సముద్రపునాచు సాగు ద్వారా ఎస్ హెచ్ జి లు అదనపు ఆదాయం ఆర్జించడానికి తోడ్పాటునందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు
గురువారం నరసాపురం మండలం పెద్దమైనవానిలంక డిజిటల్ భవన్ నందు జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్ట్యూట్ సహకారంతో ఎస్ హెచ్ జి మహిళలకు అందిస్తున్న సముద్రపునాచు సాగు శిక్షణా తరగతులకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తున్నారన్నారు. చేపల వేట మాత్రమే కాకుండా, ఇతర ఉత్పత్తుల ద్వారా కూడా ఆదాయాన్ని పొందవచ్చు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తీరప్రాంతం అయిన చినమైనవానిలంక, పేరుపాలెం బీచ్ ప్రాంతాలలో త్వరలో పైలట్ ప్రాజెక్టుగా సీవీడ్ సాగు చేసేందుకు స్వయం సహాయక బృందాలకు శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. దీనిలో భాగంగా సముద్రపునాచు సాగు ద్వారా ఆదాయాన్ని పొందేందుకు నేడు శిక్షణా తరగతులను ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రతి కార్యక్రమం ప్రారంభంలో లాభనష్టాలపై ఆలోచనలు చేయడం సహజమని, శిక్షణ సమయాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇక్కడ శిక్షణ అనంతరం విశాఖపట్నంలో ప్రాక్టికల్స్ గా ప్రాజెక్టును చూపించడం జరుగుతుందని తెలిపారు. ప్రాజెక్ట్ ఏర్పాటుకు ఎస్ హెచ్ జి లకు అవసరమైన రుణ సదుపాయాన్ని అందించడంతోపాటు, అన్ని విధాలుగా జిల్లా యంత్రాంగం అండగా నిలుస్తుందన్నారు. ఇది తక్కువ ఖర్చుతో కూడిన స్థిరమైన ఆదాయ వనరుగా చెప్పవచ్చన్నారు. దీనికి ఎరువులు, మంచినీరు లేదా వ్యవసాయ యోగ్యమైన భూమి అవసరం లేదని, కేవలం సముద్రం లోపల సాగు చేయడం అని తెలిపారు. సముద్రపునాచు సాగుకు 40 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆహారం, ఔషధ, సౌందర్య సాధన రంగాలలో పెరుగుతున్న డిమాండ్‌తో సముద్రపు నాచు సాగు ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోందన్నారు. ఇది విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ మరియు యాంటీ-ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయని, ఇది ఆహారం మరియు వైద్య ఉత్పత్తులకు విలువైనదిగా ఉందన్నారు. మంచి ఫలితాలు వచ్చేలాగా కృషి చేయాలి అన్నారు.
మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ కెఎస్వి నాగలింగాచార్యులు మాట్లాడుతూ మల్టీపాయింట్ మూరింగ్ వ్యవస్థతో తేలియాడే హై-డెన్సిటీ పాలిథిలిన్ తెప్పలను ఉపయోగించి ట్యూబ్-నెట్ టెక్నిక్ అభివృద్ధి చేయబడి సముద్రపునాచు సాగు చేయడం జరుగుతుందన్నారు. తీరం నుండి 100 మీటర్ల దూరంలో నిర్వహించబడుతుందని, స్థానికులకు గణనీయమైన ఆదాయాన్ని అందిస్తుందన్నారు. పొడి సముద్రపు పాచి కిలోకు రూ.80 -100 ధర లభిస్తుందన్నారు. కప్పాఫికస్, గ్రాసిలేరియా వంటి అధిక-విలువైన జాతుల సాగుపై దృష్టి సారించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో విశాఖపట్నం సీ.ఎం.ఎఫ్.ఆర్.ఐ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ జయశ్రీ, డి ఆర్ డి ఏ పిడి ఎంఎస్ఎస్ వేణుగోపాల్, జిల్లా మత్స్య కోపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ మైల వసంతరావు, పెదమైనవాని లంక సర్పంచ్ కొల్లాటి కనకదుర్గ, మత్స్య శాఖ ఏడి ఎల్ ఎల్ ఎన్ రాజు, తహసిల్దార్ ఐ వి వి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.