శ్రీ వెంకటరమణ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం.. సేవా దృక్పథంతో మరింత మంది ముందుకు రావాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
గురువారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తాడేపల్లిగూడెం మండలం అలంపురంలోని శ్రీ వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత హాస్పిటల్ ను సందర్శించి, హాస్పిటల్ ద్వారా రోగులకు అందిస్తున్న చికిత్సల వివరాలను అడిగి తెలుసుకున్నారు. హాస్పటల్లో వివిధ విభాగాలను, వైద్య పరికరాలను పరిశీలించి ట్రస్ట్ నిర్వాహకులను అభినందించారు. అనంతరం రోగులకు పళ్ళు పంపిణీ చేయడంతో పాటు, దివ్యాంగులు ప్రేమతో అందించిన గులాబీ పువ్వులను ఆప్యాయతతో పలకరిస్తూ తీసుకొని చిన్నారులను సంతోషపరిచారు. తొలుత జాతీయ రహదారికి ఆనుకుని ట్రస్ట్ నూతనంగా నిర్మించనున్న హాస్పిటల్ కొరకు కొనుగోలు చేసిన నాలుగు ఎకరాల విస్తీర్ణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ శ్రీ వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్ ఇంత పెద్ద ఎత్తున ఉచిత హాస్పిటల్ ను నిర్వహించడం చాలా గొప్ప విషయం అన్నారు. చికిత్సకు ఇక్కడికి వచ్చిన ప్రజలను చూస్తేనే ట్రస్ట్ సేవలు ఎలా ఉన్నాయో అర్థం అవుతుందన్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని మరింత మంది ప్రజలకు వివిధ సేవలను అందించడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ట్రస్టు నిర్వాహకులు, వారి కుటుంబ సభ్యులు ప్రజలకు మరింత సేవలందించేందుకు చక్కటి ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంలో శ్రీ వెంకటరమణ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఉచిత హాస్పిటల్ నిర్వాహకులు కొలనువాడ పెద్ద కృష్ణంరాజు, వారి కుమారుడు కె.వి.రాజు, తాడేపల్లిగూడెం ఆర్డిఓ ఖతీబ్ కౌసర్ భానో, తహసిల్దార్ టి.రాజేశ్వరి, తదితరులు ఉన్నారు.
