలను అంటించడం జరిగిందని, జిల్లాలోని 71 ప్రముఖ కూడళ్ళల్లో కూడా హోర్డింగ్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే 295 కాలేజీలు వద్ద, 589 బహిరంగ ప్రదేశాల్లో, 56 గ్రామాల్లో అవగాహన కొరకు సమావేశాలను కూడా నిర్వహించడం జరిగిందని వివరించారు. జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు గట్టి చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.

ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా అడిషనల్ ఎస్పీ వి. భీమారావు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆర్.వి ప్రసాద్ రెడ్డి, ఇంచార్జ్ జిల్లా రవాణా అధికారి డి ఎస్ ఎస్ నాయక్, ఆర్డీవోలు దాసిరాజు, కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఖతీబ్ కౌసర్ భానో, డీఎస్పీ లు జై సూర్య, శ్రీ వేద, డి.విశ్వనాథ్, డిఎంహెచ్వో డాక్టర్ జి.గీతాబాయి, డిసిహెచ్ఎస్ పి.సూర్యనారాయణ, ఐసీడీఎస్ పీడీ డి.శ్రీలక్ష్మి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి వి వి ఎస్ బి రామాంజనేయ రాజు, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ కే వెంకటేశ్వరరావు, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పుష్ప రాణి, పిడి డిఆర్డిఏ ఎంఎస్ఎస్ వేణుగోపాల్, డీఈఓ కార్యాలయం ఏడి సత్యనారాయణ, ఈగల్ టాస్క్ ఫోర్స్ ఎస్సై, తదితరులు పాల్గొన్నారు.